కేకే రాజుపై తిరుగుబావుటా………
సీనియర్లంతా రహస్య సమావేశం…….
శనివారం నుంచీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం………
ఒంటెద్దు పోకడలతో పని చేయలేమంటున్న సీనియర్లు…….
విశాఖపట్నం, ఫీచర్స్ ఇండియా : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహా సంకల్పయాత్ర పేరిట గత మాసంలో విశాఖలో పర్యటన సందర్భంగా నిర్వ హించిన కంచరపాలెం సభ విజయవంతం కావడంతో మంచి ఊపుమీదున్న ఆ పార్టీలో ఇప్పుడు ముసలం రాజుకుంది. అంతకు కొద్ది మాసాల ముందుగానే పార్టీ ఉత్తర నియోజక పగ్గాలు చేపట్టిన రియల్ ఎస్టేట్ అధినేత కేకే రాజుపై ఆ పార్టీ కార్యకర్తల్లో ధిక్కార స్వరం వినబడుతోంది. సమన్వయకర్తగా కేకే రాజు నియోజక వర్గ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ నియో జక వర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలపై పెద్దగానే దుమారం రేగుతోంది. అందరినీ కలుపుకుని పోయే తత్వం కేకే రాజుకు లేదని అందుకే ఆయన వల్ల నియోజక వర్గానికి న్యాయం జరిగే ఛాన్స్ లేదని అంటున్నారు. ఆయనకు వ్యతిరేకంగా పార్టీలోనే అంత ర్గతంగా ఓ సమూహం ఏకమైంది. వీరంతా మంగళ వారం రాత్రి మురళీ నగర్లో సమావేశమయ్యారు. కేకే రాజుతో సంబంధం లేకుండానే పార్టీ పటిష్టత కోసం పని చేయాలని నిర్ణయించు
కున్నారు. కావాలి జగన్..రావాలి జగన్’ పేరిట జరుగుతున్న కార్యక్రమాలను ఇకపై సమన్వయకర్తతో సంబంధం లేకుండా నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ శనివారం నుంచీ రావాలి జగన్-కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని నియోజక వర్గంలోని ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసే ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేకే రాజును మినహా మిగిలిన వైసీపీ నేతలందరినీ ఆహ్వానించాలని నిర్ణయించారు. జగన్ను సీఎం చేయడమే లక్ష్యంగా తామంతా కష్టపడి పార్టీ కోసం పని చేస్తామని అయితే కేకే రాజుతో ఆ పని అయ్యే ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నారు. నియోజక వర్గంలో కటుమూరి సతీష్, చల్లా ఈశ్వరరావు, ఆళ్ల గణేష్, కేవీ బాబా, తదితరులతోనే కేకే రాజు చర్చలు జరిపి అన్ని వార్డుల్లోనూ వారి నిర్ణయాలతోనే ముందుకు వెళ్లడాన్ని సీనియర్ నేతలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే సీనియర్ మాజీ కార్పోరేటర్ పామోటి బాబ్జీ, రెయ్యి వెంకట రమణ, పైడి శ్రీను, పైడి ప్రతాప్, శ్రీనివాస్రాయుడు, ఆళ్ల శ్రీను, ఎస్కే బాబ్జీ, వాసుపల్లి రాంబాబు తదితరులంతా పార్టీలో వేరే కుంపటి పెట్టుకుంటున్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేశారు. కేకే రాజుతో తాము వేగలేకపోతున్నామని, ఆయన తమను కలుపుకుని పార్టీ కార్యక్రమాలు చేపట్టడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఏ సమయంలో వెళ్లిని ఆయన అందుబాటులో ఉండరని చెబుతూనే కేవలం నలుగురైదుగురిని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తున్నారని దీంతో తామంతా తీవ్ర మనస్తాపంతో ఉన్నామని అధిష్టానానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందుకే తాము కేకే రాజుతో సంబంధం లేకుండానే పార్టీ కార్యక్రమాలను గడప గడపకూ తీసుకెళ్లనున్నామని అందుకు పార్టీ నేతలంతా సహకరించాల్సిందిగా కోరుతున్నారు.