అక్షరాస్యత శాతాన్ని పెంపొందించేందుకు కృషి: మంత్రి గంటా
- 87 Views
- wadminw
- October 5, 2016
- రాష్ట్రీయం
విజయవాడ, అక్టోబబర్ 5 (న్యూస్టైమ్): దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యతా శాతాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని గుణదల భిషపుగ్రాస్ ఉన్నత పాఠశాల మైదానంలో రాష్ట్ర స్థాయి ‘కళాఉత్సవ్-2016’ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
తొలిరోజు పోటీలు ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ విద్యార్థులను గొప్ప క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రోజులో ఒక తరగతి సమయాన్ని క్రీడల కోసం కేటాయించాలన్నారు. విద్యార్థులు కేవలం చదువులు, కంప్యూటర్లకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కూచిపూడి నృత్యం అభివృద్ధికి రూ.100 కోట్లను కేటాయించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు.
ప్రతినెలా మొదటి శనివారం ఆయా పాఠశాలల విద్యార్థులు మొక్కలు నాటడానికి, రెండో శనివారం స్వచ్ఛంధ్రప్రదేశ్కు మూడో శనివారం భూగర్భ జలాల పరిరక్షణకు కృషిచేయాలని కోరారు. నాలుగో శనివారం పైమూడు శనివారాల్లో చేపట్టిన కార్యక్రమాలను జియో ట్యాగింగ్ ద్వారా సమీక్షించి ప్రభుత్వానికి ఛాయాచిత్రాలను పంపించాలని కోరారు.


