అవకాశాల కోసం ఎదురుచూపు!
గుర్తుండే ఉంటుంది. గత ఏడాది ప్రారంభంలో అనుకుంటా… దక్షిణాది చిత్రసీమలో నెగెటివ్ ప్రచారాన్ని సొంతం చేసుకున్న మధురిమి మళ్లీ తన ఉనికిని ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా టాలీవుడ్లో చాటుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. పోయినచోటే వెతుక్కోవాలన్న సూక్తిని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో గానీ, మధురిమ అవకాశాలు వస్తే ఎలాంటి పాత్రలో నటించడానికైనా రెడీ అంటోంది. చిత్ర ప్రచారానికి రావడం లేదని దర్శకుడు నటి మధురిమపై ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. వినయ్, మధురిమ జంటగా కోలీవుడ్‌లో నటించిన చిత్రం సేందిపోలామా. అనిల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శశినంబీశన్ నిర్మించారు.
చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని గత మార్చి 6న విడుదల అయిన ఆ చిత్రం ప్రమోషన్‌కు హీరో వినయ్, హీరోయిన్ మధురిమ సహకరించడం లేదని దర్శకుడు అనిల్‌కుమార్ అప్పట్లో వాపోయారు. సేందిపోలామా షూటింగ్ మొత్తం న్యూజిలాండ్‌లో నిర్వహించి భారీగానే ఖర్చుచేసినట్లు సమాచారం. 20ఏళ్ల తరువాత కలుసుకున్న స్నేహితులు న్యూజిలాండ్ నుంచి సౌత్ ఐర్లాండ్ వెళుతుండగా ఒక హత్య జరుగుతుంది. ఆ తరువాత జరిగే ఆసక్తికరమైన సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని నిర్మించారు.
సినిమా నిలబడాలంటే ప్రమోషన్ చాలా కీలకం. అలాంటిది ఏకంగా హీరో హీరోయిన్లే సహకరించడం లేదని దర్శక, నిర్మాతలు వాపోవడం వింతే అయినా, ఆ పరిణామాల తర్వాత మధురిమకు కోలీవుడ్ సహా టీలీవుడ్లోనూ అవకాశాలు సన్నగిల్లాయని చెబుతారు విశ్లేషకులు. ఈ విషయాన్ని ఈ అమ్మడు కూడా అంగీకరిస్తోందనుకోండి.


