అన్నదానానికి రూ.1.50లక్షల వితరణ
విజయవాడ, అక్టోబర్ 12 (న్యూస్టైమ్): స్వయంభుగా వెలసిన శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన పథకానికి మోపిదేవి గ్రామానికి చెందిన రామబ్రహ్మం, అనసూయ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రూ.1.50లక్షలు అన్నదానం కోసం వితరణ ఇచ్చారు. దసరా సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ పరిరక్షకులు మధుసుదనరావుకు ఈ మొత్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దాతల కుటంబసభ్యులు,బంధుమిత్రులు పాల్గొన్నారు.
ఇదిలావుండగా, కైకలూరు మండలంలోని కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయంలో శ్రీచక్రార్చన, తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని పురపాలక శాఖ డీఈఈ బి.సూర్యనారాయణమూర్తి దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. వీరికి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ ఆధ్వర్యంలో చక్రార్చన, లలితాసహస్రనామార్చన, కుంకుమ పూజలు నిర్వహించారు. పలు గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.


