ముంబయి: రోజురోజుకీ రూపాయి విలువ తగ్గుతూ వస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లో రూపాయి విలువ భారీ కోతకు గురైంది. రూపాయి నాణేన్ని చేతిలో పెడితే చివరకు చిన్నపిల్లలు సైతం దీంతో ఏం వస్తుంది అనే స్థాయికి చేరుకుంది. ఇంతకీ ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ఎంత ఖర్చవు తుందో ఎప్పుడైనా ఆలోచించారా..? వివిధ నాణేలు తయారు చేయడానికి అవుతున్న ఖర్చుకు సంబంధించిన వివరాలను ఒక ప్రముఖ మీడియా సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి తెచ్చింది.
ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి మార్కె ట్లో దాని విలువ కంటే 11 పైసలు ఎక్కువ ఖర్చవు తుందట. అంటే రూ.1.11 ఖర్చవుతోంది. మన దేశంలో మొత్తం నాలుగు టంకశాలలు(నాణేలు తయారు చేసే కేంద్రం) ఉన్నాయి. ఇవి ముంబయి, కోల్కతా, హైద రాబాద్, నోయిడా కేంద్రంగా పనిచేస్తున్నాయి. కావాల్సిన నాణేల వివరాలు, వాటి సంఖ్యను ఆర్బీఐ కేంద్ర ప్రభు త్వానికి అందజేస్తుంది. ఆ వివరాలను కేంద్రం టంకశా లలకు చేరవేస్తుంది. వాటికనుగుణంగా ఆయా కేంద్రాలు నాణేల తయారీని చేపడతాయి. ముంబయి, హైదరాబాద్ టంకశాలల్లో రూపాయి నాణేల తయారీతో పాటు రూ. 10, రూ.5, రూ.2 నాణేలు కూడా ఉత్పత్తవుతున్నాయి. గత నాలుగేళ్లతో పోలిస్తే రూపాయి నాణేల తయారీ సంఖ్య గణనీయంగా తగ్గింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 2201 మిలియన్ రూపాయి నాణేలు ముద్రించగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య 630 మిలియన్లకే పరిమితమైంది. దీంతో పాటు రూ.2 నాణెం తయారీకి రూ.1.28, రూ.5 నాణేనికి రూ.3.69, రూ.10 నాణేనికి రూ.5.54 ఖర్చవుతున్నట్లు తెలిపారు.