‘అమ్మ’ ఆరోగ్యం మరింత మెరుగు
అభిమానులు ముద్దుగా ‘అమ్మ’ అని పిలుచుకునే తమిళనాడు రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోంది. ఆమెను ఆరాధించే వారికి ఈ కబురు శుభవార్తే. అసలు ఆమెకు వచ్చిన కష్టమేమిటో స్పష్టంగా తెలియరానప్పటికీ వెంటిలేటర్‌పై జయ ఊపిరి నడిచిందన్న వార్తలు మాత్రం తమిళనాడునే కాక, యావత్ దేశంలోని ఆమె అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గడచిన పదమూడు రోజులుగా ఆమెకు అతి సున్నితమైన వైద్య చికిత్సలు అపోలో ఆసుపత్రిలో అందిస్తున్నారు.
అధిక డోసేజ్ కలిగిన, తీవ్ర ప్రభావం చూపించే కొన్ని రకాల యాంటీబయోటిక్స్ కూడా చికిత్స సందర్భంగా వైద్యులు ఆమెకు ఇచ్చినట్లు సమాచారం. సీఎం ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే విధంగా, స్పష్టమైన సమాచారం ప్రజ లకు తెలియజేయాలని తమిళనాడు హైకోర్టు సైతం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సీఎం జయలలితకు అపోలో వర్గాలు తీవ్ర చికిత్సలు అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్లోను వైద్య వర్గాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. అయితే, అమ్మ ఆరోగ్యంపై వదంతుల పుకార్లు షికార్లు చేస్తుండడంతో వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది.
సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు సుందరేషన్, మహాదేవన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. సీఎం ఆరోగ్యంపై సోషల్ మీడియాల్లో సాగుతున్న పుకార్లు, ప్రజల్లో నెలకొన్న ఆందోళన గురించి పిటిషన్లో పేర్కొన్న అంశాలను బెంచ్ పరిగణలోకి తీసుకుంది. హెల్త్ బులిటెన్లు వెలువడుతున్నా, ప్రభుత్వం తరపున అధికార ప్రకటన, కనీసం ఫొటోలను కూడా విడుదల చేయడం లేదంటూ ప్రతి పక్షాలు చేస్తున్న డిమాండ్లను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అలాగే, సీఎం ఆరోగ్యం గురించి ఏదేని మాట్లాడితే చాలు, అది పుకార్లుగా మారుతున్నాయని, పోలీసులు కేసుల మోత మోగిస్తున్నారని తన పిటిషన్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. వాదనల సమయంలో ట్రాఫిక్ రామస్వామి బెంచ్ ముందు కొన్ని వ్యాఖ్యల్ని సంధించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, అన్ని సమాచారాల్ని తెలుసుకునేందుకు తగ్గ హక్కులు ఉన్నాయని, అలాంటప్పుడు ప్రజలకు సీఎం ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని వివరించారు. ఈ వ్యాఖ్యలతో ఏకీభవించిన బెంచ్ పిటిషనర్ విజ్ఞప్తి మేరకు గురువారం లోపు సీఎం ఆరోగ్యంపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని న్యాయమూర్తులు ఆదేశాలు ఇచ్చారు.
ఇక, బుధవారం కూడా అన్నాడీఎంకే వర్గాలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. తమ అమ్మ ఆరోగ్యం మెరుగు పడాలని పూజలు నిర్వహించారు. ఆపార్టీ అధికార ప్రతినిధులు వలర్మతి, సీఆర్ సరస్వతిలతో కూడిన అన్నాడీఎంకే మహిళా బృందం స్థానికంగా ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ సంపూర్ణ ఆరోగ్యమంతురాలు కావాలని కాంక్షిస్తూ, ఆలయం నేలపై అన్నం పోసి(మన్‌సోరు), పూజల అనంతరం దానిని తిన్నారు. మరోవైపు, అమ్మ ఆరోగ్యంపై సాయంత్రం అపోలో వర్గాలు తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. అందులో సీఎంకు వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయని, ఆమె ఆరోగ్యం మెరుగు పడుతున్నదని వివరించాయి.
ప్రస్తుతం అందిస్తున్న చికిత్సలను కొనసాగిస్తూ, పూర్తి స్థాయి పర్యవేక్షణ సాగుతున్నట్టు పేర్కొన్నాయి. అమ్మ ఆరోగ్యంపై ఇప్పుడు తమిళనాడులో ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. కొందరు ఆమె కోలుకుంటున్నారని చెబుతుంటే మరి కొందరు ఆమె వెంటిలెటర్‌పై వైద్యం అందిస్తున్నారని, మరి కొందరు ఆమె మరికొన్ని రోజులు విశ్రాంతిగా ఉండాల్సి ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా వస్తున్న వదంతుల్లో ఏమాత్రం నిజం లేదని, ఆమ్మ ఆరోగ్యం స్పష్టతనివ్వాలిన ఆమె అభిమానులు చెన్నై ఆపోలో ఆస్పత్రి వద్ద ఎదురుచూస్తున్నారు.
ఆమె కోలుకోవాలని దైవ పార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అమ్మ జయలలిత ఆరోగ్యంపై మళ్లి వదంతులు రావడంతో కలకలం రేపుతోంది. అమ్మ’ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఊహాగానాలు వస్తుండటంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణులు ఆందోళన బాట పట్టారు. మొత్తానికి తమిళనాడులో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జయలలిత ఆరోగ్యంపై వస్తున్న వదంతుల నేపథ్యంలో ముంబైలో ఉన్న తమిళనాడు ఇన్ఛార్జీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పరామర్శించారు. ఆయనతో పాటు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఉన్నారు. వారు పరామర్శించిన అనంతరం జయలలిత క్యాబినెట్ సహచరులంతా అపోలోకు క్యూకట్టారు.
ఇప్పటికే జయలలితకు చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను తీసుకొచ్చి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. వారం రోజులుగా ఆస్పత్రిలో ఉన్న జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులు ఎలాంటి ప్రకటన చేయకపోవడం తమిళనాడులో ఉత్కంఠ రేపుతోంది. జయ ఆరోగ్యంపై రాజ్‌భవన్ నుంచి ప్రకటన లేదా ఆస్పత్రి నుంచి బులిటెన్ వెలువడే అవకాశముందని విశ్వసనీయంగా తెలుస్తోంది. జయ ఆరోగ్య పరిస్థితిపై తాజా ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో చెన్నై అపోలో ఆస్పత్రికి తమిళనాడు మంత్రులు, అన్నాడీఎంకే నేతలు, శ్రేణులు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నారు. కాగా, ఒకవైపు అమ్మ ఆరోగ్యం ఆందోళన, మరోవైపు పార్టీ శ్రేణుల తర్జన భర్జన, ఇంకోవైపు అభిమానుల హడావుడి ఇలా తమిళనాట ఉత్కంఠ వాతావరణం అలుముకున్నాయి.
జయలలిత గత పక్షం రోజుల క్రితం తీవ్ర జ్వరం, డిహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రి లో అడ్మీట్ అయ్యారు. అయితే నాటి నుంచి ఆస్పత్రి వర్గాలు అమ్మ ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో వివరించకపోవడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కొంత మంది గుండె పోటుతో చనిపోయారన్న వార్తలు వస్తున్నాయి. మరి కొంత మంది బలవన్మరణానికి పాలుపడ్డారని తెలుస్తోంది. అయితే రాజకీయ నాయకుల కోసం బలవన్మరణానికి పాలుపడటం ఈ నాటిది కాదు. తమ నాయకుడి కోసం అవసరమైతే ప్రాణ త్యాగాలకు వెనుకాడబోమంటూ కార్యకర్తలు, అభిమానులు వీరావేశంతో ప్రకటనలు చేస్తుంటారు.
కొంతమందైతే ఏకంగా తమ రాజకీయ నాయకులు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దమేనంటూ ముందుకు వస్తుంటారు. ఈ తంతూ గమనిస్తే తెలుగు రాష్ట్రంలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన అనంతరం చాలా మంది గుండె పోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇందులో కొంత మంది బలవన్మరణానికి కూడా పాలుపడ్డారు లెండీ. అయితే ఇక తమిళనాడులో అమ్మ అంటే అమితంగా ప్రేమించే వారు చాలా ఎక్కువే. ఇప్పటికే ఆమెను దేవతగా పూజించే వారు కూడా ఉన్నారు.
ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే? తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పక్షం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి విదితమే. అయితే ఆమె కోలుకోవాలని అభిమానులు నోట్లో శూలాలు గుచ్చుకుంటున్నారు. వీపుకి హుక్స్ గుచ్చుకుని గాల్లో తేలాడుతున్నారు. ఆమ్మ ఆరోగ్యంపై వినరాని మాట వింటే పరిస్థితేంటి అంటూ కొందరు మంచాన పడ్డారట! ఇప్పటికే కొందరు అమ్మ అనారోగ్యం వార్త విని, గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయారట. ఒకరిద్దరు బలవన్మరణాలకు పాలు పడినట్టు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అమ్మకి ఏమైయ్యిందోనని అన్న విషయం గోప్యంగా ఉంచడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.
మరోవైపు జయలలిత ఆరోగ్య పరిస్థితులను గురించి వాస్తవాలను తెలపాలని చెన్నైకి చెందిన న్యాయవాది ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్ వేశారు. జ్వరం, డీహైడ్రేషన్ సమస్యలతోనే జయలలిత ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు ఆ సమయంలో ప్రకటించినా గడచిన పక్షం రోజులుగా ఆమె ప్రజల ముందుకు రాకపోవడంతో తమిళనాడులో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి ముందు, ప్రార్థనాలయాల్లో సర్వమత ప్రార్థనలు జరుపుతున్నారు. ఆసుపత్రిలో ఆమె కోలుకుంటున్నారని, మరికొన్ని రోజుల్లో ఇంటికి వెళతారని అన్నాడీఎంకే వర్గాలు ఈరోజు కూడా ప్రకటించారు.
చికిత్సకు జయలలిత స్పందిస్తున్నట్లు తాజాగా ఆసుపత్రి వైద్యుల నుంచి మరో ప్రకటన వెల్లడయ్యింది. ఇంత వరకు భాగానే ఉన్నా ఆసుపత్రిలో అమ్మ పరిస్థితి ఎలా వుందన్నదానిపై ఒక్క ఫొటో కూడా విడుదల చేయడంలేదంటే, తీవ్రమైన అనారోగ్యంతోనే ఆమె బాధపడుతున్నారనీ, ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా వుందనీ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లోకి సంకేతాలు వెళ్ళాయి. దాంతోనే ఈ విపరీత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. జయలలిత ఆరోగ్యంపై క్రియేట్ అవుతున్న సస్పెన్స్ కూడా అభిమానుల మరణాలు, బలవన్మరణాలకు కారణంగా చెప్పుకోవచ్చు.ఇలాంటి సందర్భాల్లోనే సంయమనం అవసరం.
కానీ, ఆ సంయమనమే వుంటే అది రాజకీయం ఎందుకవుతుంది? పరిస్థితి ఏదైనప్పటికీ అబద్దం చెప్పి, నిజాన్ని దాయడం వల్ల వచ్చే మేలుకంటే కూడా నష్టమే ఎక్కువని గత పరిణామాలు, సందర్భాలూ రుజువుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యంచేసుకుందని కాదు గానీ, ప్రభుత్వం నుంచి ఫొటో రుజువులతో కూడిన అధికారిక ప్రకటన విడుదల చేయడంలో తప్పేమీ లేదన్నది గ్రహించాలి. ఆమెను అంతగా ఆరాధిస్తున్న అభిమానులతో ఆమె తాజా పరిస్థితిని పంచుకోవడం ఆందోళనకర పరిస్థితులను కొంత వరకైనా కట్టడి చేస్తాయనడంలో సందేహం లేదు.


