పాత తేదీలతో 29మంది వీఆర్వోలు, నలుగురు తహశీల్దార్‌ల బదిలీలు————-

దర్యాప్తుకు బకాండ్రేగుల డిమాండ్‌——————

అనకాపల్లి, ఫీచర్స్‌ ఇండియా : జిల్లాలో రెవెన్యూ బదిలీలలో అవకతవకలు జరిగాయని దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర కోఆర్డినేటర్‌ కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ గడువు దాటిక పాత తేదీలతో 29 మంది వీఆర్వోలు, నలుగురు తహశీల్దార్‌ల బదిలీలు జరిగాయని అన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత కలిగి ఉండాల్సిన జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోనే ఈ విధంగా జరగడం విచారకరమని అన్నారు. ఈనెల 4వ తేదీన బదిలీ ఉద్యోగుల జాబితా రూపకల్పనలో అవకతవకలు చోటుచేసుకున్నాయని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని అన్నారు. రెవెన్యూ బదిలీలలో జరిగిన అవకతవకలపై ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలనా శాఖ అధికారులకు ఫిర్యాదు చేసామని అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలోని ఎ, బీ, సీ, డీ, ఇ, ఎఫ్‌, జీ, హెచ్‌ విభాగాల్లో ఐదు నుంచి 15 ఏళ్లకు పైగా అతుక్కుపోయి విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. తాజా బదిలీలలో కూడా వీరికి స్ధాన చలనం కలగలేదని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగి పనిచేసే ఆఫీస్‌ లెక్క కాకుండా పనిచేసే ఊరు, పట్టణం, నగరం ప్రాతిపదికన ఐదేళ్ల సర్వీస్‌ను ప్రాతిపదికగా తీసుకోవాలని, ఈ నిబం ధన లను కలెక్టర్‌ కార్యాల యం తుంగలో తొక్కేసిందని అన్నారు. భూ ఆక్రమణల విషయంలో సిట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా రెండేళ్లకు పైగా పనిచేసిన కొంతమంది డిప్యూటీ తహశీల్దార్‌లను, వీఆర్వోలను 2018లో అప్పటి జెసీ సృజన బదిలీ చేయగా తాజా బదిలీలలో తిరిగి వారంతా కోరుకున్న స్ధానాలకు వచ్చేసారని అన్నారు. అలాగే ఏసీబీ కేసుల్లో భాగస్వామ్యమున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు పాటించలేదని అన్నారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ఆ శాఖ వెట్‌ సైట్‌ పెట్టగలిగింది కాని కలెక్టర్‌ కార్యాలయం మాత్రం పెట్టకపోవడం ఆక్షేపణీయమని అన్నారు. ఈ విషయం కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినా ఉపయోగం లేకపోయిందని అన్నారు. జిల్లాలోని వీఆర్వోల బదిలీలలో చోటుచేసుకున్న అవకతవకలలో జిల్లా రెవెన్యూ అధికారి గున్నయ్య పాత్ర క్రియాశీలకమని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్దంగా గుర్తింపులేని ఉద్యోగ సంఘాల యూనియన్ల ముసుగులో కొంతమంది వీఆర్వోలకు బదిలీ నిబంధనలు వర్తింపచేయలేదని అన్నారు. రెండేళ్లు పూర్తి కాకుండా ఏజెన్సీ పరిధిలో ప్రస్తుతం పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు (లోకల్‌ క్యాడర్‌, జోనల్‌ కేడర్‌) ను ఒక ఏడది కాలంలోనే బదిలీ చేసేశారని అన్నారు. పరిపాలనా సౌలభ్యం, ఎటువంటి అభ్యర్ధనలు లేకుండా, అనారోగ్య సమస్యల నెపంతో కొంతమందికి ఉద్దేశపూర్వకంగా వాళ్లకి ఇష్టమొచ్చిన కేంద్రాలకు బదిలీలు చేశారని అన్నారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో జరిగిన తంతుపై సమగ్ర దర్యాప్తు జరపాలని, ఏళ్ల తరబడి ఒకే మండలంలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ అధికారులను తక్షణం బదిలీ చేయాలని, డిప్యుటేషన్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తాను సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *