అమరావతి పనులు పరుగులు
- 81 Views
- wadminw
- January 8, 2017
- Home Slider రాష్ట్రీయం
విజయవాడ, అక్టోబర్ 26 (న్యూస్‌టైమ్): అమరావతి నగర నిర్మాణ పనులను నవంబర్ ఒకటో తేదీ నుంచి పరుగులు పెట్టించాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఈనెల 28వ తేదీన కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పరిపాలనా నగరానికి శంకుస్థాపన చేస్తున్నందున ఇక నిర్మాణ పనులు జాప్యం లేకుండా కొనసాగించాలని సూచించారు. ‘టార్గెట్ 2018’ అనే నినాదంతో పరిపాలన నగరం, ఇతర మౌలిక సదుపాయాల పనులను ఆరంభించి వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయంలో సీఆర్డీఏ అధికారులతో చంద్రబాబు బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకాశం బ్యారేజీ ఇవతలి ఇంద్రకీలాద్రి కొండపై దుర్గమ్మ కొలువై ఉన్నందున, అవతలి వైపు ఉన్న సీతానగరం కొండపై భారీ బుద్ధుడి విగ్రహం ఏర్పాటుచేసే ఆలోచన ఉందని సీఎం తెలిపారు. అమరావతిలో ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియాలని, టీటీడీ వెంకటేశ్వర ఆలయం, ఇస్కాన్ కృష్ణుడి మందిరంతో పాటు మసీదు, చర్చిల నిర్మాణం చేపట్టాలన్నారు. అమరావతిలో పది ఎకరాల విస్తీర్ణంలో హస్తకళల గ్రామం ఏర్పాటుకు కొంతమంది మహిళలు ముందుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో చేతివృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న అందరినీ భాగస్వామ్యుల్ని చేస్తూ గొప్ప ఆకర్షణీయ పర్యాటక ప్రాంతంగా హస్తకళల గ్రామాన్ని నిర్మించాలన్నారు. రాజధానిలో నిర్మించే భవనాలు, కట్టడాలకు ఏకరూపత ఉండాలని, వాటి నిర్మాణ శైలి, ఆకృతుల్లో ఆంధ్రప్రదేశ్ కళలు, బౌద్ధ సంస్కృతులు ప్రతిబింబించాలని చంద్రబాబు సూచించారు. కాగా, అమరావతిలో అత్యాధునిక భూగర్భ విద్యుత్తు సరఫరా వ్యవస్థపై ప్రభుత్వం చేతులెత్తేసింది. అందుకు రూ.1,500 కోట్లు కేటాయించలేమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పేశారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించమని ట్రాన్స్‌కోకు సూచించారు. ఇప్పట్లో రాజధానికి డెవలపర్లు వచ్చే అవకాశాలు లేవని కూడా ఆయన వ్యాఖ్యానించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అమరావతి కోసం ప్రభుత్వం సమీకరించిన 33 వేల ఎకరాల మీదుగా ఎనిమిది ట్రాన్స్‌కో హెచ్‌టీ విద్యుత్తు లైన్లు వెళ్తున్నాయి. రాజధాని నిర్మాణానికి అనుకూలంగా ఆ లైన్లను తొలగించి డెవలపర్లకు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. అందుకు అత్యాధునిక రీతిలో భూగర్భ విద్యుత్తు కేబుల్ వ్యవస్థను ఏర్పాటుకు సీఎం ఆమోదించడంతో ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయడానికి ట్రాన్స్‌కో ప్రాథమిక సన్నాహాల్లో నిమగ్నమైంది. కానీ ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ట్రాన్స్‌కోకు సీఎం షాక్ ఇచ్చారు. భూగర్భ విద్యుత్తు వ్యవస్థ కోసం రూ.1,500కోట్లు ప్రభుత్వం కేటాయించలేదని తేల్చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలతో ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు షాక్ తిన్నారు. భూగర్భ విద్యుత్తు పనులు పూర్తికావడానికి రెండేళ్లు పడుతుంది. అంటే అప్పటికి రాజధాని డెవలపర్ల ఎంపిక పూర్తి చేసి పనులు ప్రారంభించే అవకాశాలు లేవని స్పష్టమైంది. రైతుల నుంచి సమీకరించిన 33 వేల ఎకరాల్లో రూ.5,500 కోట్లతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి రాజధాని నిర్మాణం కోసం డెవలపర్లకు ఇస్తామన్నది ప్రభుత్వ విధానం. ప్రస్తుతం భూగర్భ విద్యుత్తు వ్యవస్థకు రూ.1,500 కోట్లే కేటాయించలేమని ప్రభుత్వం చెబుతోంది. ఆ లెక్కన మౌలిక సదుపాయాలకు రూ.5,500 కోట్లు కేటాయించడం కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది. మరోవైపు, సిమెంట్ ధరల నియంత్రణపై ఏపీ కేబినెట్ సబ్‌కమిటీ సమావేశం అయింది. ఈ భేటీలో మంత్రులు యనమల రామకృష్ణుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, డాక్టర్ కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ కంపెనీల యాజమాన్యంతో చర్చలు జరుపుతామన్నారు. పెరిగిన సిమెంట్ ధరలను వెంటనే తగ్గించాలని మంత్రి యనమల అన్నారు.


