అవినాశ్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా ?
- 35 Views
- admin
- May 23, 2023
- తాజా వార్తలు
గుండెపోటుకు గురైన తల్లికి చికిత్స అందిస్తుంటే ఎంపీ అవినాశ్ విచారణ నుంచి వెసులుబాటు కోరారని, దానిపై రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అవినాశ్ తల్లిని హైదరాబాద్ తరలిస్తుంటే, మార్గమధ్యంలో మంచి ఆసుపత్రి ఉండడంతో అత్యవసర వైద్యం కోసం కర్నూలు విశ్వభారతి ఆసుపత్రికి తరలించారని పేర్ని నాని వివరించారు. ఇదేమైనా తప్పా అని ప్రశ్నించారు.
‘‘అవినాశ్ రెడ్డి ఎక్కడికైనా పారిపోయాడా… లేదే! కేసుల్లో చంద్రబాబు ఎందుకు బెయిల్ తెచ్చుకుంటున్నాడు? టీవీల్లో డిబేట్లు పెట్టేవాళ్లు, ఎండా కాలంలోనూ కోట్లు వేసుకుని తిరిగేవాళ్లు ఎందుకు కేసుల్లో బెయిల్ తెచ్చుకుంటున్నారు? చంద్రబాబు ఎన్ని కేసుల్లోనైనా బెయిల్ తెచ్చుకోవచ్చా? ఏనాడైనా చంద్రబాబు విచారణ ఎదుర్కొన్నాడా? నిజాయతీని నిరూపించుకున్నాడా ? చంద్రబాబు అన్నం తిని బతకడం కంటే బెయిల్ మీద బతకడమే ఎక్కువగా ఉంది’’ అని విమర్శించారు. ఇప్పటికే అవినాశ్ రెడ్డి పలుమార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారని, అరెస్ట్ భయం ఉంటే హాజరయ్యేవారేనా? అని పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో దారుణమైన కట్టుకథలు రాస్తున్నారని, హెలికాప్టర్ లో కేంద్ర బలగాలు దిగుతున్నాయని రాశారని విమర్శించారు. నాడు చంద్రబాబు… మోదీతో గొడవపెట్టుకుంటే సీబీఐ రాష్ట్రంలోకి అడుగుపెట్టకూడదని హుకుం జారీ చేశారని, నేడు అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు.


