జగన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలని కోర్టులో పిటిషన్‌

 

సుప్రీం కోర్టులో మరో సంచలన పిటిషన్‌ దాఖలైంది. ఏకంగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సీఎం జగన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌కుమార్‌ యాదవ్‌ సుప్రీం కోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో సీఎం జగన్‌పై న్యాయవాదులు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌పై దాదాపు 30 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, ఇలాంటి వ్యక్తి కాబోయే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుత జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఐ, సీఎం జగన్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదులుగా చూపారు. న్యాయవ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ప్రయత్నించారని న్యాయవాదుల తెలిపారు. గతంలో చీఫ్‌ జస్టిస్‌ కాబోయే వ్యక్తులకు ఆరోపణలు వచ్చాయని, కానీ సీఎం జగన్‌ చేసిన ఆరోపణలు మాత్రం చాలా తీవ్రమైనవని తెలిపారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి జగన్‌ తన కార్యాలయాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. కాబట్టి వైఎస్‌ జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలని వ్యాఖ్యానించారు. కాగా, ఈ పిటిషన్‌ మరో రెండు, మూడు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. లేదంటే ఈ నెల 26 దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేకు రాసిన దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతోంది. సీఎం జగన్‌కు రాసిన లేఖను ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *