ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే లక్ష్యంగా…
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న అప్పటి కేంద్ర ప్రభుత్వం చట్టంలో స్పష్టంగా ఆ అంశాన్ని పొందుపర్చకపోవడం వల్లో లేక తర్వాత వచ్చిన ప్రభుత్వం దానిపై పెద్దాగా శ్రద్ధపెట్టకపోవడం వల్లో తెలియదు కానీ, హోదా అంశం మాత్రం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. శక్తిమంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి భారత ప్రభుత్వం ఒకపక్క చర్యలు చేపడుతూనే ప్రతిపక్షాలపై ప్రతిదాడికి సిద్ధపడింది.
విపక్షాలు ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందనడంలో అర్ధంలేదని తాజా గణాంకాలు రుసువుచేస్తుననాయి.
ఇష్టారాజ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించిన యూపీఏ కంటే ప్రస్తుత ఎన్డీయే మెరుగైన కేటాయింపుల ద్వారానే రాష్ట్రాన్ని ఆదుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయంగా విపక్షాలు అధికార పక్షాన్ని ఇబ్బందులకు గురిచేయడం ద్వారా ప్రజల్లో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నించడం సహజమే అయినప్పటికీ రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పవన్ కల్యాణ్ లాంటి సామాజిక చైతన్యకారులు కూడా ఆ పక్కదారిపట్టించే ప్రచారాన్ని నమ్మి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డం ఒక విధంగా ప్రజలకు నష్టమే కలిగిస్తుందన్నది గ్రహించాలి. శక్తిమంతమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించాలనే ధృఢ నిశ్చయంతోనే భారత ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగానే చూస్తున్నది.
కొత్త ప్రాజెక్టులకు, ఇప్పటికే వివిధ దశలో కొనసాగుతున్న వాటికి అవసరమైన అని రకాల సహాయం కూడా చేయడం జరుగుతోంది.
పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూలులో పదేళ్ల గడువులోగా ఇవ్వవచ్చునని చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాసంస్థలను, పదుల సంఖ్యంలో ఇన్ఫ్రా ప్రాజెక్టులను ఇవ్వడం జరిగింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసులు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కల్పించి ప్రత్యేక హోదాను ఇచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వపు చేతులు కట్టేసిన పరిస్థితిని కల్పించాయి. ప్రత్యేక, సాధారణ కేటగిరీకి చెందిన రాష్ట్రాల మధ్య ఎలాంటి వ్యత్యాసం చూపడానికి వీల్లేదంటూ ఆ నివేదిక పేర్కొంటున్నది.
14వ ఆర్థిక సంఘపు మొత్తం కాల పరిమితికి రెవిన్యూ లోటును భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. ఒక రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడంలో ఉండే ఒకే ఒక అదనపు వసతి, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల విషయంలో వాటికి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఉండే వాటా 90:10గా ఉంటుంది. అదే సమయంలో ఇతర సాధారణ రాష్ట్రాలకు ఈ వాటా విభజన 60:40గా ఉంటుంది. ఆ 30 శాతంలోని వ్యత్యాసం మొత్తంగా ఎంత ఉండబోతోందో ముందుగానే లెక్కకట్టి దానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
వాటిని విదేశీ సహాయంతో చేపట్టే పనులు రూపంలో ఇస్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆ రాష్ట్రం ఎంత నష్టపోతున్నదో ఆ మొత్తం లెక్కకట్టి అంతకంటే ఎక్కువగానే ఆ లోటును భర్తీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రత్యేక రాష్ట్రంగానే పరిగణిస్తోంది. అందుకే ప్రత్యేక ప్యాకేజీని కూడా ఇచ్చింది. రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో సమానంగా తన కాళ్ళ మీద తాను నిలబడే వరకూ ఈ సాయం అనేది నిరంతరాయంగా సాగుతుందని పేర్కొంది. ప్రాజెక్టుల జాబితా ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన సంస్థలు 7 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎస్సీఆర్, నిట్, ఐఐఐటీ, కేంద్రీయ విశ్వ విద్యాలయం, పెట్రోలియం విశ్వ విద్యాలయం, గిరిజనవిశ్వ విద్యాలయం, ఎన్ఐడీఎం, ఎస్పీయే, ఎన్ఎసీఈఎస్, తదితరమైన 12 జాతీయ సంస్థలను కేటాయించడం జరిగింది.
వీటితో పాటు విద్యాసంస్థలు (ప్రతిపాదించినవి/కేటాయించినవి) – ఐఐటీ, తిరుపతి – రూ. 700 కోట్లు – ఐఐఎం, విశాఖపట్నం-రూ 680 కోట్లు – ఐఐఎస్.ఈ.ఆర్ తిరుపతి-రూ 870 కోట్లు- ఐఐఐటీ, చిత్తూరు జిల్లా రూ. 130 కోట్లు-ఎన్ఐటీ, తాడేపల్లిగూడెం- రూ 300 కోట్లు- నేషనల్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూ 250 కోట్లు- విజయవాడలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ఎయిమ్స్ గుంటూరు రూ. 1618 కోట్లు- వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు, పెట్రోలియం విశ్వవిద్యాలయం గుంటూరు-విజయవాడ సూరంపల్లి వద్ద ఫ్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాతీయ సంస్థ (సీఐపీఈటీ) రూ. 25.4 కోట్లు -వీటికి అదనంగా లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన 10 కంటే ఎక్కువ మెగా ప్రాజెక్టులను కూడా కేటాయిస్తున్నారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్- మౌలిక వసతుల రంగం పోలవరం ప్రాజెక్టు-2014 నాటి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మొదటిరోజునే దీనికి సంబంధించి ఆర్డినెన్సు ఇచ్చారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలలో 850 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన రోజు నుంచి అంటే 2014 జూన్ 2 నుంచి అన్ని వ్యయాలను పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కేంద్ర మంత్రి, దాదాపు 65వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన రహదారి ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించారు. 392 కిలోమీటర్ల జాతీయ రహదారులు – అమరావతి చుట్టూ 186 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్ (ఓ.ఆర్.ఆర్), వివిధ దశల నుంచి కొత్త రాజధానిని అనుసంధానించే రింగు రోడ్డు, ప్రపంచంలోనే అతి పెద్ద అవుటర్ రింగురోడ్డుగా రూపొందబోతోంది.
కొత్త రాజధాని అమరావతిని అనంతపురం నుంచి కర్నూలు మీదుగా అనుసంధానిస్తూ మొత్తం 452 కిలోమీటర్ల రహదారి ప్రాజెక్టు… జాతీయ జలమార్గం 4- కృష్ణా గోదావరి నదుల్తో పాటుగా కాకినాడ- పుదుచ్చేరి జలమార్గపు వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఒప్పందం-విశాఖపట్టణం స్టీలుప్లాంటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం, విశాఖపట్టణంలో వివిధ ప్రాజెక్టులను 38500 కోట్ల రూపాయలతో చేపట్టడం, 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూడటం గురించిన ఒప్పందం. ఎనర్జీ – ఇంధన శాఖ- ఆంధ్రప్రదేశ్‌ను పవర్ ఆఫ్ ఆల్ ఒకటో దశ కార్యక్రమానికి ఎంపికచేయడం జరిగింది. దీని కింద దేశంలో కేవలం మూడే రాష్ట్రాలను ఎంపిక చేశారు.
డిస్కమ్‌లను మెరుగుపరచడానికి 2015లో ఉదయ్ పథకంలో చేర్చడం కూడా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 2500 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సోలార్ పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఎస్ఈసీఐ ఏపీ జెన్కో, ఎన్‌ఆర్‌ఈడీ క్యాప్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. అనంతపూర్ సోలార్ పవర్ పార్క్ (1500 మెగావాట్లు) కర్నూలు సోలార్ పవర్ పార్క్ (1000 మెగావాట్లు), హరిత ఇంధన ప్రాజెక్టులు (జీఈసీ) పథకాల కింద, ఆంధ్రప్రదేశ్‌లోని హరిత ట్రాన్స్మిషన్ కారిడార్ల కోసం రూ. 520 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు భారత్, జర్మనీల మధ్య రుణ ఒప్పందానికి కూడా సంతకాలు జరిగాయి. దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన కింద రూ.328.60 కోట్ల రూపాయల వరకూ గ్రామీణ విద్యుద్దీకరణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది.
విజయవాడ విమానాశ్రయం, ప్రస్తుతం ఉన్న ప్రయాణికుల టర్మినల్ సామర్థ్యాన్ని పెంచటం జరిగింది. కీలక సమయాల్లో వందమంది ప్రయాణీకుల నుంచి 250 మంది ప్రయాణీకులకు వీలుగా విస్తరించడంతో పాటు మరికొన్ని మౌలిక సదుపాయాలు కూడా కల్పించారు. తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగింది. సరికొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని 700 మంది ప్రయాణికులకు అనువుగా ఉండేలా రూపొందించారు. వీటిలో 500 మంది దేశీయ, 200 మంది అంతర్జీతీయ ప్రయాణీకులకు వీలుండేలా చేశారు.
విశాఖపట్టణం విమానాశ్రయం ప్రస్తుత సమీకృత టెర్మినల్ భవనం హుద్‌హుద్ తుఫాన్ కారణంగా దారుణంగా దెబ్బతినడంతో తుఫాన్ ముగిసిన తర్వాత 5రోజుల వ్యవధిలోనే తిరిగి వాడకంలోకి వచ్చేలా బాగుచేయడం జరిగింది.
రాజమండ్రి విమానాశ్రయంలో రాత్రివేళల్లో ల్యాండ్ అయ్యే ఏర్పాటు అందుబాటులోకి వచ్చింది. కడప విమానాశ్రయం స్థాయి పెంచడం పూర్తయింది. కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇక, రైల్వేల అభివృద్ధిలో భాగంగా 2014-15లో రూ.804 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. 2015-16లో ఆంధ్రప్రదేశ్‌కు రూ.2554 కోట్లను కేటాయించారు. కాకినాడ వద్ద మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటైంది. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ సంస్థ రూ. 450 కోట్లతో ఏర్పాటైంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్ నుంచి నడుస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్ పేరు మార్చడంతో పాటు కొత్తగా విశాఖపట్నం నుంచి దేశరాజధాని ఢిల్లీకి పూర్తి ఏసీ బోగీలతో ప్రత్యేక ఏపీ ఎక్స్‌ప్రెస్ రైలును ఏర్పాటుచేయడం జరిగింది. వీటితో పాటు విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లలో హై స్పీడ్ వైఫై హాట్ స్పాట్ల ఏర్పాటు కూడా పూర్తయింది.
జాతీయ సంస్థల ఏర్పాటు కూడా దాదాపు కార్య రూపందాల్చింది. అనంతపురం జిల్లా పాల సముద్రం వద్ద నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఎక్సయిజ్ అండ్ నార్కొటిక్స్ ఏర్పాటుకు రూ. 600 కోట్లు, నెల్లూరు జిల్లా చింతలదీవి గ్రామం వద్ద 2000 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ కామధేను పశు ఉత్పత్తి సంస్థ ఏర్పాటు, ఇతరత్ నెల్లూరులో దివ్యాంగులకు శిక్షణ ఇచ్చేందుకు మానసిక ఆరోగ్యం, పునరావాస ప్రాంతీయ కేంద్రం, భవనాల నిర్మాణానికి రూ. 20 కోట్లు, ఖర్చులకు రూ. 4కోట్లు కేటాయింపు పూర్తయింది. విజయవాడలో ప్రత్యేకమైన దూరదర్శన్ కేంద్రం ఏర్పాటు చేసి 2014లో సెప్టెంబరులో ప్రారంభించడం జరిగింది. ఈ కేంద్రానికి పింగళి వెంకయ్య పేరు నామకరణం చేశారు.
విజయవాడలో రీజినల్ పాస్ పోర్టు ఆఫీసు ఏర్పాటు చేశారు. పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం భారత ప్రభుత్వం నుంచి 3827 కోట్ల రూపాయలకు మించిన కేటాయింపులు జరిగాయి. హడ్కో నుంచి 7500 కోట్ల రూపాయల రుణం ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్మార్ట్ నగరాలను ఎంపిక చేయడం జరిగింది. విశాఖపట్టణం, కాకినాడ (మొదటిదశలోను) తిరుపతి (రెండోదశ)- రూ.1500 కోట్లతో అభివృద్ది చేస్తున్నారు. అందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే 1,93,147 ఇళ్లను కేటాయించడం జరిగింది. మొదటిదశలో మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే ఏపీకే ఎక్కువగా ఇచ్చారు.
రూ. 100 కోట్ల కేటాయింపులు, గుంటూరు భూగర్భ డ్రైనేజీ పథకానికి రూ. 540 కోట్లు, విజయవాడ వరదనీటి డ్రైనేజీకి రూ. 460 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని 33 పట్టణాలకు అమృత్ పథకం వర్తింపు స్వచ్చ భారత్‌కు రూ. 588 కోట్లు హౌసింగ్, అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 7500 కోట్ల రుణం. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి నిధుల కోసం వెసులుబాటు. చారిత్రక నగరం అమరావతికి హృదయ్ పథకం కింద రూ. 22 కోట్లు 2015లోనే విజయవాడ మెట్రోకు సూత్రప్రాయంగా అంగీకారం.
మంత్రిత్వ శాఖలోని ప్రీ పీఐబీ ద్వారా డీపీఆర్‌ను సమర్పించి ఆమోదించడం జరిగింది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో పీఐబీ సమావేశం జరగాల్సి ఉంది. విశాఖపట్టణం మెట్రో డీపీఆర్ వివిధ మంత్రిత్వ శాఖల మధ్య ఇంకా చర్చల దశలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని తొలుత స్మార్ట్ సిటీ మిషన్ నుంచి మినహాయించడం జరిగింది. ఇప్పుడు స్మార్ట్ సిటీ చాలెంజ్ పోటీలో పాల్గొనేందుకు అనుమతించారు. వాణిజ్యం, పరిశ్రమలు
విభాగంలోనూ కేటాయింపులు భారీగానే జరిగాయి. విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేయడానికి 1430 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. చెన్నై- బెంగుళూరు కారిడార్ కూడా ఆంధ్రప్రదేశ్ గుండానే వెళుతుంది.
7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు కూడా కేటాయించారు. రూ. 700 కోట్లు, ఖర్చుచేస్తే మరిన్న నిధులు విడుదలకు అంగీకారం. హుద్‌హుద్ తుఫాన్ పరిహారంగా రూ. 650 కోట్లు మంజూరుచేశారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం అంతర్జాతీయ లెదర్ కాంప్లెక్స్ (కే.పీ.ఐ.ఎల్.సీ) ఏర్పాటుకు 277.93 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో భారత ప్రభుత్వం రూ. 125 కోట్లను భరించనుంది. నెల్లూరులోని తడ వద్ద భారతీయ అంతర్జాతీయ సెజ్ రూ.240 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ఏర్పాటైంది. ఇందులో కేంద్ర ప్రభుత్వపు నిధులు రూ. 105 కోట్లు వెచ్చించనుంది. గుంటూరు జిల్లాలో 120 ఎకరాల్లో స్పైసెస్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
దినుసులు ప్రత్యేకంగా మిరపకాయల మార్కెట్‌కు కేంద్రంగా ఏర్పాటు చేశారు. కమ్యునికేషన్స్ అండ్ ఐటీకి సంబంధించినంత వరకూ విశాఖలో సమీర్ కేంద్రం (సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రిసెర్చ్) రూ. 80 కోట్లు దాదాపు 40 కోట్ల రూపాయల వ్యయంతో వుడా, ఎస్టీపీఐల సంయుక్త భాగస్వామ్యంతో ఒక లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ల నిర్మాణం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు మొబైల్ కమ్యునికేషన్ వ్యవస్థలను బీఎస్ఎన్ఎల్ (లైవ్)లలో ద్వారా ఏర్పాటు చేయడానికి 277.42 కోట్ల రూపాయలు కేటాయించారు. రక్షణ బొబ్బిలి వద్ద నౌకాదళ ఎయిర్ స్టేషన్ ప్రతిపాదన పూర్తయింది. అంచనా వ్యయం రూ.3266.50 కోట్లు రెండు దశల్లో అభివృద్ధి కృష్ణా జిల్లాలోని నాగనాయలంక వద్ద డీఆర్డీవో వారి క్షిపణి పరీక్షల వసతుల ఏర్పాటుకు రూ. 1000 కోట్లు కర్నూలుకు సమీపంలో 2900 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ ఓపెన్ ఎయిర్ రేంజి ఏర్పాటుకు ప్రణాళిక జరుగుతోంది. ఇది రక్షణ శాఖ అప్లికేషన్లకు పరీక్షా కేంద్రంగా ఉంటుంది.
రూ.500 కోట్లు అనంతపురం జిల్లాలోని పాలసముద్రం వద్ద భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)ను ప్రారంభించడం జరిగింది. అత్యుత్తమ వసతుల ఏర్పాటుకు, క్షిపణి భాగాల తయారీ, కూర్పులను నిర్వహించడానికి రూ. 600 కోట్లు. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో కొక్కిరాల కొండ వద్ద 1102.30 ఎకరాల విస్తీర్ణంలో భూములను సేకరించడం జరిగింది. ఇక్కడ ట్రూప్స్ , పర్సనల్ శిక్షణ కేంద్రానికి రూ. 500 కోట్లు మచిలీపట్నం సమీపంలో నిమ్మకూరు వద్ద ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (భెల్) తన ఆప్టిక్స్ తయారీ విభాగాన్ని మచిలీపట్నం- విజయవాడ రహదారి సమీపంలో విస్తరించడం జరుగుతోంది. దీనికోసం రూ. 100 కోట్లు కేటాయింపు జరిగింది.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం విషయంలో గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఏర్పారు చేస్తున్నారు. దీనికి రూ.1618 కోట్లు కేటాయించారు. విజయవాడ, అనంతపురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను పీ.ఎమ్.ఎస్.వై మూడో దశ కింద స్థాయి పెంచాలని నిర్ణయించారు. దీనికి రూ. 240 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంపోజిట్ ప్రాంతీయ కేంద్రానికి 2016 జనవరి 3న శంకుస్థాపన చేయడం జరిగింది. విశాఖలో ఈఎస్ఐ ద్వారా 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వైద్య కళాశాల ఏర్పాటు విశాఖపట్టణంలో ఈఎస్ఐ ద్వారా 200 పడకల దంత వైద్య ఆసుపత్రి, కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో యోగా, ప్రకృతి వైద్యంలో జాతీయ పరిశోధన సంస్థ ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది కేంద్రం. పెట్రోలియం, సహజవాయువులు అభివృద్ధి కింద రాష్ట్రంలో 52 వేల కోట్ల వ్యయంతో మూడు పెట్రో ప్రాజెక్టులు ఏర్పాటు, విస్తరణ పనులు జరుగుతున్నాయి. విశాఖపట్టణంలో బీపీసీఎల్ ద్వారా కొత్త ఎల్పీజీ ప్లాంట్ ఏర్పాటుకు 120 కోట్లు, రూ. 18400 కోట్ల వ్యయంతో రిఫైనరీ విస్తరణకు విశాఖపట్టణంలోని హెచ్‌పీసీఎల్ యజమాన్యానికి హరిత ఆమోదం మంజూరు పూర్తయింది. దీనిద్వారా ఏటా 8.33 మిలియన్ టన్నుల నుంచి 15 మిలియన్ టన్నులకు స్థాయి పెంచినట్లయింది.
పర్యావరణానికి సంబంధించిన ఇబ్బందులు ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా దీనికి అనుమతులు లభించడం లేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వం 2016 జనవరిలోనే ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అవసరమైన రక్షణ ఏర్పాట్లతో ముందుకెళ్ళాల్సిందిగా సూచించింది. గ్రామీణాభివృద్ధి తాగునీటి సదుపాయం, గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులకు భారత ప్రభుత్వం ద్వారా రూ. 656.15 కోట్ల విడుదల చేశారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్ఆర్డీడబ్యూ.పీ) పథకాలను చేపట్టేందుకు రూ. 456.15 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై)కి రూ. 200 కోట్లు వెచ్చించారు. నౌకారంగం భారతప్రభుత్వం ద్వారా మొత్తం రూ.1665 కోట్లు విడుదల చేశారు. క్వే బెర్తుల పునరుద్దరణరకు (ఈక్యూ 2,3,4,5)లకు – రూ. 600 కోట్లు కేటాయిస్తూ చర్యలు తీసుకున్నారు. మల్టి మోడల్ లాజిస్టిక్ హబ్ కోసం రూ.372 కోట్లు కేటాయించారు.
ఈక్యూ 1 బెర్తుకు దక్షిణం వైపున ఈక్యూ 1 ఏ బెర్తు అభివృద్ధి రూ.313 కోట్లు కేటాయించారు. అంతర్ హార్బర్ మలుపుల సర్కిల్ వద్ద డ్రెడ్జింగ్ మూడో దశ చేపట్టడానికి రూ. 280 కోట్లు మంజూరుచేశారు. బీవోటీ విధానంలో కంటైనర్ రవాణా స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 100 కోట్లు, పర్యాటక రంగం నిమిత్తం కోనసీమ, కాకినాడ హోప్ ద్వీపం అభివృద్ధికి రూ. 69.83 కోట్లు, తిరుపతిలో భారతీయ పాకశాస్త్ర సంస్థ ఏర్పాటుకు రూ. 100 కోట్లు, నెల్లూరు తీరప్రాంత పర్యాటక సర్క్యూట్ అభివృద్ధికి రూ.61 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెగ్జింగ్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎరువులు, రసాయనాలు రంగంలో విశాఖలో గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్ కాంప్లెక్సు మంజూరుకు ప్రకటన చేశారు.
విశాఖపట్టణంలో నేషనల్ ఇన్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యుటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఎన్.ఐ.పీ.ఈ.ఆర్) సంస్థ ఏర్పాటు, 5000 మందిని విద్యనభ్యసించే వీలు కల్పిస్తూ విజయవాడ సమీపంలో బీటెక్, ఎంటెక్ కోర్సులను అందించేలా ఫ్లాస్టిక్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాతీయ సంస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. రూ. 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయనే అంచనాలతో ఆంధ్రప్రదేశ్‌లో వైద్య పరికరాల ఉత్పత్తి పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక మంజూరులు, కేటాయింపుల కింద కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకూ మొత్తం రూ. 34,426.23 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వనరుల వ్యత్యాసాన్ని పూరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి రూ.2303 కోట్ల గ్రాంటు విడుదలయింది.
కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా కింద రూ. 22,637.97 కోట్లు, రెవెన్యూ లోటు పూడ్చడానికి సాయంగా గ్రాంటు రూ.6609 కోట్లు, గ్రామీణ స్థానిక సంస్థలకు సాయంగా గ్రాంటు రూ. 934.34 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు సాయంగా గ్రాంటు రూ. 348.92 కోట్లు, రాష్ట్ర విపత్తు యాజమాన్య నిధికి రూ. 393కోట్లు, ఆర్థిక గ్రాంట్లుగా అమరావతిలో నూతన రాజ్‌భవన్, అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు గాను బడ్జెట్ ద్వారా 2014-15లో రూ. 1500 కోట్లు, 2015-16 సంవత్సరంలో రూ. 350 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ. 700 కోట్లు కేటాయింపులు చేశారు. 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో నోటిఫై చేసిన వెనుకబడిన ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలనీ నిర్ణయింది కేంద్రం. కొత్తగా సమీకరించే ఆస్తుల విలువలో 15 శాతం అదనపు పెట్టుబడి అలెవెన్స్ ఇవ్వనున్నారు.
ఉత్పాదక సంస్థలలో ఏర్పాటు చేసిన కొత్త యంత్రాల వాస్తవ విలువలో 20 శాతానికి బదులుగా, 35 శాతం అదనపు తరుగుదల నిధులు, రాబోయే అయిదేళ్లలో ఏటా రూ. 41,364 కోట్లు లభించేలా ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ. 2,06,819 కోట్లు లభిస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అయిదేళ్లపాటూ ఒక్కో ఏడాదిలో అదనంగా రూ.29,374 కోట్లు లభిస్తాయి. 13వ ఆర్థిక సంఘంతో పోల్చినప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా ఈ అదనపు మొత్తం లభిస్తుంది. త్వరలోనే ప్రారంభం అయ్యేవి… విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం, గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వేజోన్, దుగ్గరాజపట్నం ఓడరేవు, మన్నవరం ప్రాజెక్టు పునరుద్ధరణ, జలరవాణాకు వీలుగా బకింగ్ హామ్ కాలువ పునరుద్ధరణ, నెల్లూరులో ఎన్సీఈఆర్టీ కేంద్రం, నెల్లూరు, గుంటూరుల్లో క్యాన్సర్ యూనిట్లు, కాకినాడలో ఫారిన్ ట్రేడ్ ఇన్స్టిట్యూట్, అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, గుంటూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వంటివి మరెన్నో ఏర్పటుకానున్నాయి.
ఈ విధంగా చూసుకుంటే ప్రత్యేక హోదా కంటే కూడా అదనంగానే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి నిధులు, కేటాయింపులు వస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హోదా ఉద్యమాలంటూ కేంద్రంతో గొడవకు దిగడం ద్వారా వైరం పెంచుకోవడం మినహా అదనంగా ఏదీ సాధించే పరిస్థితి అయితే లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం ఉన్న మిత్రపక్ష ధోరణిలోనే భవిష్యత్తులోనూ మసలుకుంటే రాష్ట్రం అనుకున్న సమయం కంటే ముందుగానే స్వయం సమృద్ధి సాధించి దేశంలోనే అత్యుత్తమ నగరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందనడంలో సందేహంలేదు.


