అడవిబిడ్డల గోడు వినేదెవ్వరు?
- 92 Views
- wadminw
- January 14, 2017
- Home Slider జాతీయం
ఖమ్మం: ప్రభుత్వాలు మారుతున్నాయి… పాలకులు మారుతున్నారు… కానీ వారి సమస్యలు మాత్రం తీరడం లేదు. వారిని అమాయకులను చేసి ఆడుకుంటున్నా నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు దగాలో నిర్వాసితులను బలిపశువులను చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరిట గిరిజన సంస్కృతి మంగళం పాడి… ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేసి పరిహారం చెల్లించకుండా పరిహాసమాడుతున్నారు. ఈ అడవిబిడ్డల గోడు వినేదెవ్వరూ? పునరావాసమంటూ కబుర్లు చెప్పి గూడులేకుండా చేస్తున్నారు.
దీంతో సర్వస్వం కోల్పోయి పరాయి బతుకు బతకలేమని గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టు కోసం జీవితాలను త్యాగం చేస్తున్న తమ బతుకుల పట్ల ప్రభుత్వం కనీస సానుకూల ధోరణితో వ్యవహరించాలని వేడుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో దేవీపట్నం మండలంలో పోలవరం ముంపు గ్రామాలు 42 ఉన్నాయి. వీటికి తోడు ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి ఏపీలో విలీనమైన ఏడు మండలాల్లోని 277 రెవెన్యూ గ్రామాల పునరావాస ప్యాకేజీ బాధ్యత కూడా జిల్లా యంత్రాంగంపై పడింది.
దీంతో పునరావాసం, నష్టపరిహారంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం పలు దఫాల్లో కల్పించిన పునరావాస కేంద్రాలకు వెళ్లిన నిర్వాసితులకు చుక్కెదురవుతోంది. మొదటి దశలో పునరావాస కాలనీలకు తరలివెళ్లిన గిరిజనులు అక్కడ సరైన ఉపాధి దొరక్క, కాలనీలో మౌలిక సదుపాయాలు సక్రమంగా లేక తిరిగి సొంతూర్లకు చేరుకున్నారు. దీనికి తోడు ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా గిరిజనుల భూమికి భూమి ఇవ్వకపోవడం, కొందరికి మొక్కుబడినా ఇచ్చిన భూములు వ్యవసాయానికి యోగ్యమయ్యేవి కాకపోవడంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
పునరావాస కాలనీల సమీపంలోని అడవుల్లోకి ఫలసేకరణకు అక్కడి స్థానిక గిరిజనులు నిర్వాసితులను రానివ్వకపోవడంతో తిరిగి సొంతూళ్లకి చేరుకున్నారు. వీటికి తోడు గిరిజనేతలకు భూమికి నష్టపరిహారంగా మూడున్నర లక్షలు ఇస్తుంటే, గిరిజనులకు మాత్రం రెండున్నర లక్షల పరిహారంతో అధికారులు మోసం చేస్తున్నారు. ఈ అక్రమాలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. ప్రాజెక్టు కోసం ఉన్న ఊరును, పెరిగిన పరిసరాలను వదిలేసి పొట్టచేత్తో పట్టుకుని అడవికి దూరంగా పోతోన్న తమ గోడును పట్టించుకోవాలని కోరుతున్నారు. లేదంటే పోరాటాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


