అభివృద్ధికీ అధికారం కావాలా?
ఆయన మాట ఏదో ఆశతో వచ్చినది కాదు.. ఆగ్రహంలోంచి వచ్చినది మాత్రమే. ఎందుకంటే ఓ చిన్నారి పాప కేవలం అధికార్ల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణ సరిగా లేని మురుగు కాల్వల పాలబడి కొన్ని రోజుల తర్వాత సముద్రంలో శవంగా కొట్టుకురావడం అంటే అలాంటి విషాదాంత సంఘటన మానవత్వం ఉన్న ఎవ్వరిలోనైనా సరే ఆగ్రహాన్నే రగిలిస్తుంది. అందుకే విశాఖపట్నానికి చెందిన భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా విశాఖ నగరంలో మురుగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థను సజావుగా నిర్వహించడంలో విఫలం అవుతున్న నగరాభివృద్ధి అధికారుల చేతకాని తనాన్ని దెప్పిపొడుస్తూ ఒక్క ఆరునెలలు అధికారం పగ్గాలు నా చేతిలో పెట్టి చూడండి నగరం మొత్తం డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దేస్తే అంటూ సవాలు విసరడం ఇక్కడ గమనార్హం. విశాఖలో ఇంటినుంచి ట్యూషన్‌కని బయల్దేరిని చిన్నారి అదితి కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇంటినుంచి బయటకు రావడంతోటే మురుగుకాల్వలో పడి కొట్టుకుపోయి ఉండవచ్చుననే అనుమానంతోనే పాపకోసం చాలా వరకు వెతికే ప్రయత్నం చేశారు. ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో ఎవరైనా పాపను తీసుకెళ్లి ఉంటారా?
అనే దిశగా కొన్ని అనుమానాలు దర్యాప్తులు సాగాయి. ఏది ఏమైనప్పటకీ చిన్నారి అదితి ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉంటే చాలునంటూ అందరూ కోరుకున్నారు. కాని విధి వక్రించింది. విశాఖలో కొట్టుకుపోయిన అదితి మృతదేహం కొన్ని రోజుల తర్వాత శుక్రవారం నాడు విజయనగరం జిల్లా పరిధిలోని సముద్ర తీరంలోంచి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దీంతో అదితి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. విశాఖ నగర అధికారులు డ్రైనేజీల నిర్వహణపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే భాజపా ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఆవేశంగా స్పందిస్తూ ఆరునెలలు నా చేతిలో నగరపాలన అధికారం పెట్టండి మొత్తం సెట్ చేసేస్తా అంటున్నారు.
అయినా చంద్రబాబునాయుడు విశాఖపట్టణాన్ని మరో హైదరాబాదు రేంజికి తీర్చిదిద్దేస్తా అంటూ ఉంటారు. అక్కడ కనీసం సాధారణ ప్రజల సాధారణ జీవనానికి కూడా భద్రత లేకుండపోయే పరిస్థితుల్ని చక్కదిద్దకపోతే ఎలాగ అని జనం ప్రశ్నిస్తున్నారు. అద్భుత నగరాలను సృష్టించడం అనేది తర్వాతి సంగతి ముందుగా ప్రాణాలు హరించకుండా ఉండే నగరజీవనాన్ని అందివ్వాలని కోరుతున్నారు. ఇదిలావుండగా, ఎంతైనా పవన్ కల్యాణ్ స్టయిలే వేరు. ఆయన ఎన్నాళ్లు బాహ్యప్రపంచానికి కనిపించకుండా తన షెల్‌లో తాను ఉండిపోయినప్పటికీ తాను అందరి గురించీ ఏదో ఒక మాట అనేయాలని అనిపించినప్పుడు హఠాత్తుగా ఒక ప్రెస్‌మీట్ పెడతాడు! అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తనకు కిట్టని వారందరి మీద ఎడాపెడా విమర్శలు మరియు సెటైర్లు వేసేస్తారు. అక్కడితో మళ్లీ తన షెల్‌లోకి వెళ్లిపోతారు.
ఆతర్వాత మళ్లీ ఆయనకు ఆవేశం ఎప్పుడు వస్తుందా? అని సామాన్యజనం ఎదురుచూస్తూ కూర్చోవాలంతే! అంతే తప్ప తన మీద మళ్లీ ఇతరులు విమర్శించినప్పుడు, సెటైర్లు వేసినప్పుడు ఆయన పట్టించకోరు, కనీసం స్పందించరు. తన మీద పెద్దపెద్ద విమర్శలు వస్తేనే పట్టించుకోరు ఇక చిన్న చిన్న విమర్శలు ఆయనకు చీమకుట్టినట్లుగా కూడా అనిపించకపోవచ్చునని తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ మాటలు విన్న వారికి అనిపిస్తోంది. తమిళనాడులో తెలుగు భాష బోధనను నిషేధించడం, దానికి సంబంధించి పవన్ కల్యాణ్ క్షణికోద్రేకానికి లోనైపోయి చెన్నైలో వచ్చి దీక్షకు కూర్చుని తన తడాఖా చూపిస్తా అని సవాళ్లు విసరడం గతంల జరిగింది. సదరు క్షణికోద్రేకం దిగగానే ఆయన సైలెంట్ అయిపోయారు.
తాజాగా భాగ్యనగరంలో తమిళ నాయుడు యువశక్తి వారు ఒక సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సహజంగానే తమిళనాడులో తెలుగుభాష బోధన మీద విధించిన నిషేధం గురించి ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈసభలో అతిథి అయిన సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మదరాసులో చేపడతానని ప్రకటించిన తెలుగు కోసం ఉద్యమం విషయంలో ఎందుకు వెనక్కు తగ్గారో అర్థం కావడం లేదని అన్నారు. పవన్‌కల్యాణ్ రోజులు గడవగానే ఆ ఊసెత్తడం మానేశారని అన్నారు. అయినా ప్రతి వారికోసమూ దీక్ష చేస్తా అని ఆర్భాటంగా ప్రకటించేయడమూ చివరికి ఆ దీక్ష చేయకుండానే దాని గురించి ప్రజలు మరచిపోయే వాతావరణం సృష్టించడమూ పవన్‌కు అలవాటే కదా అని పలువురు అంటున్నారు.
మరోవైపు, ఇన్నాళ్లూ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న పిల్లలు ఎందుకు ఆత్మహత్యలవైపు మొగ్గుచూపుతున్నారో అంత స్పష్టంగా తెలిసేది కాదు. గతంలో అంటే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం పల్లెటూర్లలో అయ్యవారు చీటికీ మాటికీ కొడతారనే భయంతో పిల్లలు బడికి పోమంటే పోమని మొండికేసేవారు. బడికి ఎగ్గొట్టి ఊరు బయట గడిపి సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేవారు. కానీ నలభై ఏళ్ల తర్వాత కూడా ఘనత వహించిన మన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు తమ విద్యార్థులకు ఇదే ట్రీట్మెంట్ ఇస్తున్నాయంటే నమ్మబుద్ధేయదు కాని. ఇది సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నంత నిజం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా శాఖలను కలిగిన వేల కొట్ల టర్నోవర్‌తో నడుస్తున్న నారాయణ విద్యాసంస్థల్లో గత కొద్ది రోజులుగా వరుస ఆత్మహత్యల పరంపర ఈ నిజాన్ని తేటతెల్లం చేస్తోంది.
నారాయణ కాలేజీలో హోం వర్క్ చేయకపోతే సంబంధిత లెక్చరర్లు ఆ పిల్లలను ఏమైనా చేయవచ్చనే అధికారాన్ని యాజమాన్యం బదలాయించింది. ఇంకేముంది. హోంవర్క్‌లో భాగంగా ఇచ్చిన ప్రశ్నలకు అడిగినప్పుడు సమాధానాలు చెప్పకపోతే అలాంటివారికి చుక్కలు కాదు కానీ నరకం చూపిస్తున్నారు. ఇచ్చిన పని చేయకపోతే, అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే చావగొడతామని ముందుగానే పిల్లల్ని హెచ్చరిస్తుండటంతో ఆ విద్యార్థులు చదువు భయంతో, టీచర్ల భయంతో అనారోగ్యం పాలుకావటం పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లమంటూ మొరాయించడం, తల్లిదండ్రులు నచ్చచెప్పి తిరిగి కాలేజీల్లో వదిలిపెడితే ఇక తమకు వేరే మార్గం లేదని కొందరు అక్కడికక్కడే ఆత్మహత్యల బాట పట్టడం. ఐఐటీలు వంటి ప్రముఖ విద్యా సంస్థల్లో ఒత్తిడి భరించ లేక నవ యువతీయువకులు ఆత్మహత్యల బాట పట్టడం వార్తల్లో వచ్చేవి.
కానీ ఇప్పుడు తెలుగు సమాజంలో ముక్కపచ్చలారని పసిపిల్లలు ఆత్మహత్యలు ఎలా చేసుకోవాలో సమాజానికి చూపించి మరీ కనుమరుగవుతుండటం విషాదాల్లో కెల్లా విషాదం. ఒక స్కూలు లేదా కాలేజీ పెడితే చాలు దాంట్లో చేరే పిల్లల జీవితాలతో ఆడుకునే రకం పరిస్థితులను మన దేశంలో తప్ప మరే దేశంలో అయినా చూడగలమా జీవితాలు పూర్తిగా ప్రైవేట్ మయం కాక తప్పని రోజుల్లో మరణాలు, ఆత్మహత్యలు కూడా ప్రయివేటీకరించబడుతున్నాయా?


