ఆంధ్రా ఇరిగేషన్‌కు గండి కొడుతున్న తెలంగాణా

ఆంధ్రా ‘ఇరిగేషన్‌’ ప్రయోజనాలపై కేసీఆర్‌తో రాజీ పడొద్దు—————————-

స్నేహబంధాల కన్నా ఆంధ్రుల ప్రయోజనాలే మిన్న——————–

గుంటూరు, ఫీచర్స్‌ ఇండియా : గోదావరి జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహిస్తున్న తెలంగాణా పట్ల ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ అప్రమత్తంగా ఉండాలని ఎ.పి. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.వి.ఆర్‌.కృష్ణంరాజు అన్నారు. అమరావతి మీడియా సెంటర్‌లో బెటర్‌ ఆంధ్రప్రదేశ్‌ (బాప్‌) కన్వీనర్‌ డి.ఎస్‌.ఎన్‌.వి. ప్రసాదబాబుతో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం మంచిదేనని అయితే రాష్ట్ర రైంతాంగ ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడాలని కోరారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్యా అనేక వివాదాలు ఉన్నాయని, పోలవరం ప్రాజెక్టుకు 2005లో ఇచ్చిన పర్యావరణ అనుమతులు రద్దుచేయాలంటూ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు కూడా వేసిందని కృష్ణంరాజు తెలిపారు. నాగార్జున సాగర్‌ ఫ్లడ్‌ ఫ్లో కెనానాల్‌ నుంచి తెలంగాణా ఇప్పటికే పెద్ద ఎత్తున నీరు దొంగిలిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారని, ఉమ్మడి నిర్వహణలో ఉన్నప్పుడే నీటి చౌర్యానికి పాల్పడుతున్న తెలంగాణా ఇప్పుడు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్వహణ అంతా తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోందని అన్నారు. అంతే కాకుండా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాలు కృష్ణానది క్యాచ్‌మెంట్‌ పరిధిలో లేనందున ఆ జిల్లాలకు కృష్ణానదీ జలాలు కేటాయించవద్దంటూ వితండ వాదన చేస్తోందని ఆయన విమర్శించారు.

తుంగభద్ర – రాజోలి బండ డైవర్షన్‌ పధకం ఎత్తు పెంచా లని తెలంగాణా పట్టుపడుతోందని ఇదే జరిగితే సుంకేసుల ప్రాజెక్టుద్వారా కర్నూలుకు లభించే సాగునీరు తగ్గిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణా ఇరిగేషన్‌ శాఖ శ్రీశైలం నుంచి ఎక్కువ నీరు మళ్లించి నాగార్జున సాగర్‌లో నిల్వ చేస్తోందని ఫలితంగా హంద్రీనీవా , పోతి రెడ్డి పాడు ప్రాజెక్టులకు తగినన్ని నీళ్లు రావడం లేదని అక్కడి చెరువులు కూడా నిండడం లేదని కృష్ణంరాజు తెలిపారు. అమరావతికి మంచి నీరు అందించడా నికి ప్రకాశం బరాజ్‌ ఎగువన వైకుంఠపురం వద్ద రూ.2169 కోట్లతో గుంటూరు జిల్లాలో నిర్మిస్తున్న ప్రాజెక్టుకు కూడా తెలంగాణా అభ్యంతరం చెబుతోందని, దీనికి జలవనరుల శాఖ అనుమతి లేదని, తమకు తెలపకుండానే ఈ ప్రాజెక్టును కడుతున్నారని తెలంగాణా ఆరోపిస్తూ ఈ ప్రాజెక్టుకు అడ్డు తగలడానికి ప్రయత్నిస్తోందన్నారు.

ఏ.పి.విభజన చట్టం 9వ భాగం 84.2 నిబంధన ప్రకారం కృష్ణా, గోవావరి రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డులకు తెలపకుండా ఎటువంటి నీటి వొప్పందాలు ఆయా రాష్ట్రాలు చేసుకోకూడదని కాని తెలంగాణా ప్రభుత్వ మహరాష్ట్రతో కుమ్మక్కయి ఆంద్ర óప్రదేశ్‌కు ముందస్తు సమాచారం లేకుండానే గోదావరి నదిపై రాజుపేట, పింప్రాడ్‌, చనాకా – కొరాట, తుమ్మిడి హట్టి, కాళే శ్వరం ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన అంటూ ఈ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు.

గత ప్రభుత్వం ఇరిగేషన్‌, వ్యవసాయ రంగాలకు ఐదేళ్ళలో లక్షా 18వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఎకరా ఆయకట్టు పెరగకపోగా నికర సాగుభూమి 10 శాతం తగ్గిందని కృష్ణంరాజు తెలిపారు. జగన్‌ స్నేహబంధాల కన్నా ఆంధ్రుల సాగునీటి ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం అవసరమ న్నారు. విలేఖరుల సమావేశంలో బాప్‌ కో- కన్వీనర్‌ డాక్టర్‌ కె. రాజేంద్రప్రసాద్‌, ఎడిటర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరు శ్రీనివాసరావు, అసోసియేషన్‌ జిల్లా కన్వీనర్‌ పి. ఆసిఫ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *