అనుబంధ కళాశాలల విద్యార్థులకు జాబ్‌మేళా: ఏయూ వీసీ
విశాఖపట్నం, అక్టోబబర్ 4 (న్యూస్‌టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల విద్యార్థులకు ప్రత్యేక జాబ్‌మేళా నిర్వహిస్తామని ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు అన్నారు. ఏయూ అనుబంధ కళాశాలల యాజమాన్యాలు మంగళవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యాలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచే దిశగా కృషిచేయాలన్నారు. సమాజ అవసరాలను గుర్తించి నడచుకోవాలన్నారు. జాతీయ ర్యాంకింగ్‌లు సాధనలో అనుబంధ కళాశాల పాత్ర ఎంతో కీలకమన్నారు. అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా అందించాలన్నారు.
వర్సిటీకి అనుబంధ కళాశాలలే బలాన్ని అందిస్తున్నాయన్నారు. ప్రతిష్టాత్మంగా అనుబంధ కళాశాలలు ఎదగాలన్నారు. పరస్పరం సహకారం అందిస్తూ ముందుకు సాగుతామన్నారు. డిసెంబర్ 10వ తేదీన వర్సిటీ పూర్వవిద్యార్థుల సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ వ్యవస్థలను కళాశాలల్లో ఏర్పాటుచేయాలని సూచించారు. వీటిద్వారా భవిష్యత్తులో పూర్తిస్థాయిలో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయాలు అందుతాయన్నారు. విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లో కోర్సుల ఫీజు రుసుములకు ఏకీకృత విధానం అమలు చేస్తామన్నారు. దీనిపై రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో చర్చిస్తున్నామన్నారు.
బోధనలో నాణ్యత పెంచుతామని, అనుబంధ కళాశాలల అధ్యాపకులకు అవసరమైన శిక్షణను వర్సిటీలో అందించడానికి సిద్దంగా ఉన్నామన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ నాణ్యతలు పెంపొందిచడానికి అనుబంధ కళాశాలలు పూర్తి సహకారం అందించాలన్నారు. కళాశాల దృక్పధంలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో నాణ్యతను పెపొందించడం, మెరుగైన విద్యను అందించడం లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఆక్మా గౌరవ అద్యక్షుడు ఎన్.శేషారెడ్డి మాట్లాడుతూ అనుబంధ కళాశాలలు బలోపేతం కావాలన్నారు. డిగ్రీ పూర్తిచేసే సమయానికి ఉపాధి అవకాశాన్ని అందిచడం ఎంతో అవసరమన్నారు.
దీనికోసం ప్రత్యేకంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్టిఎఫ్ పెంపుదల చేయాలని కోరారు. అసోసియేషన్ అద్యక్షుడు టి.బలరామకృష్ణ మాట్లాడుతూ సమిష్టిగా, కష్టించి పనిచేయడానికి సిద్దంగా ఉన్నామన్నారు. ఉత్తీర్ణత శాంతం పెంపుకు అవిశ్రాంతంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో ఏయూ సిడిసి డీన్ ఆచార్య టి.కోటేశ్వరరావు, కార్యదర్శి సుంకరి రవీంద్ర, ఉపాద్యక్షుడు రామారావు, కోశాధికారి జె. రమణాజి తదితరులు ప్రసంగించారు. అనంతరం వీసీ ఆచార్య నాగేశ్వరరావును ఘనంగా సత్కరించారు.


