ఆగస్టు, సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న కరోనా గత రెండు రోజులు కాస్త కరుణ చూపిస్తుంది. వారం రోజుల క్రితం వరకూ పది వేలకు పైగా నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు క్రమంగా తగ్గుతోంది. తాజాగా విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ లోనూ గత 24 గంటల్లో కేవలం 8 వేల కొత్త కేసులు మాత్రమే నమోదు కావడం ఊరట. గోదావరి జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాల్లో పరిస్ధితులు క్రమంగా నియంత్రణలోకి వస్తున్నట్లు తాజా బులిటెన్లలో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవాళ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లోనూ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కలిపి 8 వేల కేసులు నమోదైతే.. ఇందులో గోదావరి రెండు జిల్లాల్లోనే 2400 కేసులున్నాయి. మిగిలిన 11 జిలాల్లో కలిపి 5600 కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే సగటున జిల్లాకు 500 కేసులు మాత్రమే. వారం క్రితం వరకూ రోజూ ఏపీలో దాదాపు 100 మంది కరోనా కారణంగా చనిపోయేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య కూడా భారీగా తగ్గింది. ఇప్పుడు 60 నుంచి 70 మధ్య ఉంటోంది. ఇది మరో సానుకూల అంశంగా చెప్పవచ్చు. ఇవాళ ప్రకటించిన హెల్త్‌ బులిటెన్‌లోనూ గరిష్టంగా కడపలో 8 మంది చనిపోయారు. కనిష్టంగా కర్నూల్లో రెండు మరణాలు చోటు చేసుకున్నాయి. కరోనాపై ప్రజల్లో పెరిగిన అవగాహన, సీరియస్‌ కేసులకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం వంటి కారణాలతో మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత తగ్గేే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *