అంకిత భావంతో పని చేయాలి: కలెక్టర్
ఒంగోలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. ఒంగోలు దక్షిణ బైపాస్ సమీపంలోని పాత జడ్పీ కార్యాలయం సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్డొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ సర్వేపల్లి రాధాక్రిష్ణన్‌ను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఉపాధ్యాయుడు విద్యాభివృద్ధికి కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు, కొండపి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎమ్మెల్సీ వి. బాలసుబ్రహ్మణ్యం, డీఈఓ సుప్రకాశ్, సర్వశిక్ష అభియాన్ పీవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా తొలుత సర్వేపల్లి రాధాక్రిష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
కేసీపీని సందర్శించిన ‘కిట్స్’ విద్యార్థులు
ఒంగోలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): మార్కాపురం కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం, చివరి సంవత్సరపు మెకానికల్ విభాగపు విద్యార్థులు మాచర్ల పట్టణంలోని కెసిపి సిమెంట్ పరిశ్రమను సందర్శించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి కృష్ణారెడ్డి మంగళవారం ఇక్కడ తెలిపారు. ఈ సందర్శనలో విద్యార్థులకు పరిశ్రమ ఉద్యోగులు సిమెంటు తయారీ విధానం, కావలసిన మెటీరియల్, మిషనరీల గురించి క్షుణ్ణంగా వివరించినట్లు తెలియచేశారు. ముఖ్యంగా ఈ విధానంలో కన్వేయర్ సిస్టమ్ గురించి దాని పనితీరును, వివిధ భాగాలలో ఎలా ఉపయోగపడుతుందో పూర్తిగా వివరించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో పాటు మెకానికల్ విభాగపు అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా, కందుకూరు పట్టణంలోని వాసవీనగర్ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో శాసనసభ్యులు పోతుల రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న కల్వర్ట్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్అండ్బి అతిథిగృహానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు మండలాల నుంచి నాయకులు, ప్రజలు సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్యేను కలిసి అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతి సమస్య పరిష్కారం అవుతుందని ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో మాజీ ఎమ్మెల్యే కె ఆదెన్న, నాయకులు ఉన్నం వీరాస్వామి, ఉప్పుటూరి శ్రీనివాసరావు, చల్లా నాగేశ్వరరావు, వలేటి నరసింహం, కొడాలి కోటేశ్వరరావు, గుళ్ల శ్రీను, తదితరులు ఉన్నారు.
విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతో యువకుడు మృతి
ఒంగోలు, సెప్టెంబర్ 6 (న్యూస్‌టైమ్): జెఎల్ఎం నిర్లక్ష్యం కారణంగా ఒక యువకుడు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలంలోని సిద్దనపాలెం గ్రామంలో జరిగింది. సిద్దనపాలెం సబ్‌స్టేషన్ పరిధిలో జెఎల్ఎంగా పనిచేస్తున్న నక్కా నారాయణ సిద్దనపాలెం గ్రామానికి చెందిన మాగులూరి శ్రీనివాసరావు అనే యువకుడు గేదెలను మేపుతుండగా నారాయణను బలవంతంగా యువకున్ని తీసుకొచ్చి విద్యుత్ స్తంభం ఎక్కించాడు. ఆ స్తంభంపై మానేపల్లి, అయ్యగానిపల్లి రెండు గ్రామాలకు చెందిన ఫీడర్లు ఉన్నాయి. జెఎల్ఎం నారాయణ షిప్ట్ ఆపరేటర్‌కు ఫోన్‌చేసి అయ్యగానిపల్లికి చెందిన ఎల్సి ఇప్పించాడు. అప్పటికి స్తంభంపై ఉన్న శ్రీనివాసరావు జంపర్లు కలుపుతుండగా మానేపల్లి ఫీడర్‌లోని విద్యుత్ సరఫరా కావడంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే చనిపోయి స్తంభంపైనే ఉన్నాడు. జెఎల్ఎం నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాసరావు చనిపోయాడని తండ్రి వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఎస్ఐ ఎస్ఆర్ నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఐటిఐ కష్టపడి చదివించుకున్నానని విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చేతికందిన కొడుకును కడుపున పెట్టుకున్నారని, పథకం ప్రకారమే కావలసి ఇదంతా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, జెఎల్ఎం నిర్లక్ష్యమే కారణంగానే శ్రీనివాసరావు చనిపోయాడని శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలోని గతంలో కూడా విద్యుత్ సిబ్బంది వలన స్తంభంపై పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులు ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది. వేలకు వేలు జీతాలు తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు తక్కువ కూలి ఇచ్చి పనిచేయించుకుంటూ తమ జీతాలతో పబ్బంగడుపుకుంటూ యువకులను బలిచేస్తున్నారు. చనిపోయిన మృతునికి ఆర్థిక పరమైన అంశంలో న్యాయం జరిగే విధంగా చూడాలని గ్రామస్తులు, బంధువులు కోరుతున్నారు.


