ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే?
విశాఖపట్నం, సెప్టెంబర్ 4 (న్యూస్‌టైమ్): ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ (ఆర్కె) సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీంతో ఏఓబీ పరిధిలో కలకలం మొదలైంది. ఇటీవలి కాలంలో సీలేరు సమీపంలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు ముగ్గురు జవాన్లు, ఒక గిరిజనుడు మృతి చెందారు.
మరో ఎనిమిది మంది బీఎస్ఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదిలికలపై గ్రేహౌండ్స్, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఏఎన్ఎస్, ఏపీఎస్పీ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఇటీవలి కాలంలో మావోయిస్టు పార్టీ అగ్రనేత రామకృష్ణ(ఆర్కె) తూర్పు, విశాఖ, ఖమ్మం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సంచరించినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. సీలేరు వద్ద సంఘటనతో మావోయిస్టులపై ప్రతి దాడికి పాల్పడాలనే సంకల్పంతో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ను నిర్వహిస్తున్నారు.
ఒకపక్క ఆర్కె సంచారం, మరోపక్క పోలీసు బలగాల కూంబింగ్‌తో అటవీ ప్రాంతంలో కలకలం రేగుతోంది. పోలీసుల, మావోయిస్టుల చర్యలతో గిరిజన యువత పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఇటీవల కాలంలో మావోయిస్టులకు సంబంధించి భారీ డంప్‌ను వైరామవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి పోలీసు ఇన్ఫార్మర్లే కారణమని మావోయిస్టులు భావిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలోని భీమవరం, బంగారుబందుల, ఎండకోట, తూర్పు గోదావరి జిల్లాలోని గుర్తేడు, ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తూ ఇన్ఫార్మర్ల కోసం ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా, ఏజెన్సీలో మావోయిస్టుల కార్యకలాపాలు చాపకింద నీరులా సాగిపోతున్నాయి.
లోతట్టు అటవీ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు, పోలీసులకు సహకరిస్తున్న వారి గురించి మావోయిస్టులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తూర్పు, విశాఖ ప్లాటూన్లుగా విడిపోయి అడవిలో సంచరిస్తున్నారు. దీనికి కేంద్ర స్థాయి నాయకులే నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తూర్పు గోదావరి, ఖమ్మం, విశాఖపట్నం సరిహద్దుల్లో సంచరిస్తున్న మావోయిస్టుల్లో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.


