saha
చావో..రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు కింగ్‌లా పోరాడింది. ప్రత్యర్థి గడ్డపై సింహంలా ఎదురుదాడి చేస్తూ పటిష్ఠమైన ముంబైని నిలువెల్లా వణికించింది. సాహా సాధికారిక ఇన్నింగ్స్‌కు మ్యాక్స్‌వెల్ మెరుపులు తోడుకావడంతో వాంఖడే పరుగుల సునామీలో తడిసి ముైద్దెంది. ఫలితంగా ఈ సీజన్ ఐపీఎల్‌లో భారీ స్కోరు నమోదైన మ్యాచ్‌లో మ్యాక్స్‌సేన.. రోహిత్ బృందాన్ని చిత్తు చేస్తూ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

ముంబై: ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్ గట్టెక్కింది. భారీ లక్ష్యాన్ని పటిష్ఠమైన ముంబై బ్యాట్స్‌మెన్ మంచుగడ్డలా కరిగించినా.. చివర్లో కింగ్స్ బౌలర్ల అనుభవం ముందు తలవంచారు. ఫలితంగా గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో ముంబైపై గెలిచి ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ముందుగా పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దుమ్మురేపారు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసింది. సిమ్మన్స్ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్ (24 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్ (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. సాహాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ ఓపెనర్లు గప్టిల్ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్), సాహా ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేశారు. దీంతో తొలి ఐదు ఓవర్లలోనే 60 పరుగులు వచ్చాయి. కానీ ఛేంజ్ బౌలర్‌గా వచ్చిన కర్ణ్ శర్మ.. ఆరో ఓవర్‌లో గప్టిల్‌ను ఔట్ చేయడంతో తొలి వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పవర్‌ప్లే ముగిసేసరికి కింగ్ జట్టు స్కోరు 71/1కి చేరింది. వన్‌డౌన్‌లో మ్యాక్స్‌వెల్ వచ్చిరావడంతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. వరుస ఫోర్లతో పాటు స్పిన్నర్లు వేసిన 8, 9వ ఓవర్లలో మొత్తం ఐదు సిక్సర్లు బాదాడు.
ఫలితంగా తొలి 10 ఓవర్లలో పంజాబ్ స్కోరు 126 పరుగులకు చేరింది. మంచి జోరులో ఉన్న మ్యాక్స్‌ను 11వ ఓవర్‌లో బుమ్రా అనూహ్యంగా బౌల్డ్ చేశాడు. ఈ ఇద్దరి మధ్య రెండో వికెట్‌కు 63 పరుగులు జతయ్యాయి. ఇక షాన్ మార్ష్ (16 బంతుల్లో 25; 2 సిక్సర్లు) కూడా మంచి సమన్వయం చూపడం, సాహా ఏమాత్రం తగ్గకపోవడంతో 15 ఓవర్లలోనే కింగ్స్‌కు 173 పరుగుల సమకూరాయి. మూడో వికెట్‌కు 52 పరుగులు జోడించాక మెక్లీంగన్ బౌలింగ్ (16వ ఓవర్)లో భారీ సిక్సర్ బాదిన మార్ష్ అతనికే వికెట్‌ను సమర్పించుకున్నాడు. చివర్లో సాహాతో కలిసి అక్షర్ పటేల్ (13 బంతుల్లో 19 నాటౌట్; 1 సిక్సర్) మెరుగ్గా ఆడటంతో చివరి ఐదు ఓవర్లలో 57 పరుగులు వచ్చాయి.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఓపెనర్లు సిమ్మన్స్, పార్థివ్ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు) కూడా అంతే దీటుగా స్పందించారు. ఓవర్‌కు రెండు, మూడు ఫోర్ల చొప్పున బాదడంతో రన్‌రేట్ వాయువేగంతో కదిలింది. ఆరో ఓవర్‌లో మోహిత్‌కు రెండు సిక్సర్లు రుచి చూపిన సిమ్మన్స్ పవర్‌ప్లే ముగిసేసరికి ముంబైని 68 పరుగులకు చేర్చాడు. ఏడో ఓవర్‌లో మరో రెండు సిక్సర్లు కొట్టి సిమ్మన్స్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తొలి వికెట్‌కు 99 పరుగులు జత చేశాకా ఆరు బంతుల తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. సిమ్మన్స్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ వద్ద గప్టిల్ ఒంటిచేత్తో అందుకోవడం మ్యాచ్‌కే హైలెట్. 10 ఓవర్లలో 108/2 స్కోరు చేసిన ముంబై కొద్దిసేపటికే వరుస ఓవర్లలో కెప్టెన్ రోహిత్ (5), నితీష్ రానా (12) వికెట్లను కోల్పోయింది.

భారీ ఆశలు పెట్టుకున్న పొలార్డ్, హార్దిక్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ సిక్సర్ల జాతర మొదలుపెట్టారు. 16వ ఓవర్‌లో హెన్రీ 6,6,6,6తో 27 పరుగులు సమర్పించుకోవడంతో ముంబై 16 ఓవర్లలో 175/4 స్కోరు చేసింది. ఈ దశలో ఐదో వికెట్‌కు 21 బంతుల్లో 55 పరుగులు జోడించి హార్దిక్ ఔటైనా.. పొలార్డ్ 17వ ఓవర్‌లో 17 పరుగులు రాబట్టాడు. ఇక గెలువాలంటే 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన దశలో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టి కర్ణ్ శర్మ (19) ఔట్‌కాగా, తర్వాతి రెండు ఓవర్లలో పొలార్డ్ 15 పరుగులు మాత్రమే సాధించడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. స్కోరు బోర్డు : కింగ్స్ ఎలెవన్ పంజాబ్: గప్టిల్ (సి) హార్దిక్ (బి) కర్ణ్ శర్మ 36, సాహా నాటౌట్ 93, మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 47, మార్ష్ (సి) పార్థివ్ (బి) మెక్లీంగన్ 25, అక్షర్ నాటౌట్ 19, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 230/3.వికెట్లపతనం: 1-68, 2-131, 3-183. బౌలింగ్: హార్దిక్ 2-0-29-0, మెక్లీంగన్ 4-0-54-1, బుమ్రా 4-0-24-1, మలింగ 4-0-45-0, కర్ణ్ శర్మ 3-0-32-1, హర్భజన్ 3-0-45-0.

saha3
ముంబై ఇండియన్స్: సిమ్మన్స్ (సి) గప్టిల్ (బి) మ్యాక్స్‌వెల్ 59, పార్థివ్ (సి) వోహ్రా (బి) మోహిత్ 38, రానా (సి) గప్టిల్ (బి) అక్షర్ 12, రోహిత్ (సి) గప్టిల్ (బి) టెవాటియా 5, పొలార్డ్ నాటౌట్ 50, హార్దిక్ పాండ్యా (సి) సాహా (బి) సందీప్ 30, కర్ణ్ శర్మ (బి) మోహిత్ 19, హర్భజన్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 223/6. వికెట్లపతనం: 1-99, 2-106, 3-119, 4-121, 5-176, 6-207. బౌలింగ్: సందీప్ 4-0-42-1, హెన్రీ 2-0-40-0, ఇషాంత్ 3-0-29-0, మోహిత్ 4-0-57-2, అక్షర్ 3-0-28-1, మ్యాక్స్‌వెల్ 2-0-8-1, టెవాటియా 2-0-17-1.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *