అంతర్గత నిధులతో విశ్వవిద్యాలయాల నిర్వహణ
శ్రీకాకుళం: అంతర్గత వనరులతో నిర్వహించుకొనేలా విశ్వవిద్యాలయాలు ఆర్థిక స్వావలంబన సాధించాలని విజయవాడలో నిర్వహించిన ఉపకులపతుల సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి ఉపకులపతి మిర్యాల చంద్రయ్య, రిజిస్ట్రార్ గుంట తులసీరావు తెలియజేశారు. సమావేశం అనంతరం వారు వివరాలు వెల్లడించారు.
విశ్వవిద్యాలయాల వద్ద రూ. వందల కోట్లు అంతర్గతంగా ఉన్నాయని, వాటిని వినియోగించాలని మంత్రి చెప్పారు. వర్సిటీలు కాలక్రమేణా ఆర్థిక పరిపుష్టి సాధించి సొంతంగా నిర్వహించుకొనే స్థాయికి ఎదగాలని పేర్కొన్నారు. ప్రతి ఏటా ఆడిట్ నిర్వహించుకోవాలని, ప్రతి వర్సిటీకి ఆర్థిక అధికారులను నియమిస్తామని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కళాశాల విద్య కమిషనర్ ఉదయలక్ష్మి, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, ఉప కులపతులు పాల్గొన్నారన్నారు.


