లైంగిక వేధింపులపై ఫిర్యాదులకు మహిళకు సోషల్‌ విూడియానే దిక్కా?

పనిచేసే చోట ఎవరైనా ఒక మహిళను తాకే ప్రయత్నం చేస్తే, లేదా కోరిక తీర్చాలంటూ వెంటపడితే, లేదా సదరు మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే ఆ మహిళ ఏం చేయాలి? అలాంటి వారి పేర్లను సోషల్‌ విూడియాలో బయటపెట్టాలా? లేదా లైంగికంగా వేధించాడంటూ చట్ట ప్రకారం ‘అంతర్గత ఫిర్యాదుల కమిటీ’ని సంప్రదించి ఫిర్యాదు చేయాలా? ఇంతకీ ఈ ప్రశ్న ఇక్కడెందుకంటే, విూరెప్పుడైనా లైంగికంగా వేధింపులకు గురయితే చెప్పండి.. అని విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థినులను ప్రముఖ న్యాయవాది రాయ సర్కార్‌ కోరారు.

వారు పంపించిన ప్రైవేట్‌ మెసేజ్‌ల ఆధారంగా వారి పేర్లను గోప్యంగా ఉంచి.. ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులకు గురిచేసే 68 మంది ప్రొఫెసర్ల పేర్లను బయటపెట్టారు. అందులో ఎక్కువ మంది ప్రొఫెసర్లు భారత్‌కు చెందినవారే. ఆ ప్రొఫెసర్ల పేర్లను బయటపెట్టే ముందు వారి అంగీకారాన్ని ఆమె తీసుకోలేదు. వారికి వ్యతిరేకంగా చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి వివరాలను కూడా ఆమె అక్కడ పొందుపరచలేదు. ఆ ఆరోపణలకు సంబంధించి ప్రాధమిక లేదా చట్టపరమైన విచారణ కూడా జరగలేదు. ఈ ప్రొఫెసర్ల పేర్లు బయటపెట్టడమే తన ఉద్దేశమని, తద్వారా విద్యార్థినులు ఆ ప్రొఫెసర్ల నుంచి దూరంగా ఉండగలరని అదే తన లక్ష్యమని రాయ సర్కార్‌ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో రాశారు.

తాను ఊహించిన దాని కంటే ఎక్కువ మెసేజ్‌లు వస్తున్నాయని ఆమె అన్నారు. ఆ ప్రొఫెసర్ల పేర్లను బయటపెట్టడమే కాకుండా వేధింపులకు గురైన విద్యార్థినులు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోగలరో కూడా తెలుపుతున్నానని ఆమె తన ఫేస్‌బుక్‌ పోస్టులో వివరించారు.

ఈ పద్ధతిపై భిన్నాభిప్రాయాలు!

అయితే లైంగికంగా ఎవరైనా వేధిస్తే బాధిత మహిళలు ఇలా ఫేస్‌బుక్‌లో చెప్పే బదులు మహిళలపై లైంగిక వేధింపులని అరికట్టేందుకు ఏర్పాటయ్యే అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంతకీ ఈ ప్రక్రియలో ఏం లోటుంది? ఇలా ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నకు.. రాయ సర్కార్‌కి మెసేజ్‌ పంపించిన సోనియా కెలాంగ్‌ అనే మహిళ సమాధానమిస్తూ న్యాయ ప్రక్రియపై తనకు ఎటువంటి నమ్మకం లేదని తెలిపారు.

లైంగికంగా వేధించే ప్రొఫెసర్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం ధైర్యంతో కూడుకున్న పనని, ఒకవేళ ధైర్యం చేసి ముందుకు వెళ్లినా సదరు ప్రొఫెసర్‌ పలుకుబడిని ఉపయోగించి విచారణను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తారని, తమపై ఎటువంటి చర్యలుండకుండా చూసుకుంటారని ఆమె అన్నారు. లైంగికంగా వేధిస్తున్నారని ఒక ప్రొఫెసర్‌కి వ్యతిరేకంగా తోటి విద్యార్థినులతో కలిసి యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌కి తాను ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. సోషల్‌ విూడియాలో ఇలా పేర్లు బయటపెట్టడం సబబేనని ఆమె అంటున్నారు. ”బహిరంగంగా ఇలా పేర్లు బయటపెడితే ఇతర మహిళలు కూడా ధైర్యం చేసి ముందుకొస్తారు, ఇంకా ఎవరెవరు ఆ ప్రొఫెసర్ల వేధింపులకు గురయ్యారో వారికి ఈ సమస్యపై ధైర్యంగా మాట్లాడే అవకాశం కూడా కలుగుతుంది” అని ఆమె అన్నారు.

ఇలాంటి వేధింపులను అరికట్టేందుకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం అమల్లోకొచ్చింది. 1997కు ముందు పనిచేసే చోట లైంగిక వేధింపులకు సంబంధించి ఎటువంటి చట్టం ఉండేది కాదు. ఓ కేసు విచారణ సందర్భంగా దీనిపై ప్రత్యేకంగా చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు 1997లో ఆదేశించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి 2013లో చట్టం రూపుదిద్దుకుంది.

ఈ చట్టం ప్రకారం, ఎవరైనా లైంగిక వేధింపుల ఫిర్యాదు నమోదు చేస్తే సదరు సంస్థ ఓ కమిటీని నియమించాలి. ఆ కమిటీకి ఓ మహిళ అధ్యక్షత వహించాలి. ఆ కమిటీలో సగానికి పైగా మహిళా సభ్యులుండాలి. లైంగిక వేధింపుల సమస్యపై పనిచేసే ఏదైనా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కూడా ఆ కమిటీలో ఉండాలి. ఈ చట్టానికి ఏంతో ప్రాముఖ్యత ఉందని, ఎందుకంటే పనిచేసే చోట తన ఉద్యోగాన్ని బాధిత మహిళ కాపాడుకుంటూ.. వేధింపులకు గురిచేసే వారికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఇది కల్పిస్తోందని లక్ష్మి మూర్తి అన్నారు. ఆమె లైంగిక వేధింపుల సమస్యపై పలు స్వచ్ఛంద సంస్థల కోసం పనిచేస్తారు.

జైలు, పోలీసు వంటి కఠినమైన మార్గాలకు భిన్నంగా ఇదొక కొత్త మార్గమని ఆమె తెలిపారు. ”పోలీసులు, జైళ్లు వంటి మార్గాలకు భిన్నంగా సదరు సంస్థ ద్వారానే వేధించిన వారికి కఠిన శిక్ష పడాలని లైంగిక వేధింపులకు గురైన మహిళలు కోరుకుంటారు. వేధించే వారికి తగిన బుద్ధి చెప్పి, హెచ్చరించాలని వారు కోరుకుంటారు” అని ఆమె వెల్లడించారు. కానీ ఈ చట్టం ద్వారా ఆ సంస్థకు అందుతున్న అధికారాలతో మహిళలు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చు. ఎందుకంటే విచారణ కమిటీని ఎలా ఉండాలో, అందులో ఎవరెవరు సభ్యులుగా ఉండాలో నిర్ణయించే అధికారం ఆయా సంస్థలకే ఉంటుంది.

కమిటీలను నమ్మొచ్చా?

ఇలాంటి కవిూటీలన్నీ మోసమేనని, అవి కేవలం వేధింపులకు గురిచేసేవారిని రక్షించడం కోసమే ఉంటాయని ఇలాంటి ఓ కమిటీకి ఫిర్యాదు చేసిన ఓ బాధిత పాత్రికేయురాలు ఎస్‌ అఖిల అన్నారు. తాను ఫిర్యాదు చేసిన కమిటీ తనకే వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని, తనను లైంగికంగా వేధించిన సీనియర్‌ ఓ అమాయకుడని ఆ కమిటీ తెలిపిందని ఆమె అన్నారు. ”సంస్థలో అతనికి ఎంత అధికారముందంటే, చివరికి నా ఆఫీసులో పనిచేసే మహిళా ఉద్యోగులు కూడా అతనికి మద్దతు పలికారు. ఈ పరిస్ధితుల్లో సోషల్‌ విూడియా ద్వారా ఇలాంటి వారి పేర్లు బయటికి వస్తే మిగతావాళ్లంతా ఇలాంటి వాళ్ల నుంచి దూరంగా ఉండగలరు” అని ఆమె బీబీసీతో అన్నారు.

ప్రతి సంస్థా పక్షపాతిగా వ్యవహరించదని, అయితే ఒకే స్థాయి ఉద్యోగంలో ఉండే వారికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే మాత్రం కమిటీలు కఠినంగా ఉంటాయని, కానీ పైస్థాయి వ్యక్తికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే అంతగా ఉండవని లక్ష్మి అన్నారు. అయితే సోషల్‌ విూడియాలో ఇలా పేర్లు బయటపెట్టడం సరికాదని ఆమె అంటున్నారు.

ఇంటర్నెట్‌ ద్వారా తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకోవడం ఇది మొదటిసారి కాదు. 2013లో కూడా ఓ మహిళ సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జికి వ్యతిరేకంగా (పేరు చెప్పకుండా) లైంగిక ఆరోపణలు చేస్తూ ఓ బ్లాగ్‌ రాశారు.

ఆమె కూడా ఎటువంటి ఫిర్యాదు కమిటీని సంప్రదించలేదు. ఆ తర్వాత ఈ విషయం విూడియా ద్వారా బయటికి రావడంతో ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ ఆయన పేరును బయటపెట్టారు. ఈ విషయంపై ఆ తర్వాత ఓ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ జస్టిస్‌ ఏకే గంగూలీని దోషిగా తేల్చింది. లైంగిక వేధింపులు ఎదురైన తర్వాత ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యమైన విషయం.

సోనాల్‌ కెల్లాంగ్‌ కూడా చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యారు. తనలాంటి ఇతర మహిళలు కూడా ధైర్యంగా ముందుకు రావాలని ప్రోత్సహిస్తూ ఆమె ఓ వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. అయితే ఇంటర్నెట్‌ ద్వారా న్యాయం కోరేవారికి ఇది ప్రారంభం కానుందా? లేదా దీంతో ఏదైనా ప్రమాదముందా? న్యాయం అనేది కేవలం చట్ట ప్రక్రియతోనే సాధ్యమా? ఏదేమైనా దీనిపై మాత్రం తీవ్రంగా చర్చ జరుగుతోంది.కానీ మరోవైపు బాధిత మహిళలు తమ పేరు చెప్పకుండా వేధింపులకు గురిచేసిన వారి పేర్లను బయటపెట్టడంతో ఆయా ప్రొఫెసర్లు ఇరకాటంలో పడ్డారనే విషయం మాత్రం వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *