-సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కేరళకు చెందిన మహిళా సంఘం
-శబరిమలపై తీర్పు స్ఫూర్తిగా కదిలిన ముస్లిం మహిళలు
తిరువనంతపురం, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా ఉన్న మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి ముస్లిం మహిళలను అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కేరళకు చెందిన ముస్లిం మహిళల సంఘం సిద్ధమైంది. అన్ని వయసుల మహిళలను శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్ఫూర్తిగా తీసుకుని కేరళకు చెందిన అభ్యుదయ మహిళా ఫోరం ఎన్‌ఐఎస్‌ఎ త్వరలోనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్టు ప్రకటించింది. ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేయడానికి అనుమతించడమేకాక, ఇమామ్‌లుగా మహిళలను కూడా నియమించాలని కోరుతూ ఈ సంఘం పోరాటానికి సిద్ధపడింది. ఎన్‌ఐఎస్‌ఎ అధ్యక్షురాలు జుహ్రా మాట్లాడుతూ మసీదుల్లో మహిళలు ప్రార్థన చేయకూడదని పవిత్ర ఖురాన్లో ఎక్కడా చెప్పలేదని, మొహమ్మద్ ప్రవక్త కూడా మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకించలేదన్నారు. అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని సందర్శించవచ్చని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఆమె ప్రశంసించారు. శబరిమలలో లాగే మసీదుల్లోకి ప్రవేశించి ప్రార్థన చేసేందుకు ముస్లిం మహిళలకు ఉన్న హక్కు సాధనకు పోరాడుతున్నామని జుహ్రా తెలిపారు. ఇదే విషయమై న్యాయవాదిని సంప్రదించామని, త్వరలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మసీదుల్లోకి మహిళలను అనుమతించడం, ఇస్లాంలో లింగ వివక్ష అంతమే మా డిమాండ్లు అని జుహ్రా తెలిపారు. ట్రిపుల్ తలాఖ్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిలో జుహ్రా ఒకరు.