విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా: ప్రపంచం లోని ఏడు ఎతైన శిఖరాలలో ఒకటైన కిలిమంజారో పర్వతారోహణకు విశాఖపట్టణానికి చెందిన ముగ్గురు యువకులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన సర్వీసులు శాఖ వచ్చే నెల మొదటి వారంలో విజయవాడ బృందంలో ఈ ముగ్గురు స్థానం సంపాదించారు. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో గల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిం చేందుకు 40 మందిని యువకులను యువజన సర్వీసుల శాఖ ఎంపిక చేసింది. వారిలో విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం కొల్లివాని గ్రామానికి చెందిన పైల మణీంద్ర, పాడేరు మండలం వెగసపల్లి గ్రామానికి చెందిన బాల వెంకట మురళీకృష్ణ ప్రసాద్, సబ్బవరం మండలం నారపాడు గ్రామానికి చెందిన ఆర్.నానాజీ కిలిమంజారో వెళ్ళే బృందంలో స్థానం సంపాది ంచారు. 23 ఏళ్ళ మణీంద్ర పర్వాతారోహకునిగా ఎదగాలనే సంకల్పంతో సాధన చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని పలు పర్వతాలను అధిరోహించారు. 21 ఏళ్ళ నానాజీ డిగ్రీ పూర్తి చేయగా, మురళీకృష్ణ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు.
కిలిమంజూరో పర్వతారోహణ కోసం సాహసీకుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర యువజన సర్వీసులు శాఖ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా యువకుల కోసం బక్కన్నపాలెంలోని 16వ బెటాలియన్ పోలీసు గ్రౌండ్లో ఎంపిక నిర్వహించారు. వారిలో 12 మందిని ఎంపిక చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎంపికైన 140 మంది యువకులకు విజయవాడలోని సిబిఆర్ స్పోర్ట్స్ గ్రౌండ్లో మెరుగైన శిక్షణ ఇచ్చారు. వారిలో 60 మందిని జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో గల జవహర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటినేరింగ్కు ప్రత్యేక శిక్షణ కోసం పంపించారు. అక్కడ తొమ్మిది అంశాలలో పరీక్షలు నిర్వహించి 40 మందితో తుది బృందాన్ని ఎంపిక చేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు చెందిన సాహసీకులు ఈ బృందంలో ఉన్నారు. రఘునాధరెడ్డి సారధ్యంలో ఈ బృందం వచ్చె నెల మొదటి వారంలో కిలిమంజారో బయలుదేరి వెళ్తుంది.