ఉద్ధవ్‌ సర్కారుపై మాట్లాడినందుకు పార్లమెంటు సాక్షిగా బెదిరింపులు

 

ఉద్ధవ్‌ సర్కారుపై మాట్లాడినందుకు పార్లమెంటు సాక్షిగా బెదిరింపులు ఎదురయ్యాయని స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రాణా బాంబు పేల్చారు. పార్లమెంట్‌ చరిత్రలోనే అరుదైన సంఘటనగా ఎంపీ నవనీత్‌ రాణా సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం సెషన్‌ ముగిసిన తర్వాత లోక్‌ సభ లాబీలో తాను ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని వివరిస్తూ, సదరు బాధ్యులపై చర్చలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాకు నవనీత్‌ ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషిలకు కూడా ఫిర్యాదు లేఖలు పంపారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత శివసేన ఎంపీ అర్వింద్‌ సావంత్‌ లోక్‌ సభ లాబీలోనే బెదిరించాడని ఆమె అన్నారు. ”మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తానంటూ ఆయన కళ్లెర్రజేశాడు. జైలులో పడేస్తానని కూడా బెదిరించాడు. ప్రజాస్వామిక దేవాలయమైన పార్లమెంటులో నాకు ఎదురైన ఈ బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానం. వీలైనంత త్వరగా సావంత్‌ పై చర్యలు తీసుకోండి” అని స్పీకర్‌కు రాసిన ఫిర్యాదు లేఖలో నవనీత్‌ పేర్కొన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మహారాష్ట్ర కేబినెట్‌ మంత్రులకు క్రిమినల్‌ పోలీసుతో లింకుందని, నాడు ఫడ్నవిస్‌ (బీజేపీ) సర్కారు పక్కన పెట్టిన అధికారుల్ని ఠాక్రే సీఎం అయ్యాక మళ్లీ తీసుకొచ్చారని, ఈ విషయంలో మంత్రి దేశ్‌ ముఖ్‌ నిందార్హుడేననని అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా లోక్‌ సభలో అన్నారు. కాగా, నవనీత్‌ ఆరోపణలను శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ ఖండించారు. ఆమెను తానెందుకు భయపెడతానని ప్రశ్నించారు. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమీ బాగాలేదని అన్నారు. లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లా కరోనాకు గురై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందున ఫిర్యాదు పరిశీలన ఆలస్యమయ్యే అవకాశముంది. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ ఎంపీగా నవనీత్‌ కౌర్‌ కొనసాగుతున్నారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *