ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు

anilkumar
-ప్లే ఆఫ్ పోరులో అనిల్ కుమార్ విజయం
న్యూఢిల్లీ: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ రెండు కాంస్య పతకాలతో మెరిసింది. గ్రీకో -రోమన్ 85 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అనిల్ కుమార్ అసాధారణ పోరాటంతో ఉబ్జెకిస్థాన్‌కు చెందిన మహ్మద్ శంషుద్దినోవ్‌ను ఓడించి కాంస్య పతకాన్ని సాధించాడు. మహిళల 75 కేజీల విభాగంలో రెజ్లర్ జ్యోతి సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన మసాకో ఫురిచి చేతిలో పరాజయం పాలైంది. సెమీస్ చేరడంతో జ్యోతికి కాంస్యం ఖాయమైంది. అనిల్ కుమార్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైనా అతన్ని ఓడించిన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో అతనికి కాంస్యపతక పోరులో తలపడే అవకాశం లభించింది. దీంతో గురువారం జరిగిన రెండోరోజు పోటీలలో అనిల్ కుమార్ అద్భుత పట్టుతో తన సత్తా చాటాడు.

తొలుత 1-6 స్కోరు తేడాతో వెనుకబడినా నమ్మశక్యం కాని రీతిలో పుంజుకున్నాడు. ప్రత్యర్థి మరో పాయింట్ సాధిస్తే విజయం ఖాయమైన పరిస్థితులలో తన ఉడుంపట్టుతో వరుసగా పాయింట్లు సాధించాడు. తొలుత ఉబ్జెక్ ప్రత్యర్థిని కిందికి పడదోసి రెండు పాయింట్లతో అతని ఆధిక్యాన్ని 3-6 పరిమితం చేశాడు. అనిల్ పోరాటంతో శంషుద్దినోవ్ కాస్త ఒత్తిడిలో పడ్డాడు. మళ్లీ రింగ్‌లో ప్రత్యర్ధిని రెండుసార్లు రింగ్ బయటకు పంపి వరుసగా నాలుగుపాయింట్లు సాధించి కాంస్యపతకాన్ని సగర్వంగా అందుకున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *