అక్రమార్కుల ఇష్టారాజ్యం
- 102 Views
- wadminw
- September 4, 2016
- రాష్ట్రీయం
ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్, ఇన్కంటాక్స్ అధికారులను, వేలాది మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులను తయారు చేసిన కళాశాల ఇపుడు అక్రమార్కుల కబంధ హస్తాలలో చిక్కుకుని విలవిలలాడుతోంది. వేలాది మంది రాజకీయ నాయకులను తీర్చిదిద్దిన ఆ సంస్థ కొందరి స్వార్థ రాజకీయానికి బలవుతోంది. అర్హత లేకున్నా, దొడ్డి దోవన పాలకవర్గంలోకి ప్రవేశించటమే కాకుండా లక్షలాది రూపాయల విద్యార్థుల సొమ్మును కైంకర్యం చేసిన ప్రబుద్ధులు ఇపుడు ఏకంగా సంస్థ ఆస్తులనే తెగనమ్మేందుకు కుట్ర పన్నుతున్నారు.
కమ్యూనిస్టుల పోరుగడ్డ కృష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరంలో వేములపల్లి కోదండరామయ్య, డాక్టర్ సీఎల్ రాయుడు, చింతపల్లి లక్ష్మారాయుడు, అట్లూరి శ్రీమన్నారాయణ, కాట్రగడ్డ పెద వెంకటరాయుడు, ముఖాల నాగభూషణం వంటి మహనీయుల దాతృత్వంతో 1969లో వీకేఆర్ కళాశాల ఆవిర్భవించింది. రెండున్నర వేలకుపైగా విద్యార్థులతో నిత్యం కళకళలాడే ఆ కళాశాలలో ఇపుడు అందులో నాలుగో వంతు విద్యార్థులు కూడా లేకపోవటం గమనార్హం. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో వీకేఆర్ కళాశాల ఉండటమే ఇందుకు కారణం.
ఇదే అదనుగా చూసుకుని దొడ్డిదారిన పాలకవర్గంలోకి ప్రవేశించిన కొందరు స్వార్థపరులు ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు పెద్దఎత్తున కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీకేఆర్ కళాశాలకు చెందిన రూ.30 కోట్ల ఆస్తులను కైంకర్యం చేసేందుకు కమిటీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కళాశాల భూములను ఎకరా రూ.1.25 కోట్లకు అమ్మేందుకు బేరసారాలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఎయిడ్తో నడుస్తున్న ఈ కళాశాల ఆస్తులన్నీ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలోనే ఉంటాయి.
అయినప్పటికీ కళాశాల భూములను అమ్మి సొమ్ము చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం. ఇందుకు అధికార టీడీపీ ప్రజా ప్రతినిధులుసైతం అండగా నిలవటం గమనార్హం. గన్నవరం విమానాశ్రయం విస్తరణలో కళాశాల తన 22 ఎకరాల భూమిని కోల్పోనుంది. ఇటీవలే భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇది ఒకవైపున జరుగుతుండగా, మరోవైపున కళాశాల పాలకవర్గం భూములను రియల్టర్లకు అమ్మేందుకు బేరసారాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దాతల కుటుంబాల పేరుతో రెండేళ్ల క్రితం పాలకవర్గంలోకి ప్రవేశించిన కొందరు, తమకు భూములను అమ్ముకునే హక్కు ఉందంటూ రూ.కోట్ల విలువ చేసే ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు.
కళాశాల భూములను ఎకరా రూ.1.25 కోట్లకు విక్రయించేందుకు బేరం కూడా కుదిరినట్లు సమాచారం. దాతలు ఇచ్చిన ఆ భూమంతా గన్నవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధీనంలో ఉంది. అయినప్పటికీ, దాతల పేర్లతో ఉన్న దస్తావేజులను చూపించి కాజేసేందుకు పాలకవర్గ సభ్యులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రెండేళ్లుగా కాలేజీ భూముల అమ్మకానికి ప్రయత్నాలు జరుగుతుండగా, గన్నవరం ప్రాంత సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులు అడ్డుపడి వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ వస్తున్నారు. వీకేఆర్ కళాశాలలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు అనేక కోర్సులు కళాశాలలో ఉండేవి.
ఇందుకోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ప్రభుత్వ నిధులతోపాటు కళాశాల యాజమాన్య కమిటీ ఫండ్ నుంచి కోట్లాది రూపాయలను వెచ్చించి భవనాలు నిర్మించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వంటి కోర్సుల కోసం లక్షలాది రూపాయలతో పరికరాలను కొనుగోలు చేశారు. కంప్యూటర్ కోర్సు కోసం వందలాది కొత్త కంప్యూటర్లను సమకూర్చారు. వాటిలో కొన్నింటికి ఇప్పటికీ సీల్ తీయలేదంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలుగా ఉంటుందని విద్యార్థులు చెబుతున్నారు. పాలకవర్గంలోని కొందరికి గుడివాడ ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల ఉండటంతో, కొన్ని పరికరాలను అక్కడకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. లక్ష రూపాయలు విలువ చేసే మైక్రోస్కోప్, కెమేరాలు సైతం కళాశాలలో ఉన్నాయి.
50 వేలకు పైగా టైటిల్స్ ఉన్న గ్రంథాలయం కూడా వీకేఆర్ కళాశాలలో ఉంది. ఇలాంటి కళాశాల భూములను తెగనమ్మి సొమ్ము చేసుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకోకపోతే దాతల ఔదార్యానికి అర్థం లేకుండా పోతుందని కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వాపోతున్నారు. కళాశాల భూముల అమ్మకం విషయంలో విపక్షాల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయని గుర్తించిన పాలకవర్గం ప్రతినిధులు అధికార టీడీపీకి చెందిన ప్రజా ప్రతినిధుల అండ కోరారు. ఇందుకు స్థానిక ముఖ్య ప్రజా ప్రతినిధి బాహాటంగా మద్దతు తెలపటంతో వారం రోజుల క్రితం మరోసారి భూములు అమ్మే ప్రయత్నం జరిగింది.
ఎయిర్పోర్టు విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి రాజధాని అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ విధానంలో స్థలాలను కేటాయిస్తున్నారు. వీకేఆర్ కళాశాల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో ఎకరాకు రూ.54 లక్షల నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 22 ఎకరాలకు సుమారు రూ.12 కోట్లు, కళాశాల భవనాలు, ఇతర వాటికి మరో రెండు మూడు కోట్ల రూపాయల పరిహారం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కమిటీలో ఉన్న తమకు ఏం లాభం ఉండదని భావించిన పాలకవర్గ ప్రతినిధులు.. భూములను మార్కెట్ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
రియల్టర్లు ఈ భూముల కొనుగోలుపై స్థానికంగా వివరాలు సేకరిస్తుండటంతో ఈ విషయం కాస్త బయటకు పొక్కింది. అయితే దీనికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో రియల్టర్లు స్థానిక ప్రజా ప్రతినిధులను సైతం కలవటం గన్నవరం ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశమైంది. ఎంతో మంది దాతల దాతృత్వంతో వెలిసిన విద్యాలయ భూములను కొందరు తమ స్వార్థం కోసం అమ్మేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా ఉన్నతవిద్యాశాఖ పట్టించుకోకపోవటం శోచనీయం.


