గుజరాత్‌పై ఢిల్లీ గెలుపు … సెంచరీ చేజార్చుకున్న శ్రేయస్ అయ్యర్

shreyasవారెవ్వా ఏం ఆట.. మొన్న శామ్సన్.. నిన్న రిషబ్.. నేడు శ్రేయస్. ఒకర్ని మించి మరొకరు తమ బ్యాటింగ్ ప్రతిభతో ఈ సీజన్ ఐపీఎల్‌కే వన్నె తెచ్చారు. భవిష్యత్ భారతాన్ని మన కండ్లముందు ఆవిష్కరిస్తూ వీళ్లు చేసిన పోరాటం ఆద్యంతం ఆకట్టుకున్నా… ఢిల్లీని ప్లే ఆఫ్‌నకు చేర్చలేదనే ఒకే ఒక్క లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. గత నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ రెండుసార్లు తక్కువ స్కోరు (66, 67)కే ఔటైనా.. రెండు మ్యాచ్‌ల్లో మాత్రం భారీ స్కోరు (186, 209)ను ఛేదించారు. తాజాగా శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్
ఆవిష్కరించడంతో మూడోసారి మరో భారీ లక్ష్యాన్ని (196) ఛేదిస్తూ జహీర్‌సేన గుజరాత్‌ను చిత్తు చేసింది.

కాన్పూర్: ప్లే ఆఫ్‌కు దూరమైన రెండు జట్ల మధ్య జరిగిన పోరాటంలో ఢిల్లీ పైచేయి సాధించింది. శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 96; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నా.. లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించడంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 2 వికెట్ల తేడాతో గుజరాత్‌పై నెగ్గింది. ముందుగా గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఫించ్ (39 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఢిల్లీ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. శ్రేయస్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

కీలక భాగస్వామ్యం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌కు ఢిల్లీ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. నాలుగో ఓవర్‌లో డ్వేన్ స్మిత్ (8), ఆరో ఓవర్‌లో కెప్టెన్ రైనా (6) వికెట్లను తీసి ఒత్తిడిలోకి నెట్టారు. ఓపెనర్ ఇషాన్ మెరుగ్గా ఆడటంతో పవర్‌ప్లేలో గుజరాత్‌కు 50 పరుగులు సమకూరాయి. ఏడో ఓవర్‌లో కిషన్ కూడా వెనుదిరగడంతో లయన్స్ 56 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కార్తీక్, ఫించ్.. ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నారు. క్రమం తప్పకుండా బౌండరీలు సాధించడంతో పాటు మిశ్రాను లక్ష్యంగా చేసుకుని ఫించ్ సిక్సర్లు బాదాడు. ఈ ఇద్దరి దెబ్బకు తొలి 10 ఓవర్లలో గుజరాత్ స్కోరు 91 పరుగులకు చేరింది. ఈ జోడిని విడదీసేందుకు జహీర్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. పరస్పరం చక్కని సహకారంతో ఈ ఇద్దరూ వేగంగా ఆడటంతో పరుగులు వరదలా పారాయి. నాలుగో వికెట్‌కు 92 పరుగులు జత చేసిన కార్తీక్‌ను 17వ ఓవర్‌లో బ్రాత్‌వైట్ ఔట్ చేశాడు. ఇదే ఓవర్‌లో 6,4,4తో 16 పరుగులు రాబట్టిన ఫించ్.. జడేజా (13 నాటౌట్)తో కలిసి ఐదో వికెట్‌కు 32 పరుగులు జోడించి వెనుదిరిగాడు. చివర్లో ఫాల్క్‌నర్ (14 నాటౌట్) వేగంగా ఆడటంతో లయన్స్ భారీస్కోరు సాధించింది.
శ్రేయస్ పోరాటం.. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆటగాళ్లు శ్రేయస్, నాయర్ మినహా ఒక్కరు కూడా స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయారు. రెండోఓవర్‌లో మూడు బంతుల తేడాలో శామ్సన్ (10), రిషబ్ (4) వికెట్లను చేజార్చుకుంది. 5, 6 ఓవర్లలో నాయర్ 32 రన్స్ రాబట్టడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ స్కోరు 64/2కు చేరింది. రెండోఎండ్‌లో శ్రేయస్ మెరుగ్గా ఆడినా.. 8వ ఓవర్‌లో నాయర్ ఔట్‌కావడంతో వికెట్లపతనం మొదలైంది. శ్రేయస్, నాయర్ మూడో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. కొద్దిసేపటికే శామ్యూల్స్ (1) రనౌట్‌కాగా 10 ఓవర్లలో ఢిల్లీ 92 పరుగులు చేసింది. 33 బంతుల్లో శ్రేయస్ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, అవతలివైపు అండర్సన్ (6), బ్రాత్‌వైట్ (11) వరుస విరామాల్లో వెనుదిరుగడంతో 14 ఓవర్లలో ఢిల్లీ 6 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఇక గెలువాలంటే 36 బంతుల్లో 75 పరుగులు చేయాల్సిన దశలో శ్రేయస్ రూట్ మార్చాడు. కమిన్స్ (24)తో కలిసి వరుస ఫోర్లతో రెచ్చిపోయాడు. దీంతో ఓవర్‌కు 17, 14, 21, 8, పరుగులు రావడంతో సమీకరణం 12 బంతుల్లో 15గా మారింది. ఈ దశలో కమిన్స్, శ్రేయస్ ఔట్‌కావడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నా.. మిశ్రా (8 నాటౌట్) రెండు ఫోర్లతో విజయానికి అవసరమైన పరుగులు సాధించాడు.
స్కోరుబోర్డు : గుజరాత్: డ్వేన్ స్మిత్ (రనౌట్) 8, ఇషాన్ కిషన్ (సి) జహీర్ (బి) మిశ్రా 34, రైనా (బి) కమిన్స్ 6, కార్తీక్ (సి) అండర్సన్ (బి) బ్రాత్‌వైట్ 40, ఫించ్ (బి) షమీ 69, జడేజా (నాటౌట్) 13, ఫాల్క్‌నర్ (నాటౌట్) 14, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 195/5; వికెట్లపతనం: 1-21, 2-46, 3-56, 4-148, 5-180; బౌలింగ్: జహీర్ 4-0-30-0, షమీ 4-0-36-1, కమిన్స్ 4-0-38-1, మిశ్రా 2-0-27-1, బ్రాత్‌వైట్ 4-0-38-1, అండర్సన్ 2-0-19-0.

shreyas3
ఢిల్లీ: శామ్సన్ (బి) సాంగ్వాన్ 10, కరుణ్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 30, రిషబ్ (రనౌట్) 4, శ్రేయస్ (బి) బాసిల్ 96, శామ్యూల్స్ (రనౌట్) 1, అండర్సన్ (రనౌట్) 6, బ్రాత్‌వైట్ (సి అండ్ బి) ధవల్ 11, కమిన్స్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 24, షమీ (నాటౌట్) 4, మిశ్రా (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 19.4 ఓవర్లలో 197/8; వికెట్లపతనం: 1-11, 2-15, 3-72, 4-92, 5-104, 6-121, 7-182, 8-189; బౌలింగ్: ధవల్ 4-0-30-1, సాంగ్వాన్ 3-0-35-1, బాసిల్ 3.4-0-43-1, స్మిత్ 1-0-17-0, జడేజా 4-0-31-0, ఫాల్క్‌నర్ 4-0-39-2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *