కరోనా మరణాలపై భారత్‌, చైనా, రష్యాది తప్పుడు లెక్క

 

కొవిడ్‌-19 చైనా తప్పిదం.. అలా జరిగి ఉండకూడదు. మన దేశంలో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువ. అయితే మా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకుండా ఉంటే ఈ పాటికి అనేక మిలియన్ల మంది మరణించి ఉండేవారు. ఇక గణాంకాల విషయానికి వస్తే.. భారత్‌, చైనా, రష్యాలలో ఎన్ని కరోనా వైరస్‌ మరణాలు సంభవించాయనే వివరాలు మీకు తెలియదు. ఆ దేశాలు కచ్చితమైన గణాంకాలను వెల్లడించవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తెలిపారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చ సందర్భంగా.. కరోనా విషయంలో డెమొ క్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఏ ప్రణాళిక లేని ట్రంప్‌ వైఖరి పలువురు అమెరికన్ల ప్రాణాలు తీసిందని బైడెన్‌ విరుచుకుపడ్డారు. చర్చలో భాగంగా బైడెన్‌ మాట్లాడుతూ ఏడు మిలియన్ల అమెరికన్‌ ప్రజలకు కరోనా వైరస్‌ సోకిందని.. అయితే అధ్యక్షుడికి ఈ విషయంలో ఏ ప్రణాళిక లేదని విమర్శించారు. ”మీలో ఎందరికి ఉదయం లేవగానే మీ ప్రియమైన వారు కొవిడ్‌ కారణంగా మరణించటంతో ఖాళీ అయిన డైనింగ్‌ టేబుల్‌ కుర్చీ చూడాల్సి వస్తోంది?” అని ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ట్రంప్‌ అధ్యక్ష పదవి ఒక్క పర్యాయానికే పరిమితం అనే బైడెన్‌ వ్యాఖ్యలకు ట్రంప్‌ చురుగ్గా స్పందించారు. ” అసలు ప్రతిపక్షమైన డెమొక్రాటిక్‌ గవర్నర్లే కొవిడ్‌-19 విషయంలో నేను చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించానంటూ మెచ్చుకున్నారు. వ్యాక్సిన్‌కు మనం కేవలం కొన్ని వారాల దూరంలో మాత్రమే ఉన్నాం.” అని ఆయన జవాబిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *