అసమర్ధపాలన అంతమొదిస్తాం: వైకాపా నేత మర్రి
- 82 Views
- wadminw
- December 15, 2016
- తాజా వార్తలు
గుంటూరు, డిసెంబర్ 14 (న్యూస్‌టైమ్): పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న అసమర్ధ తెదేపా ప్రభుత్వాన్ని గద్దెదించే సమయం ఆసన్నమైందని వైకాపా జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణంలో ఆవుల సత్రంలో ఏర్పాటు చేసిన వైకాపా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజధాని నిర్మాణం పేరుతో ప్రజల దృష్టిని మరల్చి అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేస్తుందన్నారు. రాజకీయంగా ఎంతో పేరున్న కాసు కుటుంబం నుంచి మహేష్‌రెడ్డి వైకాపాలో చేరడంతో పల్నాడులో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ఈ నెల 16న నరసరావుపేటలో పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి పర్యటనను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలన్నారు.
వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ సత్తెనపల్లి నియోజకవర్గంలో అవినీతి, అరాచక పాలన నడుస్తుందన్నారు. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చలు ఇక్కడే జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదన్నారు. వైకాపాతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యామని మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు మహేష్‌రెడ్డి చెప్పారు. మాజీ శాసనసభ్యులు జంగ కృష్ణమూర్తి, పార్టీ నాయకులు వరప్రసాదరెడ్డి, దేవదాసు, తదితరులు పాల్గొన్నారు.


