నాలుగున్నర టన్నుల సీ హేరియర్ మణిహారం
అండర్ గ్రౌండ్ నుంచి కురుసురకు వెళ్లేందుకు రెండు మార్గాలు
ఆకట్టుకోన్ను మ్యూజిక్ కేంద్రం, హంపీ థియేటర్
వుడా వీసీ బసంత్‌కుమార్ వెల్లడి
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ఇంటిగ్రేటెడ్ టూరిస్ట్ మ్యూజిక్ కేంద్రాన్ని బీచ్‌రోడ్‌లో ఏర్పాటు చేస్తున్నామని వుడా వీసీ బసంత్‌కుమార్ తెలిపారు. ఆయన చాంబర్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే చోట వివిధ రకాల ప్రదర్శనా కేంద్రాలను ఏర్పాటు చేయడం విశాఖలోనే జరుగుతుందన్నారు. స్మృతి భవనం దగ్గర నుంచి వైఎంసీఏ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్లేస్ వరకూ ఉన్న స్థలంలో అండర్‌గ్రౌండ్ పార్కింగ్ వ్యవస్థను నెలకొల్పుతున్నామన్నారు. పై భాగంలో సీ హేరియర్ను రూ.10కోట్లతో, ఏవియేషన్ కాంప్లెక్స్ రూ.20కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రంలోనే ఏవియేషన్‌కు సంబంధించిన అంశాలతో పాటు నాలుగున్నర టన్నుల బరువైన సీ హేరియర్, అధునాతన మ్యూజిక్ కేంద్రం ఇవన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తున్నామన్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను వుడా నిర్మించడం వల్ల నామమాత్రపు రుసుముకే వాహనాలు పార్కింగ్చేసుకునే సదుపాయం కల్పింస్తామన్నారు. బీచ్‌రోడ్‌లో రోడ్డుపై ఎక్కడా వాహనాలు నిలపకుండా, ఈ అండర్ గ్రౌండ్‌లోనే
వాహనాలు నిలుపుదల చేసేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 700 నుంచి 900వరకూ కార్లు పార్కింగ్ చేసుకోవడానికి, 4వేల వరకూ బైక్‌లు పార్క్ చేసుకునేలా ఇన్నోవేటివ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్‌ను నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడే కన్వెన్షన్ హాలుతో పాటు సందర్శకులను అలరించేందుకు అవసరమైన మ్యూజిక్ కేంద్రాలు, ¬టల్స్, షాపింగ్‌మాల్స్ రాబోతున్నాయన్నారు. 15రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకుని నూతనంగా రూపొందించిన నివేదికను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి ఆమోదం తీసుకున్న తరువాత తదుపరి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో రాజీవ్ స్మృతిభవన్, టియు-142 యుద్ధ విమాన మ్యూజియం, కురుసుర సబ్మెరైన్లు ఉన్నాయని వీటితో పాటు అధునాతనమైన మ్యూజికేంద్రం, సీ హేరియర్, హంపీ థియేటర్లు పర్యాటకులను మరింత ఆకర్షించనున్నాయని చెప్పారు. వుడా చిల్డ్రన్ ఎరీనా, గురజాడ కళాక్షేత్రం, వుడా కాంప్లెక్స్, హెచ్ఎస్బీసీల్లో కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్లు ఏర్పాటు చేసే ఆలోచన వుందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16నే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిగ్రేటెడ్ టూరిస్టు మ్యూజిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారని అన్నారు. మార్చి 15న గోవా వెళ్లి అక్కడ ఇంటిగ్రేటెడ్ కేంద్రాలను పరిశీలించామని, ఏప్రిల్ 4న సర్వే నిర్వహించామన్నారు. అప్పటి నుంచి ఇందుకు సంబంధించి డిపిఆర్‌ను తయారు చేస్తున్నామని చెప్పారు. కురుసుర మ్యూజియంలోకి వెళ్లేందుకు టియు-142 యుద్ధ విమాన మ్యూజియం ఒక మార్గం, విక్టరీ ఎట్ సీ నుంచి మరో అండర్ గ్రౌండ్ మార్గం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రెండు మార్గాల్లో పర్యాటకులకు ఎక్కడా బోరు కొట్టకుండా కాకతీయుల, చోళుల కాలం నుంచి వస్తున్న పలు చిత్రాలను, చారిత్రక సంఘటనలు ప్రదర్శిస్తామన్నారు. దాకమర్రి లే అవుట్‌కు సంబంధించి ఎల్ఐజీ ప్లాట్ల ధరలను ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదన్నారు. అనధికారిక లే అవుట్లను ఒక్క విజయనగరం జిల్లాలో 250 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో వుడా కార్యదర్శి శ్రీనివాస్, ఛీఫ్ అర్బన్ ప్లానర్ భవానీ శంకర్, ఛీఫ్ ఎకౌంట్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ పలువురు అధికారులు పాల్గొన్నారు.