ఆకట్టుకునే ‘లవణ మందిరం’
- 109 Views
- wadminw
- October 4, 2016
- అంతర్జాతీయం
స్పానిష్ భాషలో పాలెస్ ఆఫ్ సాల్ట్‌గా ముద్దుగా పిలుచుకునే పాలాసియో డి సాల్ హోటల్ పూర్తిగా ఉప్పు దిమ్మలతో నిర్మితమైందన్న విషయం ప్రపంచంలో చాలా మందికి తెలియదు. ఇది ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు క్షేత్రం అయిన సలార్ డి ఉయుని వద్ద ఉంది. ఇది 10582 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలది. ఇది బొలీవియా దేశ ముఖ్య పట్టణం లా పాజ్‌కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ప్రాంతం సలార్ డి ఉయుమి. ఇది బొలీవియా వాయువ్య ప్రాంతంలో పొటోసి, ఓరుడి సంస్థ వద్ద ఉన్నది. ఇది ఆండీస్ పర్వత శిఖరం నుండి 3656 మీటర్ల ఎత్తులో గలదు. ఈ హోటల్ ఒక పర్యాటక ప్రదేశం.
ఇది ఎందరో పర్యాటకులను ఆకర్షించే హోటల్. అనేక ప్రాంతాల నుండి ఈ హోటల్లో విశ్రాంతి కోసం అనేక మంది వస్తుంటారు. బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ లవణ మందిరం ఉంది. విశాలమైన 12 గదులు, మంచాలు, కుర్చీలు, ఇతర వస్తుసామగ్రి మొత్తాన్ని ఉప్పుతోనే చేశారు. దీని పేరు పాలాసియో డి సాల్. అంటే స్పానిష్ భాషలో ఉప్పు ప్యాలెస్ అని అర్థం. దీని నిర్మాణానికి 15 అంగుళాల ఉప్పు ఘనాలను ఏకంగా 10 లక్షలు తయారు చేసి వాటితో కట్టారు. ఇందులో అలంకరణ కోసం పెట్టిన శిల్పాలు, కళాఖండాలు కూడా ఉప్పుతో మలిచినవే కావడం విశేషం. ఇందులోని ఈతకొలనులో ఉప్పు నీరే ఉంటుంది. హోటల్ బయట గోల్ఫ్ కోర్స్ కూడా ఉప్పు మయమే.
అసలు దీన్నెందుకు కట్టారంటే ఆ ప్రాంతం గురించి చెప్పుకోవాలి. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో ఉండే అక్కడి ప్రదేశమంతా ఎటుచూసినా ఉప్పే. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఉప్పు క్షేత్రం. దీని మొత్తం విస్తీర్ణం 10,582 చదరపు కిలోమీటర్లు. అంటే హైదరాబాద్ నగరానికి 20 రెట్లు పెద్దదన్నమాట! కనుచూపుమేర ఎటుచూసినా అంతులేని ఉప్పు మేటలతో, ఉప్పు ఎడారిలా ఉంటుంది. దీన్ని చూడ్డానికి నిత్యం వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. వాళ్ల వసతి కోసమే ఈ ఉప్పు హోటల్‌ను కట్టారు. దీన్ని నిజానికి 1993-1995 మధ్య కట్టినా రెండేళ్లలోనే మూసివేశారు. తిరిగి 2007లో సకల సౌకర్యాలతో నిర్మించారు. ఉప్పు దిమ్మలతో కూడిన ఈ హోటల్ పర్యాటక కేంద్రంగా మారింది.
ఇక్కడకు వచ్చే పర్యాటకులు గోడల్ని నాకకుండా సిబ్బంది పరిశీలిస్తూ ఉంటారు. ఈ హోటల్లో 12 కామన్ బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఒక కామన్ బాత్ రూమ్ ఉంది. కానీ అందులో షవర్ లేదు. ఈ ప్రాంతం ఎడారికి మధ్యలోని ప్రాంతం కనుక ఇక్కడ అనేక శానిటారీ సమస్యలు తలెత్తి అధిక వ్యర్థ పదార్థాలు మనుష్యులే బాగుచేయవలసి ఉన్నది. అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నందున ఈ హోటల్‌ను 2002లో నిర్మూలించారు. కానీ 2007లో ఈ హోటల్‌ను పాలాసియో డి సాల్ పేరుతో కొత్త ప్రదేశంలో అనగా సాలర్ డి ఉయుమికి తూర్పుగా 25 కిలోమీటర్ల దూరంలో పునర్నిర్మించారు. ఈ క్రొత్త ప్రదేశం బొలీవియా రాజధాని నగరమైన లా పాజ్‌కు దక్షిణంగా 350 కిలోమీటర్ల దూరంలో గలదు.
ఈ భవన నిర్మాణానికి 35 సెంటీమీటర్లు. (14 అంగుళాలు) గల ఉప్పు దిమ్మలు దాదాపు పది లక్షల వరకూ వినియోగించినట్లు సమాచారం. వీటిని గదులలో నేలకు, గోడలకు, సీలింగ్‌కు, ఫర్నిచర్ (బెడ్స్, టేబుల్స్, కుర్చీలు) శిల్పాల నిర్మాణానికి ఉపయోగించినట్లు కనిపిస్తోంది. ఈ హోటల్లో శానిటరీ వ్యవస్థను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నిర్మించటం విశేషం. ఈ హోటల్లో డ్రై సౌనా, ఆవిరి గది, ఉప్పు నీటి కొలను, విర్ల్‌పూల్ బాత్‌లు ఉన్నాయి. ఇక, ఈ అరుదైన లవణ మందిరానికి కేంద్ర బిందువైన బొలీవియాకూ ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉందనే చెప్పాలి. దీని అధికారికనామం బొలీవియా గణతంత్రం. ఇదో భూపరివేష్టిత దేశంగా గుర్తింపు పొందింది.
దక్షిణ అమెరికాలోని మధ్యప్రాంతంలోని ఈ దేశానికి ఉత్తరం, తూర్పున బ్రెజిల్, దక్షిణాన అర్జెంటీనా, పరాగ్వే, పశ్చిమాన చిలీ, పెరూ దేశాలు విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో బొలీవియా నిత్యదరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న దేశంగానూ చరిత్రకెక్కింది. ఇక్కడ ద్రవ్యోల్బణం చాలా ఎక్కువ. ప్రభుత్వ అస్థిరత చాలా తీవ్రంగా ఉంది. 16వ శతాబ్దంలో ఈ దేశం స్పెయిన్ దేశపు రాజుల అధీనంలో ఉన్నప్పుడు ఇక్కడ పనులు చేయడానికి భారతదేశం నుండి ప్రజలను తీసుకువచ్చి బానిసలుగా మార్చి వ్యవసాయ పనులు చేయించేవారట. అలా భారతీయులు శతాబ్దాలుగా ఇక్కడ బానిసలుగా బతికి ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక అక్కడ ప్రజలుగా మారిపోయారు.
ఇతర దేశాలు వీలైనంతగా ఈ దేశ భూభాగాన్ని లాక్కున్నట్లు చరిత్ర ఆధారాలు రుజువుచేస్తున్నాయి. 1952 తర్వాత మాత్రమే భారత సంతతి వారికి కొంత లాభం చేకూరింది. దేశంలో దాదాపు 50 శాతం భూమి వ్యవసాయానికి గానీ, నివాసానికి గానీ వీలుగా లేదు. జనాభా అంతా కేవలం 50 శాతం భూభాగంలోనే కేంద్రీకృతమైంది. దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 9 విభాగాలుగా విభజించారు. వీటిని తిరిగి ప్రావిన్స్‌లుగా, మున్సిపాలిటీలుగా, కాంటన్‌లుగా విభజించారు. అన్ని ప్రాంతాల్లో స్వతంత్రపాలన ఉంటుంది. అన్నింటినీ దేశాధ్యక్షుడు పర్యవేక్షిస్తారు. ఇక్కడ ఎటువైపు తొంగిచూసినా లాటిన్ అమెరికా సంస్కృతి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది.
దేశప్రజలు తమ గతకాలపు సంస్కృతిని కాపాడుకోవడానికి వివిధ దేశవాళీ పండుగలను నిర్వహించుకుంటారు. వీటిలో ముఖ్యమైనది-కాపోరేల్స్ దీనిని దేశమంతటా జరుపుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల ప్రజలు వివిధ రీతులలో వస్త్రధారణ చేస్తారు. మొత్తంగా చూస్తే దేశంలో 30 రకాల వస్త్రరీతులు కనబడతాయి. మహిళలు భుజాల నుండి మోకాళ్ల కింది వరకు వచ్చే స్కర్టు ధరిస్తారు. ఇక్కడి ప్రజలు తినే మధ్యాహ్న భోజనాన్ని అల్‌మూర్జో అంటారు. ఈ భోజనంలో సూప్, మాంసం, అన్నం, బంగాళా దుంపలు ఉంటాయి. ఉదయం పూట మనం తినే కజ్జికాయలు లాంటివి తయారుచేస్తారు. వీటిని వెన్న, ఉల్లిపాయలు, ఆలివ్‌లు, లోకోటోలతో కలిపి తయారుచేస్తారు.
పందిమాంసం, సూప్, బీన్స్‌వేపుడు వంటివాటిని భోజనంలో తీసుకుంటారు. బొలీవియా టీ(చాయ్)ని ఆపి అంటారు. ఇది నిమ్మరసం, మొక్కజొన్నపిండి, యాలకులు, లవంగాలు, కోకో ఆకులు మిశ్రమం చేసి పొడిని తయారుచేసి ఆ పొడిని వేడినీటిలో వేసి కాచి వడబోసి తాగుతారు. వరి అన్నం, వెన్న కలిపి తయారు చేసే వంటకాన్ని ఆర్రోజ్ కాన్ క్వెసో అంటారు. బొలీవియాలో వరి అన్నం పుష్కలంగా దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ వరిధాన్యం బాగా పండుతుంది. బొలీవియా దేశానికి పరిపాలన రాజధాని నగరం. ఈ నగరం మొత్తం కొండలపైనే ఉంటుంది. ప్రపంచంలో అతి ఎత్తై రాజధాని నగరం లాపాజ్. ఇది భూమి నుండి దాదాపు 3650 మీటర్ల ఎత్తులో ఉంది.
అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం కూడా ఇదే. ఈ నగరం 15వ శతాబ్దం నుండి ఉనికిలో ఉంది. చుట్టూ ఆండీస్ పర్వత శ్రేణులు నగరాన్ని ఎంతో అందాన్ని ఇస్తుంటాయి. నగరంలో సగర్‌నాగ వీధి ఎప్పుడూ యాత్రీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ నగరంలో దయ్యాల మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్లో ఎండబెట్టిన కప్పలు, కొన్ని సముద్ర జంతువులను అమ్ముతారు. బ్లాక్ మార్కెట్ అని పిలుచుకునే మెర్కాడో నెగ్రో అనే ప్రాంతంలో ఎక్కువగా దుస్తులు, సంగీత పరికరాలు అమ్ముతారు. నగరంలో ఇంకా కల్లెజాన్, ప్లాజా మురిల్లో, వల్లెడిలా లూనా ప్రాంతాలతో బాటు సాన్‌ఫ్రాన్సిస్కో మ్యూజియం, టివనాకు మ్యూజియం, కోకా మ్యూజియం, మ్యూజియం ఆఫ్ మెటల్స్ ప్రదేశాలు దర్శించతగినవి.
మరోవైపు, బొలీవియాలో వెండిగనులు పోటోసిలో ఉన్నాయి. ఇక్కడ క్రీస్తుశకం 1545 నుండి కొండలను తవ్వి వెండిని తీస్తున్నారు. ఈ నగరాన్ని సెర్రోరికో అంటారు. ఒకప్పుడు ఈ నగరం మొత్తం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన నగరంగా పేరుగాంచింది. ఈ గనులలోకి పర్యాటకులు వెళ్ళి అక్కడి గనుల తవ్వకాన్ని, ముడి ఖనిజాలను స్వయంగా చూడవచ్చు. ఈ గనులు భూమికి 240 మీటర్ల లోతులో ఉంటాయి. గనిలోపలి భాగాన్ని పైలావిరి అంటారు. ఇందులోకి పర్యాటకులు నేరుగా వెళ్ళే అవకాశం ఉంది. గని ముందుభాగంలో గనులరాజు బొమ్మ విచిత్రంగా కనబడుతుంది. ఇక్కడ వెండిని గత 455 సంవత్సరాలుగా నిరంతరం వెలికితీస్తూనే ఉన్నారు.
ఈ గనులలో దాదాపు 10 వేలమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు. ఉప్పు మైదానంగా పేరుగాంచిన ప్రాంతం పోటోసి నగరానికి సమీపంలో ఉంది. దేశానికి దక్షిణ భాగంలో ఉంది. ఇది 11 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ప్రపంచంలోనే అత్యంత విశాలమైన ఉప్పు మైదానంగా ప్రసిద్ధి చెందింది. దీనిని ఉప్పు ఎడారిగా పిలవవచ్చు. ఈ ఉప్పు మైదానం సముద్రమట్టానికి 3600 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో ఇలా ఉప్పు ఎడారి ఎలా ఏర్పడిందో తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతం ఒక సముద్ర ద్వీపం. దాదాపు 13వేల సంవత్సరాల క్రితం ఇందులోని నీరంతా ఆవిరైపోయి ఉప్పు మాత్రమే మిగిలింది. మధ్యభాగంలో ఉప్పు 10 మీటర్ల మందంలో ఉంటుంది.
ఈ ఉప్పు ఎడారి మీద నిలబడితే మేఘాలు మనల్ని తగులుతూ కదులుతుంటాయి. పర్యాటకులకు ఇదో విచిత్రమైన అనుభవం. ఎప్పుడు తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఎడారిమీద గాలివీయడం వల్ల మైదానంలో పాలిహైడ్రల్ గుర్తులు ఏర్పడతాయి. వాటిని చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఫ్లెమింగోలు, ఆండియన్‌జాతి నక్కలు అధికంగా అగుపిస్తాయి. రాజధాని లాపాజ్ నుండి దాదాపు 12 గంటల ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక, జెసూట్ మిషన్స్ ఒకప్పుడు అడవి. ఇక్కడికి క్రైస్తవ మిషనరీలు వచ్చి ఆటవికులనందరినీ క్రైస్తవులుగా మార్చారు. ఆ తర్వాత స్పెయిన్ దేశం బొలీవియాను తమ అధీనంలోకి తీసుకున్నాక ఈ ప్రాంతంలో చర్చిల నిర్మాణం జరిగింది.
ఈ ప్రాంతాన్ని చికిటో అంటారు. ఈ ప్రాంతం 16వ శతాబ్దంలో కనుగొనబడి నేటికీ ఆనాటి వాతావరణంలోనే ఉండడం ఒక గొప్ప విశేషం. ఇక్కడి నిర్మాణాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇది పర్యాటకులను విపరీతంగా ఆకర్షించే విషయం. చర్చిల లోపల ఎంతో అందమైన నిర్మాణశైలి కనబడుతుంది. బంగారంతో చేసిన అలంకరణలు నేటికీ అలాగే ఉన్నాయి. ఈ ప్రదేశం సాంటాక్రజ్‌కు సమీపంలో ఉంది. మొదట జెసూట్లు ఇక్కడికి వచ్చి భూమి మీద దేవుడి నగరాన్ని నిర్మించాలని పూనుకున్నారు. ఆ ప్రాంతానికి ఇప్పుడు వెళితే 17వ శతాబ్దపు కాలంలోకి వెళ్లినట్లుగా అనుభూతి కలుగుతుంది. 1991లో ఈ మొత్తం ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేసింది.


