ఆకట్టుకున్న ‘బాలి’ బొమ్మల కొలువు
విశాఖనగరంలోని ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో బాలి బొమ్మల కొలువు పేరిట ఏర్పాటు చేసిన ప్రముఖ చిత్రకారుడు బాలి కథన చిత్రకళా ప్రదర్శన అందరినీ ఆట్టుకుంటోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను ది విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం అద్యక్షులు, విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి టిఎస్ఆర్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రకారులు బాలిగా పేరు పొందిన మేడిశెట్టి శంకర్రావును అభినందించారు. విశాఖ నగరం సంగీత, సాహిత్య కళలకు పెట్టింది పేరు అని, ఈ క్రమంలోనే విశాఖ ప్రాంతానికి చెందిన బాలి పలు ప్రధాన దిన పత్రికల్లో పనిచేసిన అనుభవంతో గతంలో తాను చిత్రీకరించిన ఎన్నొ విభిన్న అంశాలతో కూడిన చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉంచి, నగర వాసుల సందర్శనకు పెట్టడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్ధల అధినేత వాసు ప్రకాష్ మాట్లాడుతూ భాషకు అతీతంగా చూపరులకు వెంటనే స్పురణకు వచ్చేలా శ్రీమధ్భావగత, రామాయణ కధనాలను అంశంగా ఎంచుకుని చిత్రీకరించడం అద్భుతమన్నారు. విశిష్ట అతిధిగా పాల్గొన్న వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అద్యక్షుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో సుమారు 40 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో తాను గీసిన ప్రతి చిత్రం ఒక్కొక్క ఆణిముత్యంగా అభివర్ణించారు. ఆయా సామాజిక రాజకీయ పరిస్ధితులను బట్టి, సందర్భోచితంగా బాలి గీసిన ప్రతి గీత ఒక్కొ అద్భుత చిత్రంగా మారిందన్నారు. ప్రదర్శన కర్త బాలి మాట్లాడుతూ చిన్నతనంలో ఒక ప్రవృత్తిగా నేర్చుకున్న చిత్ర కళే నేడు జీవనాధారంగా మారిందని, తన జీవనగమనంలో చిత్రకళే ప్రధాన పాత్ర పోషించిందన్నారు.
నేడు చిన్నారుల్లో ఆలోచనా శక్తి, గ్రహణ శక్తి అద్భుతంగా ఉందని, వారి ఆలోచనలు, అభిలాషలకు అనువుగా వారికి చిత్రకళలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా చిన్నారులను ప్రోత్సహించాలన్నారు. చిత్ర ప్రదర్శన సూర్యా ఆర్ట్స్ అకాడమీ బ్యానర్ పై సంస్ధ డైరక్టర్ శంకర్ నీలు భాగవతుల ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ సూర్యా ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యవంలో చిన్న పిల్లలకు, ఆసక్తి కల విద్యార్ధినీ విద్యార్ధులకు చిత్ర కళలో శిక్షణ అందిస్తున్నామన్నారు. తమ సంస్ధలో శిక్షణ పొందిన కళాకారులు వివిధ జిల్లా స్ధాయి, రాష్ట్ర స్ధాయి, జాతీయ స్ధాయి చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గోంటూ అనేక బహుమతులు పొందారన్నారు.
గత 50 సంవత్సరాల కాలంలో తన కుంచె నుంచి వెలువరించిన అనేక చిత్రాలను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచామన్నారు. వీటిల్లో ప్రథానంగా బుద్దుని జీవన చరిత్ర, శ్రీ రామాయణ ఘట్టాలు, చిన్న పిల్లల సాహిత్యానికి చెందినవి, వివిధ నవలల ముఖ చిత్రాలు, అనేక కధా సన్నివేశాలకు వేసిన చిత్రాలు కలిసి సుమారు 200 చిత్రాలను ఈ ప్రదర్శనలో ఉన్నా యన్నారు. ఈ చిత్ర ప్రదర్శనను నగరవాసులు అత్యంత ఆసక్తితో వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎయు మాజీ డిప్యూటీ రిజిస్ట్రార్ నటరాజ్, యోహాన్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.


