పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్‌కు దాడి, కొణతాల, సబ్బం రెడీ
ఆత్మీయ పలకరింపు పేరుతో హరి సిగ్నల్స్
మంత్రి గంటాతో వీరభద్రరావు రాజకీయ చర్చలు
ప్రజా పోరాటాలకు పదును పెడుతున్న కొణతాల
ప్రత్యేకప్రతినిధి-ఫీచర్స్ఇండియా
విశాఖ జిల్లాకు చెందిన ముగ్గురు కీలక రాజకీయ నేతలు అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి రాజకీయ కురుక్షేత్రంలోకి రావడానికి కదన కుతుహలంతో ఉన్నారు. మాజీ మంత్రు లు దాడి వీరభద్రరావు, కొణతాల రామకృష్ణ, మాజీ ఎంపీ సబ్బం
హరి గత కొద్ది సంవత్సరాలుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ముగ్గురు నేతలు మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టి చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. 2014 ఎన్నికలు ముగియగానే వైసీపీకి గుడ్ ్బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్న దాడి వీరభద్రరావు అనూహ్యంగా ఆదివారం జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో చర్చలు జరిపారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు బయటకు చెబుతున్నప్పటికీ, దాడి పునప్రవేశానికి తెరవెనుక మంత్రాంగం జరుగుతోందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. అలాగే మరో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా 2014 ఎన్నికలు తర్వాత వైసీపీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయ పార్టీల్లో చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రజలతో మాత్రం మమేకమవుతూ వస్తున్నారు. జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై పోరాటాలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు 2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన కూడా పొలిటికల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక మాజీ ఎంపీ సబ్బం హరి కూడా 2014 ఎన్నికలకు ముందే రాజకీ అస్త్ర సన్యాసం చేసి ఖాళీగా ఉన్నారు. అయితే హఠాత్తుగా రెండు రోజుల క్రితం ఆత్మీయ పలకరింపు పేరుతో కార్యకర్తలకు, ప్రజలకు ఆయనో లేఖను విడుదల చేసారు. త్వరలోనే తన వైఖరిని స్పష్టం చేస్తానని చెబుతూ క్రీయాశీల రాజకీయాలకు వస్తున్నట్లుగా సంకేతాలు పంపారు. దీంతో గత నాలుగేళ్లుగా రాజకీయంగా ముసుగేసిన ఈ ముగ్గురు మాజీలు ఇప్పుడు రాజకీయ మసుగును తీస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలంగా ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. తన కుమారుడు రత్నాకర్‌ను వైసీపీలో పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపారు. ఆయన ఓటమిపాలు కావడం, వైసీపీలో పరిస్థితులు అనుకూలంగా లేవంటూ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే వైసీపీకి గుడ్‌బై చెప్పారు. అప్పటి నుంచి ఆయన రాజకీయంగా అంతగా చైతన్యవంతంగా లేరు. అనకాపల్లి ప్రాంతంలో కొన్ని సమస్యలపై అప్పుడప్పుడు స్పందిస్తున్నప్పటికీ రాజకీయంగా మాత్రం మౌనంగానే ఉన్నారు. దీంతో దాడి వీరభద్రరావు రాజకీయ భవితవ్యం ఏమిటి? ఆయన కుమారుడు రత్నాకర్‌ను ఏ విధంగా నడిపిస్తారనే ప్రశ్నలు అందరిలోనూ చాలాకాలంగా ఉన్నాయి. దాడి తిరిగి సొంత గూటికి చేరుతారా? లేక వైసీపీకే మళ్లీ వెళతారా? వంటి అనుమానాలు కార్యకర్తల్లోనూ, ప్రజల్లోనూ బలంగానే ఉన్నాయి. కానీ ఇన్నాళ్లూ ఆయన ఎక్కడా రాజకీయంగా బయటపడలేదు. అయితే ఈ ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి వీరభద్రరావు జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. నీటిపారుదల సమస్యలపై ఇద్దరు చర్చించారని చెబుతున్నప్పటికీ రాజకీయ చర్చలేనంటూ ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత గతంలో కూడా దాడి విశాఖ సర్క్యూట్‌హౌస్‌లో కలసి సమావేశమయ్యారు. అప్పుడు కూడా స్థానిక సమస్యలమీదేనని చెప్పారు. ఇప్పుడు కూడా అంతేనా, లేక 2019 ఎన్నికల కోసం సన్నాహాక చర్చలా అన్న అనుమానాలు అందిరలోనూ మొదయ్యాయి.
ఇక కొణాతల రామకృష్ణ వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఇటు ప్రజలకు, అటు రాజకీయాలకు కూడా పూర్తిగా దూరంగా ఉన్నారు. కొద్ది సంవత్సరాల క్రితం కొణతాల తన అనుచరుడు గండి బాబ్జీని తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లే గండి బాబ్జీ కూడా టీడీపీలో చేరారు. కానీ కొణతాల మాత్రం చేరలేదు. ఏ పార్టీలోనూ చేరకుండా దూరంగానే ఉన్నారు. ఇటీవల మాత్రం ఆయన ప్రత్యేకహోదా కోసం, రైల్వేజోన్ కోసం, విశాఖ విమ్స్ కోసం, డీసీఐ ప్రైవేటీకరణకు నిరసనగా ఉద్యమాలు చేపడుతున్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కోసం మౌనదీక్ష కూడా చేపట్టారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజా సమస్యలపై పోరాటాలకు ఉద్యమ కార్యాచరణతో కొణతాల సిద్ధంగా ఉన్నారు. ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ, రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించేందుకు ప్రజలతో మమేకమై ఉన్నట్లుగా ఆయన స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. కొద్దిరోజుల్లోనే కొణతాల అడుగులు ఏ పార్టీ వైపో స్పష్టత రానుంది.
ఇక మాజీ ఎంపీ సబ్బం హరి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వెళ్లిన తర్వాత జగన్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. అనూహ్యంగా వైసీపీని వదిలేసి ఆయన అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పక్షాన నిలిచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించారు. 2014 ఎన్నికలకు కిరణ్ సారథ్యంలో జై సమైక్యాంధ్ర పార్టీలో తరుఫున విశాఖ ఎంపీగా నామినేషన్ కూడా దాఖలు చేసిన సబ్బంబహరి చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకుని బీజేపీ – టీడీపీ తరుఫున పోటీ చేసిన హరిబాబుకు మద్దతు పలికారు. హరిబాబు ఎన్నికల్లో గెలిచిన తర్వాత సబ్బం హరి ఇంటికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత నుంచి సబ్బం హరి కూడా రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అప్పుడప్పుడు టీవీ ఛానల్ చర్చా కార్యక్రమాల్లో మాత్రం సబ్బం హరి సమకాలీన రాజకీయాలపై తనదైనశైలిలో స్పందించేవారు. అంతేగానీ ఏ పార్టీకి మద్దతుగానీ, వ్యతిరేకంగా గానీ వ్యవహరించలేదు. అయితే రెండు రోజుల క్రితమే సబ్బం హరి ఓ లేఖను విడుదల చేయడం సంచలనం కలిగించింది. ఆత్మీయ పలకరింపు పేరుతో విడుదల చేసిన లేఖలో తాను రాజకీయాల్లో లేనప్పటికీ, ప్రజలకు, కార్యకర్తలకు, తన అభిమానులకు నిత్యం అందుబాటులో ఉన్నానని, త్వరలోనే తన రాజకీయ కార్యచరణను ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేసారు. దీంతో 2019 ఎన్నికలకు సబ్బం హరి సిద్ధమవుతున్నట్లు స్పష్టమైంది. దీంతో 2014 ఎన్నికల తర్వాత రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్లిన ఈ ముగ్గురు మాజీ వైసీపీ నేతలు 2019 ఎన్నికల కోసం కదన కుతూహలంతో అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు.