ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంటే ఆడవారికి గడ్డం ?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు అంతానికి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో వ్యాఖ్యలు వివాదాస్పదమౌతున్నాయి.ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత సూపర్ హూమన్‌గా మారినా, మహిళలకు గడ్డం మొలిచినా, పురుషులు వేరేవిధంగా మాట్లాడినా ఔషధ తయారీదారులకు ఎలాంటి సంబంధం ఉండదంటూ వారిపై దాడిచేశారు. టీకా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది కానీ తాను మాత్రం కరోనా టీకా వేసుకొనేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటికే తనకు కరోనా సోకిన కారణంగా ఇప్పటికే తన శరీరంలో యాంటిబాడీస్ ఉన్నాయి.. ఇక తానెందుకు టీకా తీసుకోవాలంటూ ప్రశ్నించారు. అలాగే టీకాను తాము ఉచితంగా ఇవ్వబోతున్నామని, అలాగని టీకా తప్పనిసరి కాదన్నారు. టీకా తీసుకోని వారికి జరిమానాలు విధించబోమని, ఒత్తిడి చేసే ప్రసక్తే ఉండదని బోల్సనారో స్పష్టం చేశారు. టీకా తీసుకుంటే మనుషులు మొసళ్లలా మారే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రభావాలకు తాము బాధ్యత వహించమనీ, మీరు (ప్రజలు) మొసళ్లుగా మారితే, అది మీ సమస్య అని పేర్కొన్నారు.