పరిస్థితి అర్థమైంది జనసేన టార్గెట్‌ మారింది

ప్రత్యేక ప్రతినిధి, ఫీచర్స్‌ ఇండియా: ఎన్నికల లోపు జనసేనను సంస్థాగతంగా బలపరచడానికి పవన్‌ కల్యాణ్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు జనసేన కండువా కప్పుకున్నారు. ఈ ఊపుతో సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ చక్రం తిప్పబోతున్నారని అంతా అనుకున్నారు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆ పార్టీ ప్రభావం ఏంటో చూపించాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడినప్పుడు జనసేనలోకి కాకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకే ఎక్కువ మంది వలసలు వెళ్లారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన వాళ్లు కూడా ఫ్యాను కిందకు వెళ్లడానికే ఆసక్తి చూపారు. అయితే, గ్రామ స్థాయిలో పవన్‌ అభిమానులు మంచిగా పని చేయడంతో ఓటు బ్యాంకుపై ఆ పార్టీ ధీమా ప్రదర్శించింది. దీనితోనే ఎన్నికల బరిలో దూకింది.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత జనసేన ప్రభావం అంతగా ఉండదని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో జనసేనాని కూడా ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదు. ఇటీవల అభ్యర్థులతో జరిగిన సమావేశంలోనూ పవన్‌ దాదాపుగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అందుకే ఇప్పుడా పార్టీ టార్గెట్‌ మారిపోయింది. ఎన్నికల ఫలితాలపై కంటే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంపైనే పవన్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని ఆయన నిశ్చయించారట. తద్వారా పార్టీ సంస్థాగతంగా పటిష్ఠమవుతుందని విశ్వసిస్తున్నారని తెలిసింది. అభ్యర్థులతో ముఖాముఖి సందర్భంగా ఆయన ఈ విధంగానే దిశానిర్దేశం చేశారని సమాచారం. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలవడం ద్వారా సంస్థాగతంగా బలోపేతం కావచ్చని పవన్‌ వారితో చెప్పారనే టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి జనసేనానికి పరిస్థితి అర్థమైపోయిందన్న మాట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *