About us

bharanikanaఆ‘భరణీయం’

అనుకున్నది సాధించడానికి డబ్బొక్కటీ ఉంటే సరిపోదు. ‘మనం చేయగలం’ అన్న నమ్మకం కూడా ఉండాలి. ఆశయాల పేరిట అనాలోచితంగా తీసుకునే ఏ నిర్ణయమైన నవ్వులపాలకాక మానదు. కానీ, నా ప్రయత్నం అందుకు విభిన్నమని చెప్పడానికి ముందు నాతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయించే స్ఫూర్తినింపుతున్న వారిని స్మరించుకోవడం అనివార్యమని నేను భావిస్తున్నాను.

ఫలితాన్ని పక్కనపెట్టి నచ్చిన పనిని తుది శ్వాస వరకూ ఇష్టపడి చేసే తత్వాన్ని అలవర్చిన నా తండ్రి భరణికాన నూకరాజు గారు, మానవ వినియోగానికి పనికిరాని అనేక వ్యర్థ ఆహార పదార్ధాలను ‘కోడి’ అనే యంత్రంతో పౌష్టికాహార గులికలుగా మార్చి ‘ఆరోగ్య భారతి’ కోసం పరితపించిన పద్మశ్రీ డాక్టర్ బందా వాసుదేవరావు (బీవీ రావు) గారు, ‘సమాజమే దేవాలయం, మనుషులే దేవుళ్లు’ అనే నినాదంతో నాటి వరకూ మనుగడలో ఉన్న మూస రాజకీయాలను మలుపు తిప్పి చివరి క్షణం వరకూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆరాటపడిన ఆ నాటి ఆరు కోట్ల ఆంధ్రుల అందాల, అభిమాన నటుడు ‘అన్న’ నందమూరి తారకరామారావు గారు ఎప్పటికీ నాకు స్ఫూర్తిప్రధాతలే. వారి ప్రస్తావన లేనిదే నా దినచర్య కూడా ప్రారంభం కాదని చెప్పడం అతిశయోక్తి మాత్రం కాదు.

ఏ రంగంలోనైనా కొత్తగా ప్రవేశించే వారు ముందుగా ఆలోచించేది ‘లాభం’. కానీ, దాని గురించి తర్వాత ఆలోచిద్దామనుకునే వ్యక్తిత్వాన్ని నేను పై ముగ్గురి నుంచి నేర్చుకున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఏదైనా వస్తువు మార్కెట్లో ప్రజాదరణ పొందాలంటే, దానికి ఓ చరిత్ర ఉండాలి. అదే పుస్తకాలో, పత్రికలో పాఠకాదరణ పొందాలంటే దానికో ప్రత్యేక చదువరి కావాలి. కానీ, ఎప్పటికప్పుడు తాజా విషయాలు, విశ్లేషణలు, వ్యాసాలూ తెలుసుకునే ఆసక్తికలిగిన ఔత్సాహికులు, చదివేవారు మాత్రం అనివార్యంగా ప్రేమించేది పత్రికలనే. వ్యాపార, ధనార్జన లక్ష్యాలతో పత్రికలు పెట్టడం మనం గతం నుంచీ చూస్తున్నదే. కానీ, పత్రికా రంగాన్నే నమ్ముకున్న వాళ్ల సంక్షేమమే, ఆదరణే ఆశయంగా వచ్చే పత్రికలు మాత్రం బహు అరుదనే చెప్పాలి.

అలాంటి వర్గానికి చెందింది మా పత్రికని చెప్పుకోవడానికి మా సంస్థ గర్వపడుతోంది. పత్రిక అంటే, చదివేశాక పడేసేది మాత్రం కాదు. కలకాలం లైబ్రరీలో దాచుకునేదన్నది మా భావన. బడుగుల ప్రగతి, సామాన్య ప్రజల సమగ్రాభివృద్ధి అనే ఆశయాలు ఆకర్షణీయమైన నినాదాలు గానే మిగిలిపోయాయి. ప్రాచీనమైన ప్రజా సంస్కృతిని పరిరక్షిస్తూనే వారిని పురోగమన పథంలో పయనింప చేస్తామన్న నేతల మాటలు నీటి మీద రాతలనిపించుకుంటున్నాయి. స్వాతంత్ర్యానంతరం ఈ ఆరున్నర దశాబ్దాల కాలంలో శుష్కప్రియాలు, శూన్యహస్తాలు మాత్రం అమాయకులైన జన సంతతికి మిగిలిపోయాయి.

అభివృద్ధి ఆశించిన రీతిలో లేక, అటు పారంపర్యంగా వస్తున్న వెనుకబాటుతనం జాడలు తరాల తరబడి వీడక అమాయకులు రెండు విధాలా నష్టపోతున్నారు. ఇక జన సంస్కృతీ, సంరక్షణ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ప్రభుత్వాలు ప్రకటించే పథకాల రాతల్ని చదివి పులకించి, పేదల పురోగతిని ఊహించి గర్వపడి, ఇదే సంస్కృతీ, సంరక్షణ అని ప్రగల్భాలు పలికే నాయకమ్మన్యుల పరివారం క్రమంగా పెరిగిపోతోందని చెప్పడానికి బాధేస్తోంది. ఈ దుష్ట సంస్కృతి సామాన్య, మధ్యతరగతి వర్గాల నుంచి ఎంపికైన ప్రజా ప్రతినిధుల్లో సైతం విస్తరిండం పొల్లు మాటకు తావీయని ఘనమైన జనసీమలు చేసుకున్న దురదృష్టం. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అసలే లేదని కాదు. అయితే అది అసంగతాభివృద్ధిగానే ఉందన్నది అందరూ అమోదించాల్సిన చేదు నిజం.

దళిత, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లో, రాయితీలో కల్పించినంత మాత్రాన అభివృద్ధి అట్టడుగు స్థాయికి అందుబాటులోకి రాదన్నది గడచిన చరిత్ర చెప్పే వాస్తవం. చిత్తశుద్ధి లేని కార్యాచరణ పర్యవసానం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతావణిలో అడుగడుగునా ద్యోతకమవుతుంది. అభివృద్ధి చెందిన వ్యాధులు కొండకోనల్లో కాలనాగుల్లా విలయం సృష్టిస్తున్నాయంటే ఇన్నేళ్ల ప్రగతి గతి ఏమిటో అన్న చింత జనిస్తుంది. పల్లెకో పాఠశాల, ఊరికో విద్యాలయం, ఉచిత వైద్య సేవల అందుబాటు, పేదలకు ఎలాంటి హామీలు లేకుండా రుణాలూ, పేద, ధనిక అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకూ సమన్యాయంతో ఆదాయ పంపిణీ అంటూ రొమ్ము చరుచుకొనే నేతలు ప్రకటిస్తూ ఉంటే, గ్రామీణ వాసులను కమ్ముకున్న నిరక్షరాస్యతా తిమిరం, వారిని నిత్యం పట్టిపీడిస్తున్న సీజనల్ వ్యాధులు, పీడించుకు తింటున్న అప్పుల భూతం, ఆర్ధిక ఇబ్బందులు కల్లెదుట సాక్షాస్కరిస్తుంటాయి. అపార సంపదలను సక్రమంగా వినియోగించుకోవాల్సిన నేలలో దుర్భర దారిద్ర్యం, దయనీయమైన జీవన విధానం విశ్వరూపంతో ప్రత్యక్షమై తలవంపులు తీసుకువస్తాయి.

ఆశయాలు గిరిశిఖరాల్లా మహోన్నతంగా ఉంటే వాటి అమలు అధ:పాతాళంలో ఉన్న ఎన్నో దృశ్యాలు గోచరిస్తాయి. ఆ స్థితిగతుల్ని, మైదాన, కొండకోనల్లోని వెలుగు, నీడల్ని, జన జీవనంలో విభిన్న పార్శ్యాల్నీ ప్రత్యేకంగా, ప్రముఖంగా పదిమంది దృష్టికీ తీసుకురావాలన్న సంకల్పంలో నుంచి ఉద్భవించింది మా ఈ పత్రిక. అదే సమయంలో పేద, మధ్యతరగతి, ధనిక అనే తేడా లేని జన సంతతికి చెందిన ఎందరినో సంఘటితపరిచి, వారికి ఘనమైన సంస్కృతీ పరంపరను తెలియజెప్పి, ఆసేతు శీతాచల పర్యంతం విస్తరించి ఉన్న ప్రాచీన విధానంలో వైవిద్యాన్ని, విస్తృతిని వివరించాలన్న సత్సంకల్పం కూడా మా పత్రిక ఉదయించడానికి కారణభూతమయింది. ఆపన్న సంతతికి చెందిన వారు వేరువేరు జీవన రంగాలలో స్థిరపడుతున్నారు. ఎందరో నిర్ణయాత్మక స్థాయికి చేరుకుంటున్నారు.

వారందరికీ తమ సంస్కృతీ విశిష్టతను చాటి చెబుతూ, వారిలో ఆత్మగౌరవ ఉద్ధీపనకు దోహదపడాలన్నది ఈ చిరు ప్రయత్నం ధ్యేయం. ఈ అసంఖ్యాక జనావళికి సంబంధించిన సమాచారాన్నే కాకుండా ఆపన్నులకు, అవసరమైన వారికీ ఉపయోగపడే అంశాలను సమగ్రంగా అందించాలన్నది మా ఈ కరదీపిక (పత్రిక) అంతిమ లక్ష్యం. ఇంతవరకు వివిధ రీతుల్లో ఇటువంటి సమాచారం కొంతవరకూ వస్తూ ఉండవచ్చు. అయితే పూర్తిగా పత్రికా రంగంలో మమేకమై, ఆ జీవన విధానంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వారి చేతుల మీదుగా వెలువడుతూ ఉండడమే మన పత్రిక విలక్షణ లక్షణం.

అంతర్జాలంలోనూ…
మా, మీ పత్రిక కేవలం పరిమిత పాఠకులకే అందుబాటులో ఉండే ప్రింట్ ఎడిషన్ గానే కాకుండా అంతర్జాలంలో (ఇంటర్నెట్లో) కూడా అందుబాటులో ఉంచాలన్న ఆలోచనే వెబ్‌సైట్, మొబైల్ యాప్. మొదట్లో ‘వర్డ్‌ప్రెస్’ సహకారంతో రోజువారీ వార్తలను, ఛాయాచిత్రాలను నెట్ పాఠకులకు అందిస్తూ వచ్చిన మన పత్రిక తర్వాత సొంత వెబ్‌సైట్ ఏర్పాటుచేసుకుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనికి తోడు రోజూ ప్రచురితమవుతున్న దినపత్రికను, పి.డి.ఎఫ్. ఫార్మెట్లో నెట్ పాఠకులకు అందుబాటులో ఉంచడం అదనపు ఆకర్షణ. దీనికి తోడు మొబైల్ పాఠకులకు కూడా మన పత్రికను తాజా సమాచారంతో నిరంతరం అందుబాటులో ఉంచాలన్న ఆకాంక్షలో భాగమే ‘ఫీచర్స్ ఇండియా’ మొబైల్ యాప్. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన ఫోన్లకే అందుబాటులోకి తెచ్చినప్పటికీ క్రమంగా విండోస్, ఐఫోన్ యూజర్లకు కూడా ఈ యాప్ డౌన్‌లోడ్ సదుపాయాన్ని కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కలిగిన ఏ మొబైల్ వినియోగదారులైనా నేరుగా తమ ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి Features India అని ఎంటర్ చేయడం ద్వారా మన పత్రిక యాప్‌ను పొందవచ్చు.

ఉజ్వల కాంతిని వ్యాపింప చేయాలన్న సంకల్పంతో వెలిగించిన ఈ చిరుదీపాన్ని తిలకించి మా ప్రయత్నానికి మీ సహాయ సహకారాలు అందిస్తారన్నది మా ఆకాంక్ష. ఈ క్రమంలో మీ అమూల్య సలహాలు, సూచనలు, ప్రతిస్పందనలే మాకు శ్రీరామరక్ష. సాహిత్య, సామాజిక అంశాలతో పాటు వాణిజ్య, రాజకీయ వార్తలకూ వేదికలా నిలిచేలా పత్రికను తీర్చిదిద్దడమే కాదు… వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలకు ప్రచార వేదికలా ఉండే పత్రిక కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మన పత్రిక వస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను.

– మీ
భరణికాన రామారావు
+91 98491 28228
sasasasr@yahoo.co.in
brr@featuresindia.com
Visit us; www.featuresindia.com