హీరోగా పరిచయమై చాలా కాలం అవుతున్నా కానీ ఇంకా సుధీర్‌బాబుకి తగిన గుర్తింపు రాలేదు. అతని సినిమాలకి నామమాత్రపు ఓపెనింగ్స్ కూడా రాని పరిస్థితి నెలకొంది. మహేష్ బావమరిదిగానే కాకుండా మంచి కథలు ఎంచుకుంటాడనే పేరుని సుధీర్ తెచ్చుకున్నాడు.
కానీ ఎందుకో మహేష్ అభిమానుల నుంచి కూడా అతనికి సపోర్ట్ లేదు. అతను నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రానికి తొలిరోజున ఇరవై నుంచి ముప్పయ్ శాతం వసూళ్లు మాత్రమే వచ్చాయి. రెండవ రోజు వసూళ్లు కూడా గొప్పగా వుంటాయనిపించడం లేదు. టాక్ యావరేజ్‌గా వుండడంతో ఈ చిత్రానికి ఇక వసూళ్లు పెరిగే సూచనలు లేవు.
అతని గత చిత్రం సమ్మోహనం బాగుందనే టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవలేదు. అసలు నన్ను దోచుకుందువటే చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో ఎందుకు తీసాడనేది అర్థం కాలేదు. అది చాలా సాధరణ కథ. ఎవరైనా బయటి నిర్మాతని చూసుకుని వారికి ఈజీగా చేసి వుండేవాడు. కానీ ఇది పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో తనే నిర్మాతగా మారాడు. థియేటర్స్ నుంచి వసూలయ్యేది అంతగా ఏముండదని తేలిపోయింది కనుక శాటిలైట్, డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే డబ్బుతోనే గట్టెక్కాలేమో.