ఏపీఎఫ్‌ఏ వన్‌, ఫోర్‌కే ఊర్జ టైటిల్స్‌.. రన్నరప్‌లుగా ఏపీఎఫ్‌ఏ వన్‌, త్రీ

 

IMG_20170510_090349389 (1)

విశాఖపట్నం, ఫీచర్స్‌ ఇండియా క్రీడా ప్రతినిధి

ఊర్జ సీఏసీఎఫ్‌ అండర్‌ 19 విజేతలుగా ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఏపీఎఫ్‌ఏ) వన్‌, ఫోర్‌ జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో వన్‌, బాలికల విభాగంలో ఫోర్‌ జట్లు టైటిల్స్‌ దక్కించుకున్నాయి. రన్నరప్‌లుగా బాలుర విభాగంలో ఏఫీఎఫ్‌ఏ త్రీ, బాలికల విభాగంలో ఏపీఎఫ్‌ఏ వన్‌ నిలిచాయి. మూడో స్థానాన్ని ఏపీఎఫ్‌ఏ టూ బాలబాలికల జట్లు దక్కించుకున్నాయి.

నేవీ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన వేర్వేరు ఫైనల్స్‌లో బాలుర విభాగంలో ఏపీఎఫ్‌ఏ వన్‌, త్రీ, బాలికల విభాగంలో ఏపీఎఫ్‌ఏ వన్‌, ఫోర్‌ జట్లు తలపడ్డాయి. బాలుర విభాగంలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చక్కటి ఆటను ప్రదర్శించాయి. టోర్నీ విజేతగా నిలిచేందుకు కష్టపడ్డాయి. ఒక దశలో క్రీడాకారుల్లో పట్టుదల తీవ్రతరమయ్యింది. ఈ క్రమంలో ఏపీఎఫ్‌ఏ త్రీ జట్టులో రెండవ నెంబర్‌ జెర్సీ ఆటగాడు దూకుడుగా ఆడి వన్‌ జట్టు క్రీడాకారుడ్ని గాయపరిచాడు. దీంతో రిఫరీ రెడ్‌ కార్డు చూపించి గ్రౌండ్‌ నుంచి పంపించేశారు. ఈ రెండు జట్లలో ఇరువురు క్రీడాకారులకు ఎల్లో కార్డు చూపించారు. ఆట ప్రథమార్ధంలో ఏ ఒక్కరూ గోల్‌ చేయలేకపోయారు. ద్వితీయార్ధం 60వ నిమిషంలో పవన్‌ వేసిన గోల్‌తో వన్‌ జట్టు ఒక అడుగు ముందుకు వేసింది. ఆద్యంతం ఎవరికీ గోల్‌ పడలేదు. కానీ పోరు హోరాహోరీగా సాగింది. చివరకు వన్‌ జట్టే విజయం సాధించి టైటిల్‌ ఎగరేకుసుపోయింది.

అంతకు ముందు ఏపీఎఫ్‌ఏ వన్‌, ఏపీఎఫ్‌ఏ ఫోర్‌ బాలికల జట్లు టైటిల్‌ కోసం పోటీ పడ్డాయి. నువ్వా నేనా అనే రీతిలో పోటీ జరిగినప్పటికీ ఫోర్‌ జట్టుకే విజయం వరించింది. ఆట ప్రారంభమైన తొమ్మిదవ నిమిషంలో శ్రీదేవీ చేసిన గోల్‌తో ఫోర్‌ జట్టు ఖాతా తెరిచింది. ఈ టోరీలో అత్యధి గోల్స్‌తో దూసుకుపోతున్న వరలక్ష్మీ చివరి పోరులో కూడా తన సత్తా చూపించింది. ఆట ప్రథమార్ధం 33వ నిమిషంలో ఒకటి, ద్వితీయార్ధం 85వ నిమిషంలో మరో గోల్‌ చేసి జట్టును విజయపథంలో నడిపించింది. మరో స్ట్రైకర్‌ రాణి రెండు, దివ్య ఒక గోల్‌ చేశారు.

ఫైనల్‌ మ్యాచ్‌కు భారత నావికదళానికి చెందిన అధికారి కెప్టెన్‌ అనివష్‌ నగర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సీఐఎస్‌ఎఫ్‌ సౌత్‌ సెక్టార్‌ ఐజీ, ఐపీఎస్‌ అధికారి ఆనంద్‌ మోహన్‌, డీఐజీ హర్‌దీప్‌ సింగ్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌. శ్రీనివాస బాబు ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ దక్షణ మండలం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) ఆనంద్‌ మోహన్‌ ఫీచర్స్‌ ఇండియాతో మాట్లాడుతూ ఊర్జ టోర్నీ సీఐఎస్‌ఎఫ్‌లో నూతన ఉత్సాహాన్ని నింపిందన్నారు. క్రీడాకారులు, ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌, జిల్లా క్రీడాప్రాధాకార సంస్థ, ఇండియన్‌ నేవీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇచ్చిన సహాయ సహకారాలతో టోర్నీ విజయవంతమయ్యిందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌తో రాష్ట్రంలో ఫుట్‌బాల్‌ ఆడే యువతరాన్ని కనుకోగలిగినట్లు చెప్పారు. ఊర్జ పూర్తైన తరువాత కూడా సీఐఎస్‌ఎఫ్‌ సామాజిక బాధ్యతగా ఫుట్‌బాల్‌ చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. అదే విధంగా టోర్నీ సందర్భంగా సీఐఎస్‌ఎఫ్‌ సిద్దం చేసిన వైజాగ్‌ డిక్లరేషన్‌ ప్రభుత్వానికి పంపనున్నట్లు ఆనంద్‌ మోహన్‌ తెలిపారు.

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ హర్‌దీప్‌ సింగ్‌ మాట్లాడుతూ, సీఐఎస్‌ఎఫ్‌కు ఊర్జ సరికొత్త అనుభూతిని ఇచ్చిందని అన్నారు. క్రీడాకారుల ముఖాలలో తేజస్సు చూడగలిగినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఫుట్‌బాల్‌ క్రీడకు పూర్వ వైభవం వస్తుందని అన్నారు.

ఊర్జ విజేతలకు 50 వేల రూపాయలు, రన్నర్లకు 30 వేల రూపాయలు, హార్డ లైనర్‌కు 20 వేల రూపాయలు చొప్పున బాల బాలిలకు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ టోర్నీలో ఎనిమిది బాలుర, మరో ఎనిమిది బాలికల జట్లు పాల్గొన్నాయి. లీగ్‌లో ఒక్కొక్క జట్టు మూడేసి మ్యాచ్‌లు ఆడాయి. లీగ్‌లో అత్యధిగా పాయింట్లు సంపాదించిన జట్లు సెమీస్‌కు అడుగుపెట్టాయి. సెమీస్‌లో గెలుపొందిన జట్లు ఫైనల్స్‌లో తలపడ్డాయి. సెమీస్‌లో ఓడిపోయిన జట్లు మూడవ స్థానం కోస్‌ పోటీ పడ్డాయి. ఇలా అన్ని మ్యాచ్‌ల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాల బాలికలను సౌత్‌ జోన్‌ మీట్‌కు ఎంపిక చేశారు. జూన్‌ 25 నుంచి బెంగుళూరులో జరిగే రెండవ దశ పోటీలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు పాల్గొంటుంది. ఈ దశలో విజయం సాధించిన బాలబాలికల జట్లుకు లక్ష రూపాయల చొప్పున అందజేస్తారు. సౌత్‌ జోన్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను నేషనల్‌ మీట్‌కు ఎంపిక చేస్తారు. జూలై ఎనిమిద తేదీ నుంచి రాజధాని ఢిల్లీలో జరిగే చివరి దశ పోటీలలో సౌత్‌ జోన్‌ నుంచి జట్టు పాల్గొంటుంది. ఇక్కడ విజేతకు అయిదు లక్షల రూపాయలు నజరానాగా అందజేస్తారు. మే ఒకట తేదీన మహా విశాఖ నగరంలో ప్రారంభమైన ఊర్జ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ బుధవారంతో ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *