అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యం
- 72 Views
- wadminw
- January 8, 2017
- Home Slider రాష్ట్రీయం
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని మారుమూల పల్లెల్లో మనుషులకే కాదు మూగజీవాలకు కనీస వైద్యం అందని దుస్థితి నెలకొంది. మేకలకు జలగరోగం, గొర్రెలకు నీలినాలిక వ్యాధులు వస్తుండడంతో మృత్యువాత పడుతున్నాయి. దీంతో జీవాలపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న రైతులు అర్ధాంతరంగా రోడ్డున పడాల్సిన పరిస్థితి. పచ్చిమేత లభించని పరిస్థితిలో అష్టకష్టాలు పడి జీవాలను పోషిస్తే ప్రస్తుతం జీవాలకు వస్తున్న వ్యాధుల కారణంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చిందని జీవాల రైతులు వాపోతున్నారు.
జీవాలకు మూతి నుంచి నురగ వచ్చి కొన్నిరోజులకే మృతి చెందుతున్నాయి. వ్యాధిని గుర్తించడం, నివారణ చర్యలపై జీవాల రైతులకు అవగాహన లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మండలంలోని జప్తీవీరప్పగూడెం జెటావత్ తండాలో గిరిజన కుటుంబాలు జీవాల పోషణపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కాగా ఇదే తండాలో ధనావత్ పాపకు ధనావత్ ధారాసింగ్, ధనావత్ బాల, ధనావత్ నగేష్‌లకు చెందిన జీవాలు కలిసి మొత్తం 150 జీవాలు ఉన్నాయి. వీటిలో నీలినాలిక, జలగరోగం కారణంగా ఇప్పటికే సుమారు ఒక్కో రైతు వద్ద 5 నుంచి 6 జీవాలు మృత్యువాత పడ్డాయి. పదిరోజులుగా జీవాలు మరణిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పశువైద్యాధికారులు సకాలంలో అందుటుబాటులో లేని కారణంగా బాధిత జీవాల రైతులు ప్రైవేట్ పశువైద్యులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. సోమవారం జెటావత్ తండాలో జీవాలకు వచ్చిన వ్యాధులకు ప్రైవేట్‌గా వచ్చిన పశువైద్యులు చికిత్స అందించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే పశువైద్యాధికారులు సమీప గ్రామాల్లో వచ్చే జీవాలకు వచ్చే వ్యాధులను గుర్తించి జీవాల రైతులు నష్టపోకుండా చూడాలని పలువురు కోరుతున్నారు.


