అధికారులకు ‘జన్మభూమి’ కుదుపు!
- 174 Views
- wadminw
- September 22, 2016
- రాష్ట్రీయం
గుంటూరు, సెప్టెంబర్ 22 (న్యూస్‌టైమ్): ‘‘కదులుదాం రండి మనం జన్మభూమికై… తల్లి పాల రుణం కాస్త తీర్చడానికై’’ ఈ పాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ మళ్లీ వినిపించనుంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమంలో ఈ పాట మారుమ్రోగింది. అంతేగాక టిడిపి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ పాటను మైకుల్లో హోరెత్తించేవారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార పీఠమెక్కిన తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మళ్లీ జన్మభూమి అంటూ ప్రజల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, గత ఏడాది అక్టోబర్‌లో నిర్వహించిన రెండో సారి కార్యక్రమం తర్వాత దాని గురించి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ‘జన్మభూమి’ పేరిట ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు స్థాయి కమిటీలు మాత్రం మనుగడలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కాస్త పేరు మార్చి ‘జన్మభూమి – మనవూరు’ పేరిట ఈ కార్యక్రమం ఇక మీదట తరచూ నిర్వహించనున్నారు. గతంలో నిర్వహించిన ఈ జన్మభూమి పట్ల పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు హయాంలో 1998-2004 మధ్య జన్మభూమి కార్యక్రమం అమలు అయ్యింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామగ్రామాన చైతన్యం తేవాలని, ప్రజలందరూ అభివృద్ధికి కృషిచేయాలన్న ఉద్ధేశ్యంతో జన్మభూమి కార్యక్రమాన్ని 1997లో ఘనంగా ప్రారంభించారు. వార్డుస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సభలు నిర్వహించి ఈ కార్యక్రమం చేపట్టేవారు. తమ ప్రాంతాల్లోని సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి ప్రజలు తెచ్చేవారు. చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు. కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేవారు. జఠిలమైన సమస్యలను సంబంధిత కలెక్టర్, అధికారులకు రిఫర్ చేసేవారు. జన్మభూమి కార్యక్రమం కింద ఏదైనా పని చేపట్టడానికి సగం ఖర్చును గ్రామం లేదా కాలనీ వారు భరించవలసి వచ్చేది. ప్రత్యేకించి రోడ్లు, డ్రైనేజీ తదితర పనులకు ఈ కార్యక్రమాన్ని వాడుకునేవారు.
ఆ తర్వాత రోజులలో దీనిపై విమర్శలు కమ్ముకువచ్చాయి. ఒక వైపు పన్నులు చెల్లిస్తూ, మరో వైపు ఈ ఏభై శాతం వ్యయం భరించాలనడం ఏమిటనే వాదన ఉండేది. మరోవైపు కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులతో రోడ్లు ఊడ్పించడం, శుభ్రం చేయించడం వంటి పనులు వారిలో తీవ్ర అసహనాన్ని నింపాయి. చంద్రబాబు తీరును అప్పట్లో తీవ్రంగా ఖండించారు. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తించారు. ఈ వ్యతిరేకత ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందని రాజకీయ పండిట్లు విశ్లేషిస్తారు. టిడిపి ఘోరంగా ఓడిపోవడానికి రైతు వ్యతిరేకత ఒకటైతే, ఉద్యోగుల వ్యతిరేకత కూడా మరొకటని చెబుతారు. సుమారు పదేళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించారు. కాస్త పేరు మార్చి ‘జన్మభూమి-మనవూరు’ పేరుతో ప్రజల్లోకి తీసుకువచ్చి బాగానే ప్రాచుర్యంలోకి వచ్చారు.
తర్వాత ఎందుకో గానీ, దీనిపై ఆయన పెద్దగా శ్రద్ధపెట్టలేదు. దేశ, విదేశాల్లో ఉండే వారు తమ సొంత గ్రామానికి, ప్రజలకు తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో దీనిని నిర్వహిస్తున్నామని మళ్లీ ఇప్పుడు బాబు చెబుతున్నారు. ‘మళ్లీ నేను వీధుల్లో తిరుగుతాను. ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. అధికారులూ సిద్ధం కండి’ అంటూ ఈమధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఓ సభలో ప్రకటించారు. అయితే, ఈసారి కొత్త కార్యక్రమం చంద్రబాబుకు కలిసి వస్తుందా? లేదా? చూడాలి. కాగా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పును ఇవ్వకపోవడంతో ఘోర పరాజయాన్ని చవి చూసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు అందాయి.
ఇతర జిల్లాల సంగతి ఎలా ఉన్నా మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రం ఇక క్షేత్ర స్థాయిలో ఉంటూ ప్రజాక్షేత్రంలో నిరంతరంగా ప్రజలతో కలిసిమెలిసి వారి సమస్యల పట్ల ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక తరచూ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంతో పాటు మండల, గ్రామ స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. అందులో భాగంగా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని ఎన్నికల తర్వాత తొలిసారిగా నియోజకవర్గ స్థాయి సమావేశం ఇక్కడ నిర్వహించడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని ఆ పార్టీ నాయకులు సంకేతాలు పంపారు.
గతంలో రైతుల సమస్యలనే ఏకరవు పెడుతూ ఆ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఎన్నికల సమయంలో అనుకూలంగా రైతులు కాంగ్రెస్ పార్టీకి వ్యవహరించడంతో 2004లో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. అయితే ప్రస్తుతం మళ్లీ ఐదేళ్ల తర్వాత అధికారం దక్కాలంటే ప్రజాక్షేత్రంలో ఉండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్‌తో పాటు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, డికె అరుణ, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, చిట్టెం రాంమోహన్‌రెడ్డిలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలలోనే మకాం వేసి తరచూ ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు.
జిల్లాలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి స్థానాన్నా కైవసం చేసుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇప్పటి నుండే ప్రతిపక్షంలో ఉండి ప్రజాసమస్యలపై పోరాటాలు చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు గత రెండు రోజుల క్రితం రహస్యంగా భేటి అయి నిర్ణయించినట్లు సమాచారం. మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, కొడంగల్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, దేవరకద్ర, కొల్లాపూర్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేనందున ఆయా నియోజకవర్గాలలో నియోజకవర్గ ఇన్చార్జిలకు పూర్తి బాధ్యతలు అప్పజెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజాసమస్యలను లేవనెత్తుతూ అధికార పక్షాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ శ్రేణులను జిల్లా కాంగ్రెస్ పార్టీ సమాయత్తం చేస్తోంది. ఏదిఏమైనప్పటికినీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఇక నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలని డిసిసి నాయకులు నిర్ణయించారు.


