పర్యటనల్లో ఎక్కడికక్కడ నిరసనలు
(ప్రత్యేకప్రతినిధి – ఫీచర్స్ఇండియా)
జనం మధ్యకు వచ్చిన జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌కు అభిమానులే తలనొప్పిగా మారారు. పవన్ కల్యాణ్ ప్రజా సమస్యల గురించి పోరాటానికి జనం ముందుకు వచ్చాడో లేక తన అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చా డో అన్నట్టుగా తయారైంది వ్యవహారం. శ్రీకాకుళం జిల్లా పర్యటనను ముగించుకుని విజయనగరంలోకి అడుగు పెట్టిన పవన్ కల్యాణ్‌కు అక్కడి అభిమానుల నుంచి ఇబ్బందులు మొదలైయ్యాయి. బొబ్బిలిలో పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ ముందు నానా రభస జరిగింది. పవన్ కల్యాణ్ బయటకు రావాలంటూ అక్కడ ఫ్యాన్స్ అలజడిరేపారు. దీంతో పీకే ఒకసారి వారిని పలకరించి వెళ్లాడు. దూరం నుంచి చేతులు ఊపుతూ వెళ్లాడు. అయితే అంతటితో అభిమానులు వెనక్కు తగ్గలేదు. పవన్ కల్యాణ్ మళ్లీ రావాలంటూ పట్టుబట్టారు. ఈ సమయం లో ఒక అభిమాని అయితే గోడకు తన తలను కొట్టుకుని నిరసన తెలిపాడు. పవన్ కల్యాణ్ బయటకు వచ్చే వరకూ తన తలను గోడకేసి బాదుకుంటానని అతడు ఆ పని చేశాడు. చివరకు పోలీసులు వారించి అతడిని అక్కడ నుంచి పంపించి వేశారు.
ఇదీ పరిస్థితి. అయితే ఇది మొదటి సారి కాదు. శ్రీకాకుళం పర్యటనలో ఒక గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు కూడా ఇదే కథ. పవన్ కల్యాణ్‌ను తాము చూడాల్సిందే అంటూ ఫ్యాన్స్ పట్టుబడ్డారు. చివరకు గెస్ట్ హౌస్ కు కరెంటు కట్ చేయడం వరకూ వెళ్లింది వ్యవహారం. అయితే అది తనపై జరిగిన హత్యాయత్నం అంటూ పవన్ కల్యాణ్ కవర్ చేశాడు. ఇలాంటి ఎగబడే ఫ్యాన్స్‌తో పవన్ కు లాభం కన్నా నష్టమే ఎక్కువని చెప్పవచ్చు. అభిమానం ఉంటే ఉండవచ్చు.. పవన్ కల్యాణ్ జనం కోసం వచ్చి ఉంటే అతడిని అలా వదిలేయాలి. ఇలా చేస్తే మాత్రం పవన్ కల్యాణ్ కేవలం ఫ్యాన్స్ మనిషే అనే ముద్రపడుతుంది. పవన్ రాజకీయ ఎదుగుదలకు పెద్ద నెగిటివ్ పాయింట్ అవుతుంది ఇది.