అవినీతిలో జగన్‌తో పోటీ పడుతున్న మంత్రులు

అవినీతి కార్యకలాపాలకు పాల్పడడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితో అధికార వైసీపీ మంత్రులు పోటీ పడుతున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని ఎద్దేవా చేశారు. ఇదే విషయమై శుక్రవారం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్మిక శాఖామంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కుమారుడు గమ్మనూరు ఈశ్వర్‌కి విజయవాడ సమీపంలోని భవానీపురంలో ఉంటున్న కార్తీక్‌ ఖరీదైన బెంజ్‌ కారును కానుకగా ఇచ్చారన్నారు. ఈఎస్‌ఐ కేసులో (ఏ 4) నిందితుడిగా ఉన్న కార్తీక్‌కు తిరుమల మెడికల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారన్నారు. ఈఎస్‌ఐ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి జయరాం కుమారుడికి ఈ ఖరీదైన కారును లంచంగా ఇచ్చారని ఆరోపించారు. కారు తాళం చెవులను ఈశ్వర్‌కు కార్తీక్‌ అందిస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలను వెలికి తీసేందుకు సమగ్రమైన విచారణకు తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని చెప్పే ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే స్పందించి కార్మిక మంత్రి జయరామ్‌ను తక్షణమే మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. కాగా ఇదే ఆరోపణకు సంబంధించి మంత్రి జయరాంపై అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 నెంబర్‌కు మీడియా సమక్షంలోనే కాల్‌ చేసి పిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *