ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ చేశామనడం సరికాదు

 

 

అమరావతిలో భూసేకరణకు సంబంధించి జస్టిస్‌ ఎన్వీ రమణ, ఆయన బంధువులు అవినీతికి పాల్పడ్డారని, ఏపీ హైకోర్టులో విచారణలు, నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ గత ఏడాది అక్టోబర్‌ 6న వైఎస్‌ జగన్‌..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బొబ్డేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదును తిరస్కరించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. దీనిపై ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. దాన్ని తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. అంతర్గత ప్రక్రియ సందర్భంగా తగిన పరిశీలన తరువాతే ఆ ఫిర్యాదులను కొట్టివేశామని పేర్కొంది. అంతర్గత ప్రక్రియలోని పరిశీలన గోప్యంగా ఉంచుతామని, బహిరంగ పరచడం కుదరదని సుప్రీం స్పష్టం చేసింది. ఆ ప్రక్రియ ఏమిటనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని ప్రశాంత్‌ భూషణ్‌ అన్నారు. అంతర్గత విచారణ సందర్భంగా ఏఏ అంశాలను పరిశీలించారో, నివేదిక ఏం చెప్పిందో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందని చెప్పారు. అంతర్గత విచారణ అంశం.. సీల్డ్‌ కవర్‌లో మళ్లీ సీల్డ్‌ కవర్‌లా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పారదర్శకత ఎవరిక్కావాలి ? అని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తం చేసిన ఫిర్యాదులపై చేపట్టిన అంతర్గత విచారణ సారాంశం ఏమిటనేది అందరికీ తెలియాలని, అప్పుడే పారదర్శకతను పాటించినట్టవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణపై ఫిర్యాదు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాసిన లేఖపై అంతర్గతంగా విచారణ జరిపించామని, అనంతరం దాన్ని కొట్టేశామని దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించడం పట్ల సీనియర్‌ అడ్వొకేట్‌ ప్రశాంత్‌ భూషణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి.. కాబోయే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి వ్యక్తిపై చేసిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ చేశామనడం సరికాదని, ఆ వివరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *