అవినీతిపై పోరాటం ఆగదు: ప్రధాని మోదీ
- 105 Views
- January 2, 2017
- Home Slider జాతీయం
లఖ్నవూ: ఈ ఏడాది యూపీ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రంలోని రౌడీ రాజ్యాన్ని పారద్రోలుతామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం లఖ్నవూలో నిర్వహించిన భాజపా పరివర్తన్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.
యూపీలో 14ఏళ్ల భాజపా వనవాసం ముగిసిందని అంటున్నారని, కానీ ఆ సమయంలో యూపీలో అభివృద్ధి వనవాసానికి వెళ్లిందని మోదీ అన్నారు. దేశంలో అభివృద్ధి తేవాలంటే తొలుత ఉత్తర్ప్రదేశ్ను అభివృద్ధి చేయాల్సిందేనన్నారు. లఖ్నవూ మాజీ ప్రధాని వాజ్పేయీ కర్మభూమి అని, ఉత్తర్ప్రదేశ్ అభివృద్ధికి ఆయనెంతో కృషిచేశారని కొనియాడారు.
రాజకీయాలు పార్టీల వరకే పరిమితం కావాలి తప్ప ప్రజలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. యూపీలో పాలకులకు అభివృద్ధి ప్రాధాన్య అంశం కాలేదని ఆరోపించారు. దేశంలో అవినీతి, నల్లధనంపై పోరాటం ఎప్పుడూ ఆగదని మోదీ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎస్పీ, బీఎస్పీ ఎప్పుడైనా కలిశాయా? అని ప్రశ్నించారు.
ఇన్నేళ్ల తర్వాత తనకు వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీ ఒక్కటయ్యాయన్నారు. నల్లధనం అవినీతి నిర్మూలనకు తాను పనిచేస్తున్నట్టు చెప్పారు. తమది పేదల కోసం పనిచేసే ప్రభుత్వమని, ఉత్తర్ప్రదేశ్ అభివృద్ధి కోసం తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు.
ఇంత ప్రజాసందోహాన్ని ఎన్నడూ చూడలేదు సభకు హాజరైన ప్రజల్ని చూసి మోదీ ఆశ్చర్యపోయారు. 2014లో తాను నిర్వహించిన ప్రచారం సందర్భంగా కూడా ఇంత మంది రాలేదన్నారు. ఉదయం నుంచే భారీగా జనం వస్తున్నారని ఫొటోలు చూపిస్తే.. తానే ఆలస్యంగా వస్తున్నానేమోనని అనుమానం వచ్చిందన్నారు.
ఇంత మంది ప్రజలను చూశాక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పటం కష్టంకాదన్నారు. ఇక భాజపా 14ఏళ్ల నిరీక్షణ ముగిసినట్లేనని ప్రకటించారు. భాజపాకు ఒక్క అవకాశం ఇచ్చి పరిస్థితులు ఏ విధంగా మారాయో చూడాలని ఆయన కోరారు.


