నిమ్మగడ్డకు జగన్‌ సర్కార్‌ షాక్‌

 

ఎన్నికల షెడ్యూల్‌ను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల ప్రకంపనలు ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వానికీ, ఎన్నికల కమిషన్‌కూ మధ్య జరుగుతున్న పోరు భారీ టర్న్‌ తీసుకుంది. హైకోర్టు సూచించిన విధంగా ప్రభుత్వం పంపిన ఐఎఎస్‌ అధికారులతో భేటీ అయిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ తాను కోరుకున్న విధంగానే పంచాయతీ ఎన్నికల నగారా మోగించేశారు. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హైకోర్టు సూచనల మేరకు నిమ్మగడ్డతో మరికొంతకాలం సంప్రదింపులు సాగించాలని భావించిన ప్రభుత్వానికి ఎన్నికల ప్రకటన సహజంగానే చిర్రెక్కించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఎన్నికలు వద్దంటూ నిమ్మగడ్డకు లేఖ రాయగా.. పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి ద్వివేదీ ఎన్నికలు తమకు ఆమోదయోగ్యం కాదంటూ బహిరంగ లేఖ విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికల బహిష్కరణ ఏపీలో ప్రస్తుతం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం జనవరి 23 నుంచి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ కూడా అమల్లోకి వచ్చేసింది. దీంతో అధికారుల బదిలీలకు కూడా అవకాశం లేదు. మరోవైపు హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించేశారు. దీంతో ఇక ప్రభుత్వం ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేయడం మినహా ఏమీ చేయడానికి లేకుండా పోయింది. గతంలో ఎప్పడూ లేని విధంగా ఎన్నికల కమిషన్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఎన్నికల బహిష్కరణకు సిద్ధమవుతోంది. అదే జరిగితే రాజ్యాంగ సంస్ధ ఇచ్చిన ఆదేశాల ఉల్లంఘనపై కోర్టులు ఏం నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. ఉద్యోగులతో సహాయ నిరాకరణ ఓవైపు ఎన్నికల బహిష్కరణ ప్రకటనలు చేస్తూనే మరోవైపు ఉద్యోగ సంఘాలతో తమకు ఈ ఎన్నికలు ఇష్టం లేదని చెప్పించే పనిలో ప్రభుత్వం బిజీగా ఉంది. ప్రస్తుతం కరోనా పరిస్ధితులు నెలకొన్నాయని, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైతే అందులో తాము బిజీ కావాల్సి వస్తుందని, కాబట్టి ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని ఉద్యోగులతో చెప్పించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా తాము ఎన్నికల విధుల్లో పాల్గొనలేమని బహిరంగ ప్రకటన చేసేందుకు ఉధ్యోగ సంఘాలు సిద్దమవుతున్నాయి. దీంతో ఈసీని ప్రభుత్వంతో పాటు తాము కూడా ధిక్కరించాలనే ధోరణి కనిపిస్తోంది. పంచాయతీ పోరుపై సుప్రీంలో సవాల్‌ ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పరిస్దితులు అనుకూలంగా లేవని, స్ధానిక పరిస్ధితులను అంచనా వేయకుండా, ప్రభుత్వ నివేదికలను పట్టించుకోకుండా ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు గడప తొక్కేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో వైద్యారోగ్యశాఖ ఇచ్చిన నివేదికలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా లేదన్న కారణాలను, వ్యాక్సినేషన్‌ కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రస్తావిస్తూ ఎన్నికలను సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్‌ చేయనుంది. ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో అప్పటివరకూ ఆగకుండా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసి స్టే కోరాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ ఉద్యోగ సంఘాల సహాయ నిరాకరణపై ప్రకటన రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *