సిట్ మీద ఎవరికీ నమ్మకం లేదు–
సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని జగన్ కోరారు–
ధర్మాన ప్రసాదరావు–
శ్రీకాకుళం, ఫీచర్స్ ఇండియా : విశాఖపట్నం స్కాం పై వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాద రావు గురువారం స్పందించారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లా డుతూ..విశాఖ స్కాంపై సిట్ విచారణ సక్రమంగా జరగ లేదని ఆరోపించారు. ఆరోపణలు వచ్చిన 11 రోజుల తర్వాత విచారణ ఫైల్ కదిలింది అంటే దీని వెనకాల టీడీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. సిట్ విచారణలో తన పేరు రావడంపై ధర్మాన అభ్యంతరం వ్యక్తం చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్ జగన్ ఇదివరకే డిమాండ్ చేశారని తెలిపారు. సిట్ మీద ఎవరికీ నమ్మకం లేదని తెలిపారు.
స్కాంలో ప్రజలు చేస్తున్న డిమాండ్ నెరవేరలేద న్నారు. తనపై బురద జల్లి విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ధర్మాన అన్నారు. రికార్డులు టాంపరింగ్ జరిగిందనే విషయం బయటపడిందని, వ్యూహం ప్రకారం దోపిడీ చేయడానికి ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఈ స్కాంలో ప్రధాన సూత్రధారి, అసలు వ్యక్తి ఎవరో బయపడిందా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. విశాఖ స్కాంలో తన పేరు రావడంపై ధర్మాన స్పందిస్తూ..కేబినేట్ మినిస్టర్ బిజినెస్ రూల్‌లో ఈ వ్యవహారాలు ఉండవని, ఈ రాష్ట్రంలో రెవెన్యూ మినిస్టర్‌కి భూములు ఇచ్చే అధికారం లేదని వెల్లడించారు.
విశాఖ స్కాం వెనక పెద్దల ప్రమేయం ఉందని, సీబీఐ విచారణ జరిగితేనే నిజాలు వెల్లడవుతాయని వ్యాక్యానించారు. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకే ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని విమర్శించారు. భూకుంభకోణాల కేసును పోలీసులు ఎలా విచారణ చేస్తారని సూటిగా ప్రశ్నించారు. సిట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదని సూటిగా అడిగారు.