అన్నదాత అంటే అప్పుపుట్టదింక!
- 74 Views
- wadminw
- October 3, 2016
- రాష్ట్రీయం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ మధ్య పతాక వార్తలకు ఎక్కుతోంది. విషయం ఏదైనా, ఆయన ప్రకటన సంచలనాలకు మారుపేరుగా మారుతోంది. అలా ఎందుకు జరుగుతోందని అడిగే వారు లేకపోయారు తెలంగాణ సర్కారులో. నిజమే… అలా ప్రశ్నించి… ఆలోచన చేసే వారే ఉండి ఉంటే కేసీఆర్ పరిస్థితి ఇప్పుడిలా ఉండేదే కాదు. ప్రతికూల పరిస్థితులను కూడా తనకు అనుకూలంగా మలచుకునే నేర్పరిగా పేరున్న కేసీఆర్ ఇటీవల కాలంలో మీడియా దృష్టిలో (తన సొంత మీడియా దృష్టిలో కాకపోయినా…) విలన్‌గా అవతరించారన్న ప్రచారం ఊపందుకుంది. అన్నదాతల ఆత్మహత్యలకు ఆయనే, ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమన్న విపక్షాల ప్రచారాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే నాయకుడు కూడా తెరాస పార్టీలో గానీ, సర్కారులో గానీ లేడా?
అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కె. తారక రామారావు, టి. హరీశ్‌రావు, కవిత లాంటి నేతలు అప్పుడప్పుడు తమ ప్రధాన శత్రువైన తెలుగుదేశం సహా విపక్షాలపై విరుచుకుపడుతున్నా ఫలితం లేకుండాపోతోంది. విషయం ఏమిటంటే… తమ విమర్శలను తిప్పికొడుతున్న వారంతా కేసీఆర్ కుటుంబ సభ్యులేనన్న అపవాదు తెలంగాణ ముఖ్యమంత్రిని వీడడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేస్తే దారుణమైన స్థితిగతులు కనిపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. తెలంగాణలో అన్నదాత పరిస్థితి మరింత అగచాట్ల మయమై అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని విమర్శల వర్షం కురిపిస్తోంది. రైతు నికృష్ట స్థితినుంచి కొంతకాలం తర్వాతనైనా బాగుపడడానికి కేసీఆర్ తాజా నిర్ణయం కారణం అవుతుందో లేదో ఇప్పుడే అర్థమయ్యేలా లేదు.
మొత్తానికి ‘రైతు’ అనే డిజిగ్నేషన్ ఉన్న వ్యక్తి ఎవడయినా సరే ఎలాంటి అవసరానికైనా సరే ప్రెవేటు వ్యక్తుల వద్ద అప్పుకు ప్రయత్నిస్తే నయాపైసా కూడా పుట్టే పరిస్థితి లేకుండాపోయే ప్రమాదం ఏర్పడుతోంది. నిజానికి రైతు సంక్షేమాన్ని లక్ష్యించే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌కు దారితీసే ప్రమాదం కూడా కనిపిస్తోంది. రైతు ఆత్మహత్యల గురించి గత మంగళవారం తెలంగాణ అసెంబ్లీలో విస్తృతస్థాయి చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉన్నదంటూ ఒకవైపు విపక్షాలకు చెందిన పలువురు సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కొందరు నిర్దిష్టమైన సూచనలు కూడా చేశారు.
సభలో కేవలం ఈ రైతు సమస్యల మీదనే చర్చ జరుగుతుంది. సాయంత్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సమస్యల పరిష్కారానికి, రైతు జీవితాల్లో భరోసా కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదో ఒక విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి విధానం గురించి తన సహచరులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించుకున్నారు. ఏం చేస్తే రైతులకు భరోసా ఇచ్చినట్లవుతుందనే విషయంలో అనేక అభిప్రాయాలను గురించి చర్చించుకున్నారు. ప్రధానంగా అప్పుల ఊబిలో కూరుకుపోవడమే వారిని ఆత్మహత్యలవైపు పురిగొల్పుతున్నందున ప్రెవేటు వడ్డీ వ్యాపారులను నియంత్రించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగ వార్తలు వచ్చాయి. ప్రెవేటు వడ్డీలను నియంత్రించేలా ఎలాంటి చట్టం ప్రభుత్వం తెచ్చినా సరే అసలు రైతులకు అప్పులే పుట్టకుండా పోయే దుస్థితి ఎదురవుతుంది.
ఇప్పటికే రకరకాల పేర్లు చెప్పి ఎప్పుడు మారటోరియం అంటారో, ఎప్పుడు ప్రెవేటు వడ్డీలు కూడా మాఫీ అంటారో అనే భయంతో చాలా మంది ప్రయివేటు వడ్డీ వ్యాపారులు రైతులకు మాత్రం ఇవ్వడం లేదు. దానికి తోడు ఇప్పుడు చట్టపరంగా ఒక నియంత్రణ వస్తే రైతు అనేవాడు ఎవడు అప్పకోసం వచ్చినా వారసలు తిరస్కరించే ప్రమాదం ఏర్పడుతుంది. నిజానికి ప్రెవేటు వడ్డీలే రైతుల్ని నాశనం చేసేస్తుంటాయి. అధిక మిత్తీలకు తెచ్చిన అప్పులే కబళించేస్తుంటాయి. వారిని నియంత్రించడం మంచిదే కానీ, రైతుల అవసరాలకు ఆదుకునే ఇతర ఆర్థిక వనరులను సృష్టించడం కూడా ప్రభుత్వ విధి. అలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని సజావుగా అమలుచేస్తే సర్కారు రైతుల సంక్షేమానికి పనిచేసినట్లవుతుంది.
మరోవైపు, కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంతపు సీనియర్ నాయకుడు, ఒక దశలో పార్టీలో సోనియాగాంధీ పెత్తనం గురించికూడా.. ప్రెస్‌మీట్ పెట్టి కడిగిపారేసిన ఘనుడు అయిన కాకా వెంకటస్వామి విగ్రహాన్ని నెక్లెస్‌రోడ్డులోని అంబేద్కర్ పార్కులో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదం అవుతోంది. కాకా కొడుకు, మాజీ ఎంపీ వివేక్ ప్రస్తుతం కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారు. ఆయన తెలంగాణ ప్రాధాన్యంతో పనిచేసే 6టీవీ న్యూస్ ఛానెల్ అధినేత కూడా! వివేక్‌ను ప్రసన్నంగా ఉంచడానికే కాకా విగ్రహాన్ని నెక్లెస్‌రోడ్డులో అత్యంత ప్రధానమైన స్థలంలో ఏర్పాటు చేయడానికి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా విమర్శలు ఉన్నాయి గానీ.. ఇప్పుడు ఆ నిర్ణయం కూడ వివాదాస్పదం అవుతోంది. అంబేద్కర్ పార్కులో కాకా విగ్రహం పెట్టడానికి వీల్లేదని పలు దళిత సంఘాలు గొడవ చేస్తున్నాయి.
ఎంపీ వివేక్ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూనే.. పదవికి రాజీనామా చేయకుండానే.. తెరాసలోకి జంప్ చేశారు. తెలంగాణ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తున్నందున తెరాసలోకి మారుతున్నట్లు ప్రకటించారు. తీరా కేంద్రంలోని కాంగ్రెసు నిర్ణయానికి వచ్చిన తర్వాత.. తిరిగి తెరాసనుంచి కాంగ్రెసులోకి వెళ్లిపోయారు. తదనంతర పరిణామాల్లో ఆయన కాంగ్రెసు అభ్యర్థిగానే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి, తెరాస చేతిలోనే ఓటమి పాలయ్యారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాత్రం వివేక్‌కు సత్సంబంధాలే ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే తన తండ్రి కాకా వెంకటస్వామి మరణించిన తరువాత.. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేయించడం గురించి.. ఆయన కేసీఆర్‌ను గతంలో కలిసారు. సీఎం ఏకంగా నెక్లెస్రోడ్డులోనే ఆయన తండ్రి విగ్రహంపెట్టించేయడం గురించి మాటిచ్చేశారు.
మరోవైపు వివేక్ తిరిగి తెరాసలోకి వస్తారని, వరంగల్ ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇలాంటి నేపథ్యంలో దళిత సంఘాలు కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం గమనార్హం. కాకా అంటే అతిగొప్ప దళితనేతగా తమకు గౌరవం ఉన్నది కానీ.. ఆయన విగ్రహం అంబేద్కర్ పార్కులో పెట్టడం మాత్రమే సరికాదని వారు వాదిస్తున్నారు. ఈ వివాదం ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. కాగా, ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు రాష్ట్ర ప్రథమ పౌరుడితో భేటీ కావడం అనేది వారి విధుల్లో భాగం లాంటిదే తప్ప ఏ రకంగానూ విశేషంగా చూడవలసిన అంశం కాదు. కాకపోతే, వారి భేటీ ఏకబిగిన నాలుగు గంటలపాటూ నిరంతరాయంగా కొనసాగడం అంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది. అంత సుదీర్ఘంగా ఎన్ని అంశాలను ఎంత లోతుగా చర్చించుకున్నారా అని అనిపిస్తుంది.
గత శుక్రవారం కూడా అదే జరిగింది. గురువారం తర్వాత రెండోరోజుకూడా సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్‌తో భేటీ కావడానికి ఉదయమే అపాయింట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో అనేక ఊహగానాలు సాగాయి. అయితే, వాటర్ గ్రిడ్ గురించి, వాటర్ పాలసీ గురించి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని తొలుత గవర్నరుకు వివరించడానికే కేసీఆర్ ఇంత సుదీర్ఘ సమయం భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పనిలో పనిగా ఈనెల 8, 9 తేదీల్లో తెలంగాణ శాసనసభ ఉభయ సభలను ఉమ్మడిగా సమావేశ పరచి వారికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెంగాణ ప్రభుత్వం తీసుకురాబోతున్న వాటర్ పాలసీ గురించి వివరించడం కోసం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. అయితే సభల ఉమ్మడి సమావేశం అంటే అందుకు గవర్నరు అనుమతి అవసరం గనుక అందుకోసం ఆయనతో భేటీ అయినట్లుగా సమాచారం.
తెలంగాణ రైతాంగాట నీటి ఇక్కట్ల గురించి ప్రభుత్వం పట్టించుకోనందునే ఆత్మహత్యలు జరుగుతున్నాయంటూ ఈ సభల చర్చల్లో ప్రభుత్వం మీద చాలా నిందలే వచ్చాయి. నిజానికి వాటర్ గ్రిడ్ రూపేణా చాలా నిర్దిష్టమైన ప్రణాళికతో నీటి ఎద్దడి నివారణకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్లుగా కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి సభ్యులు మళ్లీ మళ్లీ వివిధ సందేహాలకు లోను కాకుండా ఉండేందుకు ఉభయ సభలకు కలిపి వాటర్ పాలసీ గురించి ఒకేసారి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తానే వివరించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే గవర్నర్‌ను కూడా కలిశారు. సోమవారం తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ శాసనసభ మూడురోజుల చర్చల అనంతరం రెండు రోజుల ఉమ్మడి సమావేశం జరుగుతుందన్నమాట. సభ్యుంలందరికీ కేసీఆర్క్లాస్ తీసుకుంటారు.


