అధిక పట్టుగూళ్ల ఉత్పత్తికి ప్రణాళికలు
- 74 Views
- wadminw
- October 25, 2016
- రాష్ట్రీయం
తిరుపతి, అక్టోబర్ 25 (న్యూస్‌టైమ్): దేశవ్యాప్తంగా పట్టుగూళ్ల ఉత్పత్తి పెంపునకు పటిష్ఠ ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర పట్టు పరిశ్రమ(సిల్క్ బోర్డు)మండలి చైర్మెన్ కె.ఎం.హనుమంతరాయప్ప పేర్కొన్నారు. మనదేశానికి అవసరమైన పట్టుగూళ్లను ఇక్కడే ఉత్పత్తి జరిగేలా రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలందించి సాగు విస్తరణకు చర్యలు చేపట్టామన్నారు.
సిల్క్‌బోర్డు ఛైర్మన్‌గా ఈయన ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం విస్తరణ దిశగా కార్యచరణ ప్రణాళికలలో భాగంగా స్థానిక ఇరువారం వద్ద ఉన్న పట్టుగుడ్ల ఉత్పాదన కేంద్రాన్ని సందర్శించారు. జిల్లాలో పట్టుసాగు విస్తీర్ణం, పట్టుగూళ్ల ఉత్పత్తి, చాకీ కేంద్రాలు, పట్టురైతుల స్థితిగతులపై ఉత్పాదన కేంద్రం జేడీ దీపా చైర్మెన్‌కు వివరించారు. కె.ఎం.హనుమంతరాయప్ప మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 27 వేల మెట్రిక్ టన్నుల పట్టుదారం(నాలుగు రకాల సిల్క్) ఉత్పత్తి జరుగుతుందని, మనకు 30-32 వేల మెట్రిక్ టన్నుల పట్టు దారం అవసరం కాగా మిగిలిన పట్టుదారాన్ని చైనా దేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు.
పట్టు రైతులకు నాసిరకం గుడ్లు సరఫరా చేస్తే సంబంధిత చాకీ కేంద్రాన్ని సీజ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తొలుత పట్టు రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టు సాగులో ప్రతి నెల డబ్బులేనని, ఏ పంటలో సంపాదించలేనంత ఆదాయం పొందవచ్చని చెప్పారు. ఐదుగురు పట్టు రైతులు మాత్రమే హాజరుకావడంతో అధికారుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టు సాగులో ఎదురయ్యే సమస్యలు, పట్టుగూళ్ల ధరలు, మార్కెంటింగ్, ప్రోత్సాహక పథకాల అమలు తదితర అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో జిల్లా స్థాయిలో ఇక్కడే పట్టు రైతులతో సమావేశం ఏర్పాటు చేయాలని, నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తి, సాగు విస్తరణకు ప్రతి నెల పట్టు రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


