అమర జవానులకు నివాళిగా కొవ్వొత్తులతో ర్యాలీ
ఒంగోలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): ఉరి ఘటనలో అశువులు బాసిన భారత వీరకిషోరాల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తు పట్టణంలోని ఓంసాయి వికాస్ విద్యానికేతన్ విద్యార్ధులు బుధవారం సాయంత్రం పట్టణ వీధులలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక పేరం బజారులోని పాఠశాల ప్రాంగణం నుండి చిన్నారులు చేతుల్లో కొవ్వొత్తులను పట్టుకుని అమరజవాన్లకు నివాళులర్పిస్తూ, నెహ్రూబజారు, కంభం రోడ్డుల మీదుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పానుగంటి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిద్రపోతున్న మన సైనికులపై పొరుగుదేశమైన పాకిస్తాన్ సైనికులు దొంగదాడి చేసి 18 మందిని హతమార్చడం సిగ్గుచేటన్నారు. ఎదురెదురుగా నిలబడి పోరాడే ధైర్యంలేని పిరికిపందలుగా పాకిస్తాన్ సైనికులను పోలుస్తూ, మనదేశ సైనికులు ఎదురొడ్డి నలుగురు ఉగ్రవాదులను హతమార్చడం, మరునాడు 10 మంది ఉగ్రవాదులను కాల్చిచంపడం హర్షించదగ్గ పరిణామమన్నారు. మనదేశం స్నేహ హస్తం ఇస్తుంటే, పాకిస్తాన్ రక్తపాతాన్ని కోరుకుంటుందని తెలిపారు. విద్యార్ధులు దేశభక్తిని ప్రదర్శిస్తూ, మనదేశ వీరకిషోరాలకు అండగా, ఈ శాంతి ప్రదర్శన నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మనదేశ సరిహద్దుల వెంట కాపలాగా ఉండి మనకు రక్షణ కల్పిస్తున్న మన సైనికులకు ఎల్లప్పుడు అండగా ఉండాలని ఆయన ఈసందర్భంగా విద్యార్ధులకు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధిని, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అంగన్వాడీ కేంద్రాలకు టీవీల బహుకరణ
ఒంగోలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): అంగన్వాడీ కేంద్రాలను పఠిష్టం చేయడం ద్వారా చిన్నారులకు ఆట,పాటలతో కూడిన విద్యను అందించడం, పౌష్టికాహారం ఇవ్వడం ద్వారా ఆరోగ్యకరమైన భారత్‌ని నిర్మించడం కోసం అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలు సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సుజాత శర్మ ఆదేశానుసారం, దాతల సహకారంతో ఆయా అంగన్వాడీ కేంద్రాల్లో మౌళిక వసతుల కల్పన, ఆటవస్తువులు, ఏకరూపదుస్తుల సేకరణ కార్యక్రమాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. మార్కాపురం అర్బన్ ఐసిడియస్ పరిధిలోని కేంద్రాలు నం. 43, 44 లకు మార్కాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రియల్ఎస్టేట్ వ్యాపారి మేడం సత్యనారాయణ, అగ్ని పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ కాళంరాజు రామకృష్టలు టివిలను బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో మౌళిక వసతుల కల్పన ద్వారా, ఆటవస్తువులను సమకూర్చడం ద్వారా చిన్నారులను కేంద్రాలకు సులువుగా రప్పించవచ్చన్నారు. చిన్న నాటి నుండి ఆట,పాటలతో కూడిన విద్య ద్వారా భవిష్యత్‌లో వారు మంచి ఆలోచనలతో ఎదగగలరన్నారు. అనంతరం కార్యకర్తలు పద్మావతి, వెంకట రత్నంలు దాతలకు అభినందనలు తెలిపారు.
అరడుగు లోతు గుంతతో వాహన చోదకులకు ఇక్కట్లు!
ఒంగోలు, సెప్టెంబర్ 21 (న్యూస్‌టైమ్): మార్కాపురం ఆర్టీసి బస్టాండులో ప్రయాణీకుల సమస్యలు కాసేపు పక్కన పెడితే, ఆర్టీసి డ్రైవర్ల కష్టాలు అన్నీ, ఇన్నీ కావనేది అర్దమవుతుంది. త్రాగేందుకు నీరు లేక బాత్రూమ్లొ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలొ నిర్మించిన సిమెంట్ ప్లాట్ ఫామ్ ప్రక్కనే అరడుగు మేర గుంత పడడంతో డ్రైవర్లు తెగ ఇబ్బందులు పడవలసి వస్తుంది. ఒంగోలు,హైదరాబాదు వెళ్ళె బస్సులు వేచివుండే ప్రదేశం ఈ గుంతకు పక్కగా ఉండటం గమనించాల్సిన విషయం. బస్సును ప్లాట్‌ఫాం మీదకు తీసుకు వచ్చే క్రమంలో ఏదో ఒక టైరు ఈగుంతలో పడి బస్సు గుల్ల అవుతుందని డ్రైవర్లు వాపోతున్నారు. గుంతను పూడ్చివేస్తే, చాలా ఇబ్బందులు తొలగుతాయని, ఇటీవల కురిసిన వర్షాలకు ఈ గుంత ఏర్పడిందని స్థానిక ఆర్టీసి అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆర్టీసి డియం ఈ చిన్న సమస్యను పరిష్కరిస్తే, చాల బస్సులకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని ప్రయాణీకులు పేర్కొంటున్నారు. ఏమైనా నిద్రమత్తులో ఉన్న డ్రైవర్లు పొరపాటున ఈ గుంతలోకి టైరును దించితే ప్రాణాలకు ప్రమాదం లేకపోయినా, మూతి,ముక్కు ఏకం కావడం మాత్రం ఖాయం.


