పుణెకు ఢిల్లీ దెబ్బ. స్మిత్‌సేన ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టం..

karun

న్యూఢిల్లీ: స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మనోజ్ తివారి (45 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరిగా పోరాడినా.. సహచరులు విఫలమవడంతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో పుణె 7 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో ఓడింది. దీంతో పుణె ప్లే ఆఫ్ ఆశలు క్లిష్టమయ్యాయి. టాస్ గెలిచిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (45 బంతుల్లో 64; 9 ఫోర్లు), రిషబ్ పంత్ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. తర్వాత పుణె 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. నాలుగు ఓవర్లు ముగియకముందే ఓపెనర్లు రహానే (0), త్రిపాఠి (7) ఔటైనా.. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (32 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడి పవర్‌ప్లేలో జట్టు స్కోరును 53 పరుగులకు చేర్చాడు. ఈ దశలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఢిల్లీ స్పిన్నర్లు 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి స్మిత్ వికెట్ తీశారు.

దీంతో తొలి 10 ఓవర్లలో పుణె 3 వికెట్లకు 78 పరుగులే చేసింది. మనోజ్ తివారి, స్టోక్స్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) నిలకడగా ఆడుతూ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించడంతో స్మిత్‌సేన లక్ష్యాన్ని చేరువైంది. కానీ ఆఖర్లో ధోనీ (5) అనూహ్యంగా రనౌట్‌కావడంతో పుణె విజయసమీకరణం 12 బంతుల్లో 33 పరుగులుగా మారింది. దీన్ని ఛేదించే క్రమంలో క్రిస్టియన్ (3) ఔటైనా.. 19వ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. ఇక 6 బంతుల్లో 25 పరుగులు చేయాల్సిన దశలో తివారి రెండు సిక్సర్లు బాదినా జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. నాయర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

నాయర్ మినహా..
ఆరంభంలో పుణె బౌలర్లు చెలరేగి తొలి 13 బంతుల్లోనే శామ్సన్ (2), శ్రేయస్ (3)లను ఔట్ చేయడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ తడబాటుకు గురైంది. 9 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన జహీర్‌సేనను నాయర్, రిషబ్ పంత్ ఆదుకున్నారు. ఓవర్‌కు మూడు ఫోర్ల చొప్పున బాదడంతో పవర్‌ప్లేలో ఢిల్లీ స్కోరు 54/2కు చేరుకుంది. ఫీల్డింగ్‌ను సడలించిన తర్వాత కూడా అదే జోరును చూపెట్టిన పంత్.. 9వ ఓవర్‌లో జంపాకు వికెట్ ఇచ్చుకున్నాడు. దీంతో మూడో వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. శామ్యూల్స్ (21 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఉన్నంతసేపు వేగంగా ఆడినా వికెట్‌ను కాపాడుకోలేకపోయాడు. నాయర్‌తో నాలుగో వికెట్‌కు 34 పరుగులు జత చేసి వెనుదిరిగాడు. భారీ ఆశలు పెట్టుకున్న అండర్సన్ (3), కమిన్స్ (11) నిరాశపర్చినా.. 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసిన నాయర్ నిలకడగా ఆడాడు. 18వ ఓవర్‌లో మిశ్రా (13 నాటౌట్)తో కలిసి 19 పరుగులు రాబట్టి ఆ తర్వాతి ఓవర్‌లోనే ఔటయ్యాడు.

స్కోరు బోర్డు
ఢిల్లీ: శామ్సన్ (రనౌట్) 2, నాయర్ (సి) ఉనాద్కట్ (బి) స్టోక్స్ 64, శ్రేయస్ (సి) ధోనీ (బి) ఉనాద్కట్ 3, పంత్ (సి) క్రిస్టియన్ (బి) జంపా 36, శామ్యూల్స్ (సి) ధోనీ (బి) క్రిస్టియన్ 27, అండర్సన్ (స్టంప్) ధోనీ (బి) సుందర్ 3, కమిన్స్ (బి) స్టోక్స్ 11, మిశ్రా నాటౌట్ 13, షమీ (సి) స్టోక్స్ (బి) ఉనాద్కట్ 2, నదీమ్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: 7, మొత్తం 20 ఓవర్లలో 168/8.వికెట్లపతనం: 1-3, 2-9, 3-83, 4-117, 5-124, 6-140, 7-162, 8-166.బౌలింగ్: ఉనాద్కట్ 4-0-29-2, థాకూర్ 3-0-35-0, సుందర్ 3-0-23-1, స్టోక్స్ 4-0-31-2, జంపా 4-0-29-1, క్రిస్టియన్ 2-0-18-1.

పుణె: రహానే (బి) జహీర్ 0, త్రిపాఠి (సి) పంత్ (బి) జహీర్ 7, స్మిత్ ఎల్బీ (బి) నదీమ్ 38, మనోజ్ (బి) కమిన్స్ 60, స్టోక్స్ (సి) అండర్సన్ (బి) షమీ 33, ధోనీ రనౌట్ 5, క్రిస్టియన్ ఎల్బీ (బి) షమీ 3, సుందర్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు: 10, మొత్తం: 20 ఓవర్లలో 161/7.వికెట్లపతనం: 1-0, 2-36, 3-74, 4-125, 5-134, 6-138, 7-161.బౌలింగ్: జహీర్ 4-0-25-2, షమీ 4-0-37-2, నదీమ్ 3-0-21-1, మిశ్రా 3-0-26-0, కమిన్స్ 4-0-31-1, శామ్యూల్స్ 1-0-12-0, అండర్సన్ 1-0-4-0.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *